ఎగుమతులు అదుర్స్
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:06 AM
అక్టోబరు నెలలో మన దేశం నుంచి రికార్డు స్థాయిలో 4,947 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.66 లక్షల కోట్లు) విలువైన వస్తువులు ఎగుమతయ్యాయి
అక్టోబరులో 45శాతం పెరిగిన ఎగుమతులు
న్యూఢిల్లీ: అక్టోబరు నెలలో మన దేశం నుంచి రికార్డు స్థాయిలో 4,947 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.66 లక్షల కోట్లు) విలువైన వస్తువులు ఎగుమతయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 45 శాతం ఎక్కువ. పెట్రో ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, జెమ్స్ అండ్ జువెలరీ, ఆర్గానిక్, ఇన్‌ఆర్గానిక్ రసాయనాలు, ఇంజనీరింగ్ పరికరాల ఎగుమతులు ఇందుకు ప్రధానంగా దోహదం చేశాయి. ఇదే సమయంలో వస్తు దిగుమతులు 8,935 కోట్ల డాలర్లకు చేరాయి. దీంతో అక్టోబరులో 3,988 కోట్ల డాలర్ల వాణిజ్య లోటు నమోదైనట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది అక్టోబరులో నమోదైన వాణిజ్య లోటుతో పోలిస్తే ఇది 270 కోట్ల డాలర్లు తక్కువ. ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబరు కాలానికి చూసినా వస్తు ఎగుమతులు... గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 21.96 శాతం వృద్ధి రేటుతో 25,340 కోట్ల డాలర్ల నుంచి 30,906 కోట్ల డాలర్లకు చేరినట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో సేవల ఎగుమతులూ 3,517 కోట్ల డాలర్ల నుంచి 4051 కోట్ల డాలర్లకు చేరాయి. దిగుమతులు 1,773 కోట్ల డాలర్ల నుంచి 2,072 కోట్ల డాలర్లకు పెరిగాయి. వస్తు, సేవల మొత్తం ఎగుమతులను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది అక్టోబరులో 8,999 కోట్ల డాలర్ల (సుమారు రూ.8.47 లక్షల కోట్లు) రికార్డు స్థాయికి చేరినట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ చెప్పారు. దీంతో వాణిజ్య లోటు 2,009 కోట్ల డాలర్లకు తగ్గింది.
పసిడి దిగుమతులు ఢమాల్
గత నెల పసిడి దిగుమతులు మాత్రం భారీగా పడిపోయాయి. గత ఏడాది అక్టోబరులో 1,472 కోట్ల డాలర్ల వరకు ఉన్న ఈ దిగుమతులు, ఈ ఏడాది అక్టోబరులో 62.57 శాతం తగ్గి 551 కోట్ల డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలకు చూసినా పసిడి దిగుమతులు, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 39.9 శాతం తగ్గి 2,478 కోట్ల డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 4,000 డాలర్ల దిగువకు రావడంతో, పసిడి ధర మరింత తగ్గుతుందనే అంచనాలే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
నగల ఎగుమతులు పైపైకి..
ఈ ఏడాది అక్టోబరు నెల నగలు, వజ్రాభరణాల పరిశ్రమకి బాగానే కలిసొచ్చింది. ఈ కాలంలో ఈ పరిశ్రమ 292 కోట్ల డాలర్ల (సుమారు రూ.27,862.82 కోట్లు) ఎగుమతులు నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 34.01 శాతం ఎక్కువ. అమెరికా, యూరప్ దేశాల్లో క్రిస్మస్, నూతన సంవత్సర షాపింగ్ సీజన్ దగ్గర పడడం ఇందుకు బాగా కలిసొచ్చినట్టు జెమ్స్ అండ్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబరు కాలానికి చూసినా మన దేశం నుంచి 1,722 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,63,961.74 కోట్లు) విలువైన నగలు ఎగుమతి అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.28 శాతం ఎక్కువ. అమెరికా, యూరప్, పశ్చిమాసియా దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలోనూ మన దేశ వజ్రాభరణాల ఎగుమతులు పుంజుకోవడం విశేషం.
ఇవి కూాడా చదవండి..
విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!
అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి