చాబహార్ పోర్టులో వాటాను విక్రయించే యోచనలో భారత్?
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:37 PM
ఇరాన్‌లోని చాబహార్ పోర్టులో తనకున్న వాటాను భారత్ విక్రయించే యోచనలో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌లోని చాబహార్ పోర్టులో తనకున్న వాటాను విక్రయించే యోచనలో భారత్ ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మధ్యఆసియా దేశాలు, రష్యాతో వాణిజ్యం కోసం భారత్ ఇరాన్‌లో చాబహార్ పోర్టును అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇరాన్‌తో లావాదేవీలపై విధించిన ఆంక్షల నుంచి యూఎస్ 2018లో భారత్‌ను మినహాయించింది. ఆదివారంతో ఈ మినహాయింపునకు ఫుల్ స్టాప్ పడనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై యోచిస్తున్నట్టు సమాచారం.
చాబహార్ పోర్టులో తనకున్న వాటాను ఇరాన్‌లోని సంస్థకే విక్రయించే అంశంపై భారత్ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కొన్ని ప్రతిపాదనలను కూడా రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు బదులు పోర్టు నిర్వహణను తాత్కాలికంగా ఇరాన్ ఆపరేటర్‌కు బదిలీ చేయాలన్న ప్రతిపాదనను కూడా భారత్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదన ప్రకారం, యూఎస్ ఆంక్షల సడలింపు తరువాత పోర్టు నిర్వహణను మళ్లీ భారత్ స్వీకరిస్తుంది. అయితే, ఈ కథనాలపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.
ఇరాన్‌పై ఆంక్షలను పూర్తిస్థాయిలో విధించే అంశాన్ని పరిశీలించాలని ట్రంప్ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో నిర్ణయించింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గతంలో ఇచ్చిన మినహాయింపులను రద్దు చేసే అంశంపైనా దృష్టిపెట్టింది. ఈ దిశగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రంగంలోకి దిగారు. చివరకు 2018 నాటి సడలింపులను విదేశాంగ శాఖ ఉపసంహరించుకుంది. అయితే, చాబహార్ పోర్టు విషయంలో సడలింపులను ఈ ఏడాది ఏప్రిల్ 26 వరకూ కొనసాగిస్తామని యూఎస్ అప్పట్లో తెలిపింది. పోర్టు ప్రాజెక్టు కోసం భారత్ దాదాపు 120 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. అఫ్గానిస్థాన్‌కు మానవతా సాయం అందించేందుకు భారత్ ఈ పోర్టునే వినియోగిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
పసిడి, వెండి ధరలు.. నేటి రేట్స్ ఇవీ!
యూనియన్ బ్యాంక్ లాభం రూ.5,503 కోట్లు