Share News

2026-27 ఆర్థిక సంవత్సరం ఆరంభం అదిరింది..

ABN , Publish Date - May 02 , 2026 | 02:42 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) ప్యాసింజర్‌ వాహన తయారీ సంస్థలు శుభారంభం పలికాయి. ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో ఏకంగా 4.5 లక్షల యూనిట్ల వరకు టోకు,...

2026-27 ఆర్థిక సంవత్సరం ఆరంభం అదిరింది..

ఏప్రిల్‌లో వాహన విక్రయాల జోరు

మొత్తం 4.5 లక్షల యూనిట్ల సేల్స్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) ప్యాసింజర్‌ వాహన తయారీ సంస్థలు శుభారంభం పలికాయి. ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో ఏకంగా 4.5 లక్షల యూనిట్ల వరకు టోకు విక్రయాలు జరిగాయని అంచనా. గత ఏప్రిల్‌లో నమోదైన 3.54 లక్షల యూనిట్లతో పోలిస్తే 27 శాతం అధికమిది. మారుతి సుజుకీ, హ్యుండయ్‌, కియా వంటి కంపెనీలు రికార్డు విక్రయాలను జరపడం ఇందుకు దోహదపడింది. ‘‘గత సెప్టెంబరులో కార్లపై జీఎ్‌సటీ భారం తగ్గినప్పటి నుంచి విక్రయాలు ఊపందుకున్నాయి. ఆ జోరు ఇంకా అలాగే కొనసాగుతోంది. వాహన రుణాలపై తగ్గిన వడ్డీ రేట్లు, వ్యక్తిగత ఆదాయం పన్ను ఊరట అంశాలూ కలిసి వస్తున్నాయ’’ని మారుతి సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) పార్థో బెనర్జీ అన్నారు.

మారుతి చిన్న కార్ల సేల్స్‌లో 74.4ు వృద్ధి: మారుతి సుజుకీ దేశీయ విక్రయాలు గత నెలలో కొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి 1,91,122 యూనిట్లకు పెరిగాయి. గత రికార్డు గరిష్ఠం 2025 డిసెంబరులో 1,82,165 యూనిట్లుగా నమోదయ్యాయి. గత నెల విక్రయాల వృద్ధిలో చిన్న కార్లు గణనీయ పాత్ర పోషించాయని పార్థో బెనర్జీ అన్నారు.

రెండో స్థానానికి టాటా మోటార్స్‌: ఏప్రిల్‌ నెలలో టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ లిమిటెడ్‌ దేశీయ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 30.5 శాతం వృద్ధితో 59,000 యూనిట్లకు చేరాయి. దీంతో మారుతి సుజుకీ తర్వాత అత్యధిక ప్యాసింజర్‌ వాహనాలను విక్రయించిన కంపెనీల్లో రెండో స్థానానికి ఎదిగింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా 56,331 యూనిట్ల సేల్స్‌తో మూడో స్థానంలో ఉంది. హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా 51,902 యూనిట్ల విక్రయాలతో ఆ తర్వాత స్థానానికి పరిమితమైంది. కియా ఇండియా అమ్మకాలు 16 శాతం వృద్ధితో 27,286 యూనిట్లకు పెరిగాయి. కాగా, టయోటా కార్ల విక్రయాలు 21 శాతం పెరిగి 30,159 యూనిట్లకు చేరాయి. జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా టోకు విక్రయాలు 3 శాతం పెరిగి 6,108 యూనిట్లుగా, రెనో సేల్స్‌ రెండింతలకు పైగా పెరిగి 5,143 యూనిట్లుగా, నిస్సాన్‌ విక్రయాలు 3,203 యూనిట్లుగా నమోదయ్యాయి.


టూవీలర్లూ రయ్‌ రయ్‌: గత నెలలో హీరో మోటోకార్ప్‌ మొత్తం టోకు విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 85 శాతం పెరిగి 5,66,086 యూనిట్లుగా నమోదయ్యాయి. హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా విక్రయాలు 14.7 శాతం పెరుగుదలతో 4.84 లక్షల యూనిట్లకు చేరాయి. సుజుకీ మోటార్‌ సైకిల్‌ దేశీయ అమ్మకాలు 3 శాతం పెరిగి 98,004 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఈ వార్తలు కూడా చదవండి:

నేను సీఎం కావాలన్నా.. కుర్చీ ఖాళీగా లేదు

జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..

Read Latest Telangana News and National News

Updated Date - May 02 , 2026 | 02:42 AM