హెచ్‌సీఎల్ టెక్ భళా!
ABN , Publish Date - Jul 14 , 2026 | 05:40 AM
దేశీయ ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో జూన్‌తో ముగిసిన...
క్యూ1 లాభంలో 20% వృద్ధి
రూ.4,624 కోట్లుగా నమోదు
రూ.34,579 కోట్లకు ఆదాయం
వార్షికాదాయ వృద్ధి 1-4 శాతంగా అంచనా
ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్
సంస్థ ఉద్యోగుల సంఖ్యలో 3,292 తగ్గుదల
న్యూఢిల్లీ: దేశీయ ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) కంపెనీ రూ.4,624 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇదే కాలానికి నమోదైన రూ.3,843 కోట్ల లాభంతో పోలిస్తే 20 శాతం వృద్ధి కనబరిచింది. ఈ క్యూ1లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 14 శాతం పెరిగి రూ.34,579 కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆదాయ వృద్ధి అంచనాను గతంలో ప్రకటించిన 1-4 శాతంగా కొనసాగిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. కాగా, వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ బోర్డు ప్రకటించింది. డివిడెండ్‌కు అర్హులైన వాటాదారుల ఎంపికకు రికార్డు తేదీని ఈ నెల 17గా నిర్ణయించిన కంపెనీ.. 27న చెల్లింపులు చేపట్టనున్నట్లు తెలిపింది. మరిన్ని ముఖ్యాంశాలు..
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సంస్థ.. జర్మనీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ నుంచి 114 కోట్ల డాలర్ల విలువైన మెగా ఏఐ డీల్‌తో సహా మొత్తం 240 కోట్ల డాలర్ల విలువైన కొత్త ఆర్డర్లను దక్కించుకుంది. సంస్థ చరిత్రలో ఇవే అత్యధిక క్యూ1 ఆర్డర్లని హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ, ఎండీ సీ విజయ్ కుమార్ తెలిపారు.
అడ్వాన్స్‌డ్ ఏఐ సేవల ద్వారా సంస్థకు గడిచిన మూడు నెలల్లో 17.1 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరింది. ఈ విషయంలో త్రైమాసిక ప్రాతిపదికన 10.6 శాతం, వార్షిక ప్రాతిపదికన ఏకంగా 62.1 శాతం వృద్ధిని నమోదు చేసింది.
జూన్ త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,292 తగ్గి 2,23,889కి పరిమితమైంది. మూడు నెలల్లో కంపెనీ సిబ్బంది ఈ స్థాయిలో తగ్గడం గడిచిన రెండేళ్లలో ఇదే మొదటిసారి. గత త్రైమాసికంలో 1,059 మంది ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. కాగా, ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 12.7 శాతానికి పెరిగింది.
రూ.3,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటు
దేశంలో 50 మెగావాట్ల వరకు సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటు కోసం రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని హెచ్‌సీఎల్ టెక్ సోమవారం ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా వెల్లడించింది. డేటా సెంటర్ల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న కొత్త అనుబంధ విభాగాల ద్వారా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుంచి ఏఐ ఆధారిత సేవలు, పరిష్కారాలకు గిరాకీ పెరుగుతున్న తరుణంలో ఈ విభాగం పూర్తి స్థాయి వ్యాపార అవకాశాలను చేజిక్కించుకునేందుకు ఫుల్ స్టాక్ ఏఐ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News