Share News

Home Loan Hidden Charges: గృహ రుణం తీసుకుంటున్నారా.. చార్జీల భారం తగ్గించుకోండిలా

ABN , Publish Date - Jan 11 , 2026 | 05:01 AM

జీవితంలో తొలిసారిగా గృహ రుణం తీసుకుంటున్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. రుణం తీసుకునేటప్పుడు బ్యాంకులు, గృహ ఫైనాన్సింగ్‌ కంపెనీలు (హెచ్‌ఎ్‌ఫసీ) మనకు సవాలక్ష నిబంధనలు...

Home Loan Hidden Charges: గృహ రుణం  తీసుకుంటున్నారా.. చార్జీల భారం తగ్గించుకోండిలా

జీవితంలో తొలిసారిగా గృహ రుణం తీసుకుంటున్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. రుణం తీసుకునేటప్పుడు బ్యాంకులు, గృహ ఫైనాన్సింగ్‌ కంపెనీలు (హెచ్‌ఎ్‌ఫసీ) మనకు సవాలక్ష నిబంధనలు పెడతాయి. ఒప్పందాలపై సంతకాలు పెట్టించుకుంటాయి. అయితే ఇందులో కొన్ని మనకు కొన్ని భారంగా ఉంటాయి. అందుకే రుణం తీసుకునే ముందు రుణ ఒప్పందాన్ని ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా చదవండి. లేకపోతే గృహ రుణంపై వడ్డీతో పాటు కొన్ని రహస్య చార్జీల భారం తప్పదు. వీటి గురించి తెలిసినప్పుడే మనం ఆ భారాన్ని కొంత మేరకు తగ్గించుకోగలుగుతాం. ఆ వివరాలు మీ కోసం..

ప్రాసెసింగ్‌, లీగల్‌ చార్జీలు

దరఖాస్తు చేసిన వెంటనే గృహ రుణం రాదు. బ్యాంకులు లేదా గృహ ఫైనాన్స్‌ కంపెనీ (హెచ్‌ఎ్‌ఫసీ) ఆ దరఖాస్తును, దాంతో పాటు సమర్పించిన కొన్ని పత్రాలను పరిశీలించి, నిర్ధారించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రాసెసింగ్‌, లీగల్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఫీజుల పేరుతో ముందుగా కొన్ని ఫీజులు వసూలు చేస్తాయి.

  • ప్రాసెసింగ్‌ ఫీజు ఒక పరిమితికి లోబడి రుణ మొత్తంలో 0.25 శాతం నుంచి 1 శాతం వరకు ఉంటుంది.

  • కొనే ఇంటి యాజమాన్య హక్కు పత్రాల నిర్ధారణ, మార్కెట్‌ విలువ మదింపు చేసేందుకు రూ.5,000 నుంచి రూ.15,000 వరకు లీగల్‌ అండ్‌ టెక్నికల్‌ వెరిఫికేషన్‌ ఫీజుగా వసూలు చేస్తారు.

  • పండగల సీజన్‌లో బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలు గృహ రుణాల ప్రాసెసింగ్‌, లీగల్‌ చార్జీలను మినహాయిస్తుంటాయి.

కన్వర్షన్‌

చార్జీలు

ఆర్‌బీఐ రెపో రేటు మారినప్పుడల్లా వడ్డీ రేట్లు మారిపోతుంటాయి. ఆ ప్రభావం గృహ రుణాలపైనా పడుతుంది. అలాంటప్పుడు గృహ రుణాలు తీసుకున్న చాలా మంది వడ్డీ ఆదా కోసం ఫిక్స్‌డ్‌ వడ్డీ రేట్ల నుంచి ఫ్లోటింగ్‌ రేట్లకు లేదా ఫ్లోటింగ్‌ నుంచి ఫిక్స్‌డ్‌ రేట్లకు మారుతుంటారు. ఇందుకు బ్యాంకులు ఇంకా చెల్లించాల్సిన రుణ మొత్తంలో 0.25 శాతం నుంచి 0.5 శాతం కన్వర్షన్‌ చార్జీగా వసూలు చేస్తాయి. కొన్ని బ్యాంకులు ఇలా మారడానికీ పరిమితులు పెడతాయి. ఇలా మారడం వల్ల అయ్యే వడ్డీ పొదుపు, కన్వర్షన్‌ చార్జీల కంటే ఎక్కువగా ఉంటేనే మారాలి.


ఆలస్యంగా చేసే చెల్లింపులపై చార్జీలు

ఆలస్యంగా జీతాలు అందడం, మెడికల్‌ ఎమర్జెన్సీ లేదా మర్చిపోవడం వల్ల ఒక్కోసారి నిర్ణీత గడువు లోపు గృహ రుణాల ఈఎంఐ చెల్లించలేకపోవచ్చు. అలాంటప్పుడు కూడా బ్యాంకులు ఐదు నుంచి పది రోజుల వరకు గడువు ఇస్తాయి. ఆ గడువు కూడా దాటిపోతే చెల్లించాల్సిన ఈఎంఐలపై 3 శాతం వరకు పెనాల్టీ చార్జీలు విధిస్తాయి. ఈఎంఐ చెల్లింపుల కోసం ఇచ్చిన చెక్కు బౌన్స్‌ అయినా చార్జీలు తప్పవు. ఈ ప్రభావం ఆయా వ్యక్తుల పరపతి స్కోరుపైనా పడుతుంది.

0-Business.jpg

ముందస్తు చెల్లింపులపై చార్జీలు

గృహ రుణాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా ముందుగా చెల్లించేటప్పుడు ఈ ఫీజులు వర్తిస్తాయి. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు గృహ రుణాల ముందస్తు చెల్లింపులకు ఈ చార్జీలు వర్తించవు. అయితే ఫిక్స్‌డ్‌ (స్థిర) వడ్డీ రేటు లేదా హైబ్రిడ్‌ వడ్డీ రేటు గృహ రుణాల ముందస్తు చెల్లింపులపై మాత్రం ఈ చార్జీలు తప్పవు. ఈ చార్జీలు ఇంకా చెల్లించాల్సిన అసలు అప్పుపై 4 శాతం వరకు ఉంటాయి. ఒకవేళ గృహ రుణాన్ని పాక్షికంగానే చెల్లిస్తే బ్యాంకులు లేదా హెచ్‌ఎ్‌ఫసీలు, రుణ చెల్లింపు కాలాన్ని తగ్గించి ఈఎంఐలను యథాతథంగా ఉంచుతాయి. దీనివల్ల ఈఎంఐల భారం యథాతథంగా ఉన్నా, రుణం తీరేసరికి పెద్దమొత్తంలో వడ్డీ భారం తప్పుతుంది. అయితే ఖాతాదారులు చెల్లింపుల కాలవ్యవధిని అలాగే ఉంచమని కోరి, ఈఎంఐల చెల్లింపుల భారం తగ్గించుకోవచ్చు.

రుణ

బదిలీ చార్జీలు

ప్రస్తుతం గృహ రుణాల కోసం బ్యాంకుల మధ్య పోటీ పెరిగింది. గృహ రుణ చెల్లింపులు సక్రమంగా ఉన్న ఖాతాదారులను గుర్తించి.. మీ మిగిలిన గృహ రుణాన్ని మా బ్యాంకుకు బదిలీ చేస్తే మరింత తక్కువ వడ్డీ రేటు ఆఫర్‌ చేస్తామని ఊరిస్తుంటాయి. దీంతో చాలా మంది నిర్ణీత కాలం తర్వాత తమ రుణ ఖాతాను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు బదిలీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ మళ్లీ కొత్తగా బదిలీ అయ్యే బ్యాంకుకూ ప్రాసెసింగ్‌, లీగల్‌, వాల్యుయేషన్‌ మదింపు చార్జీలు, మెమోరాండం ఆఫ్‌ డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్‌ (ఎంఓడీటీ) చార్జీలు చెల్లించక తప్పదు. గృహ రుణ ఖాతాను వేరే బ్యాంకుకు బదిలీ చేసేటప్పుడు ఈ ఫీజులన్నిటిని పరిగణణలోకి తీసుకోవాలి. ఇవన్నీ పోను కొత్త బ్యాంకు కనీసం 1 లేదా 1.5 శాతం తక్కువ వడ్డీ ఆఫర్‌ చేస్తేనే మీ గృహ రుణ ఖాతాను ఆ బ్యాంకుకు బదిలీ చేయాలి.


సీఈఆర్‌ఎ్‌సఏఐ చార్జీలు

సెంట్రల్‌ రిజిస్ట్రీ ఆఫ్‌ సెక్యూరిటైజేషన్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ సెక్యూరిటీ ఇంట్రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా (సీఈఆర్‌ఎ్‌సఏఐ) దీని పూర్తి పేరు. ఒక ఇంటి తాకట్టుపై పదే పదే రుణాలు పొందకుండా నిరోధించేందుకు గృహ రుణాలు ఇచ్చే బ్యాంకులు.. ఆ ఇంటి తాలూకూ డాక్యుమెంట్లను సీఈఆర్‌ఎ్‌సఏఐలో రిజిస్టర్‌ చేస్తాయి. ఇందుకు వసూలు చేసే చార్జీలనే సీఈఆర్‌ఎస్‌ఏఐ చార్జీలు అంటారు. రూ.5 లక్షల వరకు ఉన్న గృహ రుణాలపై రూ.50+జీఎ్‌సటీ, అంతకు మించిన గృహ రుణాలపై రూ.100+జీఎ్‌సటీ చొప్పున ఈ భారం ఉంటుంది. గృహ రుణం మొత్తం తీర్చివేసిన వెంటనే ఈ రికార్డును అప్‌డేట్‌ చేయించుకోవాలి. లేకపోతే ఆ ఇంటిని తిరిగి అమ్మడం లేదా రీఫైనాన్సింగ్‌ కష్టమవుతుంది.

బీమా పాలసీలు అంటగట్టడం

గృహ రుణాలు తీసుకునే వారికి బ్యాంకులు సాధారణంగా ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌, లోన్‌ ప్రొటెక్షన్‌ పేరుతో రెండు రకాల బీమా పాలసీలు అంటగడతాయి. ఇందులో ప్రాపర్టీ ప్రొటెక్షన్‌ పాలసీ ద్వారా తమ రుణంతో కొనుగోలు చేసిన ఇంటికి అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో జరిగే నష్టాల నుంచి రక్షణ లభిస్తుంది. రెండోది టర్మ్‌ పాలసీ. ఈ పాలసీ ద్వారా గృహ రుణం మొత్తం చెల్లించే లోపు చెల్లింపుదారునికి ఏదైనా జరగరానిది జరిగితే తన రుణ చెల్లింపులకు ఢోకా లేకుండా చేస్తుంది. ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌ దాదాపు తప్పనిసరి. లోన్‌ ప్రొటెక్షన్‌ పాలసీని మాత్రం గృహ రుణం ఇచ్చే బ్యాంకు చెప్పిన బీమా కంపెనీ నుంచే తీసుకోవాల్సిన అవపరం లేదు. అదే రక్షణ ఫీచర్లతో తక్కువ ప్రీమియంతో ఇచ్చే బీమా కంపెనీ నుంచి కూడా తీసుకోవచ్చు.

గృహ రుణం తీసుకునే ముందే ఈ చార్జీల గురించి తెలుసుకోవాలి. వీలైనంత వరకు ఫెస్టివల్స్‌ సీజన్‌లో గృహ రుణాలకు వెళ్లడం మంచిది. అప్పుడైతే బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలు ప్రాసెసింగ్‌ ఫీజులు రద్దు చేసి మరీ రుణాలు ఇస్తుంటాయి.

ఇవి కూడా చదవండి..

ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనం.. ఐఏఎస్ సంఘం రియాక్షన్ ఇదే..

ప్రజలకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కీలక హెచ్చరికలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 11 , 2026 | 05:01 AM