‘ఏఐ’తో అవకాశాలు ఉంటాయ్
ABN , Publish Date - Mar 06 , 2026 | 05:24 AM
ఉద్యోగాలపై కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం గురించి మరీ అంతగా భయపడాల్సిన అవసరం లేదని ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ ఇండియా సీఎండీ రాజేశ్ వారియర్ అన్నారు..
ప్రపంచ ఏఐ ఆఫీసుగా భారత్
కాగ్నిజెంట్ ఇండియా ఎండీ రాజేశ్ వారియర్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఉద్యోగాలపై కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం గురించి మరీ అంతగా భయపడాల్సిన అవసరం లేదని ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ ఇండియా సీఎండీ రాజేశ్ వారియర్ అన్నారు. ఈ సరికొత్త టెక్నాలజీతో అవాంతరాలతో పాటు అదే స్థాయిలో అవకాశాలూ ఏర్పడతాయని గురువారం జరిగిన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) వార్షిక సదస్సులో స్పష్టం చేశారు. 90వ దశకంలో ఆఫీసుల్లో కంప్యూటర్లు ప్రవేశపెట్టినప్పుడు ఇలానే ఆందోళన వ్యక్తమైన విషయాన్ని గుర్తు చేశారు. అవునన్నా కాదన్నా భవిష్యత్ ఆర్థిక అభివృద్ధిలో ఏఐ కీలక పాత్ర పోషించనుందని రాజేశ్ స్పష్టం చేశారు. పెద్ద పెద్ద కంపెనీలతో పోలిస్తే ఎస్‌ఎంఈలే ఏఐ టూల్స్‌ను త్వరగా అందిపుచ్చుకుంటున్నాయన్నారు. అయితే ఏజెంటిక్ ఏఐ టూల్స్ ఉపయోగించేటప్పుడు ఆయా వ్యాపారాలకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం అత్యంత అవసరమన్నారు. కాలేజీల్లో బోధించే ఏఐ పాఠాలకు, పరిశమ్ర అవసరాలకు ప్రస్తుతం ఏ మాత్రం పొంతన లేదన్నారు. ఈ వ్యత్యాసాన్ని వెంటనే పూడ్చాల్సిన అవసరం ఉందన్నారు. సరికొత్త వ్యాపార సామర్ధ్యాల అభివృద్ధి కోసమే అంతర్జాతీయ కంపెనీలు మన దేశంలో తమ జీసీసీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగాల్లో కొనసాగాలంటే ఉద్యోగులు ఇక రిటైర్మెంట్ వరకు ఎప్పుడూ మారుతున్న అవసరాలకు అనువైన ఏఐ టూల్స్ నేర్చుకోక తప్పదని స్పష్టం చేశారు.
హైదరాబాద్ రెడీ
మారుతున్న సరికొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు హైదరాబాద్‌లోని టెక్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని హైసియా అధ్యక్షులు ప్రశాంత్ నందెళ్ల తెలిపారు. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారబట్టే ప్రస్తుతం అంతర్జాతీయ టెక్ ప్రపంచంలో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఈ సదస్సు సందర్భంగా జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఐల్యాబ్స్ గ్రూప్ చైర్మన్ సీహెచ్ శ్రీనిరాజుకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఇవి కూడా చదవండి...
లేట్ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన
అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Read Latest AP News And Telugu News