Share News

ఫెడ్‌ రేట్లు 0.25 శాతం పెంపు

ABN , Publish Date - Sep 17 , 2026 | 05:14 AM

అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగాయి. కీలక వడ్డీ రేట్లను పావు శాతం పెంచుతున్నట్లు బుధవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్‌ రిజర్వు చైర్మన్‌ కెవిన్‌ వార్ష్‌...

ఫెడ్‌ రేట్లు 0.25 శాతం పెంపు

గడిచిన మూడేళ్లలో ఇదే మొదటిసారి

ఏడాది చివరికల్లా మరోసారి పెంచే చాన్స్‌

న్యూయార్క్‌: అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగాయి. కీలక వడ్డీ రేట్లను పావు శాతం పెంచుతున్నట్లు బుధవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్‌ రిజర్వు చైర్మన్‌ కెవిన్‌ వార్ష్‌ ప్రకటించారు. వార్ష్‌ అధ్యక్షతన సమావేశమైన 12 మంది సభ్యుల ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) ఇందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో అమెరికాలో కీలక వడ్డీ రేట్ల శ్రేణి ప్రస్తుత 3.5-3.75 శాతం నుంచి 3.75-4.00 శాతానికి చేరాయి. 2023 జూలై తర్వాత ఫెడ్‌ రేట్లు పెంచడం ఇదే మొదటిసారి. ఆగస్టు నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.4 శాతానికి ఎగబాకడం ఇందుకు ప్రధాన కారణంగా భావి స్తున్నారు. ఇరాన్‌తో యుద్ధం కొనసాగి ద్రవ్యోల్బణం ఇలానే కోరలు చాస్తే, డిసెంబరులోగా మరోసారి వడ్డీరేట్లు పెంచక తప్పదని కెవిన్‌ వార్ష్‌ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. వడ్డీ రేట్లు తగ్గించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొట్టికాయలు వేస్తున్నప్పటికీ ఫెడ్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచడం గమనార్హం.

భారత్‌పైనా ప్రభావం: ఫెడ్‌ రేట్ల పెంపు మన దేశాన్నీ ప్రభావితం చేయనుంది. దీంతో ప్రధాన కరెన్సీలతో డాలర్‌ మారకం రేటు బలపడి రూపాయి తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అలాగే, అమెరికా ప్రభుత్వ రుణ పత్రాల(బాండ్ల)పై వడ్డీ రేట్లు మరింత పెరగనున్నాయి. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారత ఈక్విటీ మార్కెట్‌లో దూకుడుగా అమ్మకాలకు దిగే ప్రమాదం కనిపిస్తోంది.

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 05:14 AM