Share News

ఫామ్-16 లేకున్నా ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయొచ్చా.. ఇలా చేస్తే సరిపోతుంది..

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:02 PM

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే సమయంలో ఉద్యోగులకు అత్యంత ఉపయోగకర పత్రం ఫామ్-16. అయితే, ఉద్యోగం మారడం, కంపెనీ మూతపడటం, యజమాని ఆలస్యంగా ఇవ్వడం వంటి కారణాల వల్ల కొంతమందికి ఫామ్-16 సకాలంలో అందకపోవచ్చు

ఫామ్-16 లేకున్నా ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయొచ్చా.. ఇలా చేస్తే సరిపోతుంది..
ITR filing without Form 16

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే సమయంలో ఉద్యోగులకు అత్యంత ఉపయోగకర పత్రం ఫామ్-16. అయితే, ఉద్యోగం మారడం, కంపెనీ మూతపడటం, యజమాని ఆలస్యంగా ఇవ్వడం వంటి కారణాల వల్ల కొంతమందికి ఫామ్-16 సకాలంలో అందకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఐటీఆర్ దాఖలు చేయడం సాధ్యమే (ITR filing without Form 16).


ఫామ్-16 లేకపోయినా, ప్రత్యామ్నాయ పత్రాలను ఉపయోగించి ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. ఫామ్-16 లేనపుడు నెలవారీ జీతం స్లిప్‌లు, ఫామ్ 26ఏఎస్, ఏఐఎస్‌, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, 80సీ, 80డీ వంటి పెట్టుబడి రుజువులు, హోమ్ లోన్ లేదా ఇతర రుణాల వడ్డీ సర్టిఫికెట్లు, పాన్, ఆధార్ వివరాలు అవసరమవుతాయి (Income Tax Return).


స్టెప్-1: జీతం స్లిప్‌ల ఆధారంగా బేసిక్ పే, అలవెన్సులు, బోనస్‌లు, ఇతర ప్రయోజనాలను కలిపి వార్షిక ఆదాయాన్ని లెక్కించాలి. అదనంగా బ్యాంక్ వడ్డీ, ఎఫ్‌డీ వడ్డీ వంటి ఇతర ఆదాయాలను కూడా జోడించాలి.

స్టెప్ 2: మీరు ఎంచుకున్న పన్ను విధానం ప్రకారం అర్హత కలిగిన డిడక్షన్లు, మినహాయింపులను వర్తింపజేయాలి. పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు సిద్ధంగా ఉంచుకోవాలి.

స్టెప్ 3: మీ పేరిట ఎంత టీడీఎస్ కట్ అయ్యింది. అది ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యిందా లేదా అనే వివరాలు ఫామ్ 26ఏఎస్, ఏఐఎస్‌లో కనిపిస్తాయి. వీటిని జీతం స్లిప్‌లతో సరిపోల్చుకోవాలి.


స్టెప్ 4: మొత్తం ఆదాయం రూ.50 లక్షల లోపు ఉన్న వ్యక్తులు ఐటీఆర్-1 (సహజ్) ఉపయోగించవచ్చు. ఇతర ఆదాయ వనరులు ఉంటే తగిన ఐటీఆర్ ఫామ్‌ను ఎంచుకోవాలి.

స్టెప్ 5: ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయి, ఆదాయం, డిడక్షన్లు, టీడీఎస్ వివరాలు నమోదు చేసి ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. అనంతరం ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

జాగ్రత్తలు: ఫామ్-16 లేకుండా ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు చిన్న పొరపాట్లు కూడా నోటీసులకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఫామ్ 26ఏఎస్, ఏఐఎస్‌లను సరిపోల్చకపోవడం, బ్యాంక్ వడ్డీ ఆదాయాన్ని చూపకపోవడం, సరైన ఆధారాలు లేకుండా డిడక్షన్లు క్లెయిమ్ చేయడం వంటి తప్పిదాలు చేయకూడదు.


ఇవి కూడా చదవండి..

డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటును 50 ఏళ్లకు పొడిగించే అవకాశం..


యాపిల్ ఐఓఎస్ 27లో అదిరిపోయే ఫీచర్లు.. ఏయే ఫోన్లకు అందుబాటులోకి వస్తుందంటే..

Updated Date - Jun 09 , 2026 | 05:02 PM