ఫెయిర్‌ఫాక్స్ చేతికి ఐడీబీఐ బ్యాంకు
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:36 AM
ప్రభుత్వరంగంలోని ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను 550 కోట్ల డాలర్ల(సుమారు రూ.53,000 కోట్లు)కు కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కొనుగోలు చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఓకే చెప్పింది...
60.72 శాతం వాటా రూ.53వేల కోట్లకు కొనుగోలు
కేంద్రం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం వాటాల విక్రయం
దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఇదే అతిపెద్ద ఎఫ్‌డీఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను 550 కోట్ల డాలర్ల(సుమారు రూ.53,000 కోట్లు)కు కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కొనుగోలు చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఓకే చెప్పింది. భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఇదే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ)కానుంది. అలాగే ఈ డీల్ దేశంలో సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న బ్యాంకింగ్ ప్రైవేటీకరణలో కీలక మైలురాయిగా నిలువనుంది. అంతేకాదు, 2022లో పూర్తయిన ఎయిరిండియా విక్రయం తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణగా నిలుస్తోంది. ఈ నిర్ణయం ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వరంగ ఆస్తులపై తన యాజమాన్యాన్ని తగ్గించుకోవడానికి, ఆర్థిక రంగంలోకి ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగా నిలుస్తోంది.
ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం 30.48 శాతం వాటా (సుమారు రూ.26,620 కోట్లు), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) 30.24 శాతం వాటా (సుమారు రూ.26,440 కోట్లు)ను ఫెయిర్‌ఫాక్స్ అనుబంధ సంస్థ కొనుగోలు చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కెనడియన్ బిలియనీర్ అయిన ప్రేమ్ వత్సా నేతృత్వంలోని ఫెయిర్‌ఫాక్స్ ఒక్కో షేరుకు రూ.81 చొప్పున చెల్లించనుంది. ఇది రెండు ఇండిపెండెంట్ వాల్యుయేషన్ ఏజెన్సీలు నిర్ణయించిన ధర రూ.75.99కన్నా ఎక్కువ. ఈ డీల్ అనంతరం ప్రభుత్వం, ఎల్ఐసీ కలిసి బ్యాంక్‌లో 34 శాతం వాటాను కలిగి ఉంటాయి. ప్రతిపాదిత వాటా విక్రయం పూర్తయిన తర్వాత ఐడీబీఐ బ్యాంకుపై నియంత్రణ ఫెయిర్‌ఫాక్స్‌కు బదిలీ అవుతుంది. ఈ లావాదేవీకి ఆర్బీఐ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), ఇతర చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. మైనారిటీ వాటాదారుల కోసం ఫెయిర్‌ఫాక్స్ ఓపెన్ ఆఫర్ కూడా ప్రకటించాల్సి ఉంటుంది. మరోవైపు కేరళకు చెందిన సీఎ్‌సబీ బ్యాంకులో ఫెయిర్‌ఫాక్స్‌కు 40ు వాటా ఉన్నందున దీన్ని ఐడీబీఐ బ్యాంకులో విలీనం చేయాలి. లేదా రెండేళ్లలో ఆ బ్యాంకు నుంచి ఫెయిర్‌ఫాక్స్ వైదొలగాల్సి ఉంటుంది. అలాగే, ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ తన వాటాను రెండేళ్లలో 19 శాతం నుంచి 15 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ లావాదేవీ తర్వాత ఐడీబీఐ బ్యాంకు బోర్డు నుంచి ప్రభుత్వం తప్పుకుంటుంది.
9 శాతం పెరిగిన బ్యాంకు షేరు
బీఎస్ఈలో బ్యాంకు షేరు బుధవారం 9.07ు పెరిగి రూ.90.44 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.8,085.82 కోట్లు ఎగబాకి రూ.97,244.73 కోట్లకు చేరుకుంది.
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని చేరనున్న కేంద్రం
ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో నిర్దేశించుకున్న రూ.80,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) లక్ష్యాన్ని ప్రభుత్వం అధిగమించనుంది. ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయం ద్వారా సమకూరే దాదాపు రూ.53వేల కోట్లు ఇందుకు దోహదపడనున్నాయి. దీంతో 8 ఏళ్లలో తొలిసారి డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఏర్పడనుంది. ఇప్పటివరకు 9 పీఎస్‌యూల్లో వాటా విక్రయం ద్వారా కేంద్రం రూ.55,757 కోట్లు సమీకరించింది.
ఉద్యోగులూ ఆందోళన వద్దు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ డీల్ పూర్తవుతుందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి అరునీష్ చావ్లా పేర్కొన్నారు. కొత్త ప్రమోటర్ కనీసం మూడేళ్లపాటు బ్యాంకు పేరు, బ్రాండ్, కస్టమర్ సంబంధాలను యథాతథంగా కొనసాగించాల్సి ఉంటుందన్నారు. అలాగే, బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యాజమాన్య బదిలీకి సంబంధించి సంబంధిత వర్గాలతో చర్చించామని చావ్లా తెలిపారు.
ఇదొక మైలురాయి: సీతారామన్
ఐడీబీఐ బ్యాంకు వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణకు ఆమోదంతో సంస్కరణల ప్రయాణం మరో మైలురాయిని చేరుకుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. బ్యాంకు కోలుకోవడానికి మద్దతుగా నిలిచి ఇప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా తదుపరి దశ వృద్ధికి మార్గం సుగమం చేస్తున్నామన్నారు. ఇది బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికే కాకుండా బ్యాంకింగ్ సేవలు ప్రపంచస్థాయి ప్రమాణాలను అధిగమించేలా చేయడంలో సహాయపడుతుందన్నారు.
గత రెండేళ్లలో జరిగిన మరిన్నిపెద్ద డీల్స్
ఎం యూఎఫ్ జీ-శ్రీరామ్ ఫైనాన్స్: ఈ ఏడాది ఏప్రిల్‌లో జపాన్‌కు చెందిన మిత్సుబిషి యూఎ్ఫజే ఫైనాన్షియల్ గ్రూప్ ఇంక్ శ్రీరామ్ ఫైనాన్స్‌లో 20ు వాటాను రూ.39,618 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ రంగంలోకి వచ్చిన రెండో అతిపెద్ద ఎఫ్‌డీఐ ఇది.
ఎమిరేట్స్ ఎన్బీడీ-ఆర్బీఎల్ బ్యాంక్ : ఈ ఏడాది మే నెలలో ఎమిరేట్స్ ఎన్డీబీ బ్యాంకు.. ఆర్బీఎల్ బ్యాంకులో 60ు వాటాను రూ.26,853 కోట్లకు కొనుగోలు చేసింది.
ఎస్ఎంబీసీ-యె్సబ్యాంకు: సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్.. గతేడాది మే నెలలో యెస్ బ్యాంకులో 20 శాతం వాటాను రూ.13,483 కోట్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
బ్లాక్‌స్టోన్-ఫెడరల్ బ్యాంక్: బ్లాక్‌స్టోన్ గ్రూప్ సంస్థ ఆసియా ఐఐ టాప్కోగీఐఐఐ పీటీఈ లిమిటెడ్‌కు రూ.6,196 కోట్ల విలువైన ప్రిఫరెన్షియల్ వారెంట్లను జారీ చేసి నిధులు సమీకరించేందుకు గత ఏడాది అక్టోబరులో ఫెడరల్ బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి
పోలీసుల దాడుల్లో ఓ విద్యార్థిని వినికిడి శక్తి కోల్పోయింది.. దీనికి బాధ్యులెవరు? : రాహుల్ గాంధీ