ప్రపంచంలో తొలి ట్రిలియనీర్ మస్క్.. అతడి సంపదతో ఏమేం కొనొచ్చంటే..
ABN , Publish Date - Jun 13 , 2026 | 07:11 PM
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో చారిత్రాత్మక ఘనత సాధించారు. స్పేస్‌ఎక్స్ మార్కెట్ అరంగేట్రం విజయవంతం కావడంతో ఆయన వ్యక్తిగత సంపద ఒక ట్రిలియన్ డాలర్లను దాటేసింది. దీంతో ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనీర్‌గా మస్క్ కొత్త రికార్డు సృష్టించారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో చారిత్రాత్మక ఘనత సాధించారు. స్పేస్‌ఎక్స్ మార్కెట్ అరంగేట్రం విజయవంతం కావడంతో ఆయన వ్యక్తిగత సంపద ఒక ట్రిలియన్ డాలర్లను దాటేసింది. దీంతో ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనీర్‌గా మస్క్ కొత్త రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఆయన నికర సంపద 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.105 లక్షల కోట్లు. అంటే, రూ.కోటి కోట్ల పైమాటే (Elon Musk trillionaire).
ఒక ట్రిలియన్ డాలర్లు అంటే 1 తర్వాత 12 సున్నాలు ఉంటాయి. ఈ మొత్తాన్ని ఈ భూమి మీద ఉన్న 820 కోట్ల మందికి పంచితే.. ఒక్కొక్కరికి రూ.11 వేలకు పైనే అందుతాయి. అమెరికాలో ప్రస్తుతం ఒక ఇంటి సగటు ధర ఆధారంగా చూస్తే, 1 ట్రిలియన్ డాలర్లతో సుమారు 25 లక్షల ఇళ్లను కొనుగోలు చేయవచ్చు. ఇది అనేక దేశాల మొత్తం గృహ మార్కెట్ విలువతో సమానం. ఒక ట్రిలియన్ డాలర్లు అనేది మస్క్ స్వదేశమైన దక్షిణాఫ్రికా వార్షిక జీడీపీకి రెట్టింపు కంటే ఎక్కువ (Elon Musk net worth).
ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల నోట్లను ఒకదాని చివర మరొకటి కలిపి పేర్చితే అవి దాదాపు 97 మిలియన్ మైళ్ల దూరం వరకు విస్తరిస్తాయి. ఇది చంద్రుడి పైకి 200 కంటే ఎక్కువ సార్లు వెళ్లి రావడానికి పట్టే దూరానికి సమానం. ఇక, మస్క్ వ్యక్తిగత సంపద ఈ ప్రపంచంలో దాదాపు 170 దేశాల వార్షిక జీడీపీ కంటే చాలా ఎక్కువ. ప్రస్తుతం 21 దేశాల జీడీపీ మాత్రమే ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది (Trillion dollars).
ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ బిలియనీర్లు అయిన లారీ పేజ్, సెర్గే బ్రిన్, జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్‌ల సంపదలను కలిపినా అవి మస్క్ సంపదను అధిగమించలేవు (SpaceX IPO). స్పేస్‌ఎక్స్ శుక్రవారం తన షేర్లను అమెరికాలోని నాస్‌డాక్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదు చేసింది. ఐపీఓ ధర 135 డాలర్లతో పోలిస్తే.. 11 శాతం ప్రీమియంతో 150 డాలర్ల వద్ద లిస్టయింది. వెంటనే షేరు 160 డాలర్ల స్థాయిని కూడా దాటింది. దీంతో మస్క్ వ్యక్తిగత సంపద భారీగా పెరిగింది.
ఇవి కూడా చదవండి..
అదృష్టం అంటే ఈమెదే.. ఒకే వారంలో రెండు లాటరీల గెలుపు..
మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు.. నెస్లే ఇండియా స్పందన ఏంటంటే..