Share News

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ.1,210 కోట్లు

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:55 AM

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌.. డిసెంబరుతో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గాను...

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ.1,210 కోట్లు

క్యూ3లో 14 శాతం క్షీణత

  • దెబ్బతీసిన అమెరికా మార్కెట్‌

  • ఆదాయం రూ.8,727 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌.. డిసెంబరుతో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 14 శాతం క్షీణించి రూ.1,210 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,413 కోట్లుగా ఉంది. అమెరికా మార్కెట్లో క్యాన్సర్‌ ఔషధం లెనాలిడొమైడ్‌ విక్రయాలు గణనీయంగా తగ్గటం కంపెనీ పనితీరుపై ప్రభావం చూపించింది. కాగా త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం రెవెన్యూ మాత్రం 4.4 శాతం వృద్ధితో రూ.8,357 కోట్ల నుంచి రూ.8,727 కోట్లకు పెరిగింది. డిసెంబరు త్రైమాసికంలో అమెరికాలో లెనాలిడొమైడ్‌ విక్రయాలు తగ్గినప్పటికీ బ్రాండెడ్‌ వ్యాపారం మెరుగ్గా ఉండటంతో పాటు విదేశీ మారకం (ఫారెక్స్‌) సానుకూలంగా ఉండటం కలిసి వచ్చిందని డాక్టర్‌ రెడ్డీస్‌ కో-చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ తెలిపారు. కాగా వ్యాపార వృద్ధి కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించటంతో పాటు అవకాశాలు అందిపుచ్చుకోవటం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలను రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.


అమెరికా ఆదాయాల్లో 12% తగ్గుదల

డిసెంబరు త్రైమాసికంలో అమెరికా మార్కెట్లో కంపెనీ విక్రయాలు 12 శాతం క్షీణతతో రూ.2,964 కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో విక్రయాలు రూ.3,383 కోట్లుగా ఉన్నాయి. క్యాన్సర్‌ ఔషధ విక్రయాలు తక్కువగా ఉండటంతో పాటు ఇతర కీలక ఔషధాల ధరలు తగ్గటం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. ఈ కాలంలో యూరప్‌ మార్కెట్‌ ఆదాయాలు మాత్రం 20 శాతం వృద్ధితో రూ.1,447.60 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు భారత మార్కెట్‌ రెవెన్యూ కూడా 19 శాతం వృద్ధి చెంది రూ.1,603 కోట్లుగా ఉన్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది.

ఈ ఏడాదే మార్కెట్లోకి సెమాగ్లుటైడ్‌

ఈ ఏడాదే అంతర్జాతీయ మార్కెట్లోకి డయాబెటిస్‌, వెయిట్‌ లాస్‌ ఔషధం సెమాగ్లుటైడ్‌ను విడుదల చేయాలని డాక్టర్‌ రెడ్డీస్‌ భావిస్తోంది. భారత్‌, కెనడా సహా మొత్తం 87 దేశాల్లో ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. భారత్‌లో ఈ ఏడాది మార్చి 21తో ఈ మాలిక్యూల్‌కు పేటెంట్‌ గడువు ముగియనుంది. ఇప్పటికే భారత్‌లో సెమాగ్లుటైడ్‌ ఇంజెక్షన్ల తయా రీ, మార్కెట్‌కు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నుంచి కంపెనీ అనుమతులు అందుకుంది. ప్రస్తుతం కాంట్రాక్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ భాగస్వామ్యాలు, విశాఖపట్నంలోని ప్లాంట్‌ ద్వారా ఏటా 1.2 కోట్ల సెమాగ్లుటైడ్‌ ఇంజెక్షన్స్‌ను ఉత్పత్తి చేయాలని చూస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఎరెజ్‌ ఇజ్రాయెలీ చెప్పారు. అవసరమైతే ఉత్పత్తిని 5 కోట్ల ఇంజెక్షన్స్‌కు పెంచుకునే అవకాశం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి..

కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు

భారత్, ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదిక: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 22 , 2026 | 05:55 AM