టెలికాం రంగ ఆదాయం రూ.3.72 లక్షల కోట్లు
ABN , Publish Date - Apr 25 , 2026 | 02:56 AM
కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్, 6జీ సాంకేతికత తదితర రంగాలు భారత డిజిటల్ భవిష్యత్తుకు కీలకమని టెలికాం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు....
అక్టోబరు నాటికి కొత్త టెక్నాలజీ డెవల్‌పమెంట్ ఫండ్
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్, 6జీ సాంకేతికత తదితర రంగాలు భారత డిజిటల్ భవిష్యత్తుకు కీలకమని టెలికాం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం నాడిక్కడ సెల్యూలార్ ఆపరేటర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) నిర్వహించిన డిజికామ్ సమ్మిట్-2026లో ఆయన మాట్లాడుతూ.. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ టెలికాం రంగంలో సమూల ప్రక్షాళన జరిగిందని అన్నారు. టెలికాం రంగంలో సమగ్ర సంస్కరణలు అమలు చేసి, ఆ రంగానికి స్థిరత్వం, పారదర్శకత తీసుకువచ్చామని పేర్కొన్నారు. టెలికాం రంగ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.3.72 లక్షల కోట్లకు చేరుకుందని, ఈ రంగంలోకి రూ.2.4 లక్షల కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు రావడం భారత్‌పై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. టెలికాం తయారీ రంగంలో పీఎల్‌ఐ పథకం ద్వారా రూ.65,000 కోట్లకు పైగా ఉత్పత్తి, రూ.12,000 కోట్ల ఎగుమతులు సాధించడం స్వదేశీ తయారీ శక్తిని బలోపేతం చేసిందని చెప్పారు.
కాగా అక్టోబరు నాటికి సరికొత్త టెలికాం టెక్నాలజీ డెవల్‌పమెంట్ ఫండ్ (టీటీడీఎ్‌ఫ)ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. ఈ కొత్త ఫండ్‌లో భారీ పెట్టుబడులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిధులను సమకూర్చే కో-ఫండింగ్ పద్ధతిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీని ద్వారా నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా స్టార్టప్‌లకు మరింత వెన్నుదన్నుగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
కాగా ప్రస్తుతం ఉన్న టీటీడీఎఫ్ పథకం కింద ఇప్పటికే 100కు పైగా కంపెనీలకు రూ.540 కోట్లు మంజూరు చేశామని, ఇందులో అధిక శాతం ప్రాజెక్టులు 6జీ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించినవేనని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News