మార్కెట్ మండేన్!
ABN , Publish Date - Mar 03 , 2026 | 02:57 AM
పశ్చిమాసియా యుద్ధ జ్వాలల్లో భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు మండిపోయాయి. బీఎ్‌సఈలో సోమవారం ట్రేడింగ్ ఆరంభంలో 2,743.46 పాయింట్లు (3.37 శాతం) పతనమై 78,543.73 వద్ద...
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు.. భారీగా పతనమైన స్టాక్ సూచీలు
ఆరంభ ట్రేడింగ్‌లో 2,743 పాయింట్లు క్షీణించి 79,000 దిగువకు సెన్సెక్స్
చివరికి 1048 పాయింట్ల నష్టంతో 80,238 వద్ద ముగిసిన సూచీ
25,000 కీలక స్థాయి దిగువకు నిఫ్టీ
బీఎ్‌సఈలో ఏడాది కనిష్ఠానికి పడిపోయిన 869 కంపెనీల షేర్లు
రూ.6.59 లక్షల కోట్ల సంపద బుగ్గి
రూపీ క్రాష్.. బంగారం, వెండి భగ్గు
ముంబై: పశ్చిమాసియా యుద్ధ జ్వాలల్లో భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు మండిపోయాయి. బీఎ్‌సఈలో సోమవారం ట్రేడింగ్ ఆరంభంలో 2,743.46 పాయింట్లు (3.37 శాతం) పతనమై 78,543.73 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్.. చివరికి 1,048.34 పాయింట్ల (1.29 శాతం) నష్టంతో 80,238.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 25,000 కీలక మద్దతు స్థాయిని కోల్పోయింది. ప్రారంభ ట్రేడింగ్‌లో 575.15 పాయింట్లు (2.28 శాతం) పతనమై 24,600 స్థాయికి జారిన సూచీ.. ట్రేడింగ్ నిలిచేసరికి 312.95 పాయింట్ల (1.24 శాతం) నష్టంతో 24,865.70 వద్ద స్థిరపడింది. ఈక్విటీ మార్కెట్ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) రూ.6.59 లక్షల కోట్లు తగ్గి రూ.456.90 లక్షల కోట్లకు (5 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. మరిన్ని విషయాలు..
సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 27 క్షీణించాయి. యుద్ధం కారణంగా పశ్చిమాసియాకు విమాన సర్వీసులను భారీగా రద్దు చేయాల్సి రావడంతో ఇండిగో షేరు 6.25 శాతం నష్టంతో సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. పశ్చిమాసియాలో భారీ విలువైన కాంట్రాక్టులను చేపడుతున్న ఎల్ అండ్ టీ స్టాక్ 5 శాతం పతనమైంది. అదానీ పోర్ట్స్, మారుతి సుజుకీ 3 శాతానికి పైగా, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి.
బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 1.81 శాతం, మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 1.67 శాతం నష్టపోయాయి. రంగాలవారీ సూచీల్లో సర్వీసెస్ అత్యధికంగా 3.81 శాతం జారుకోగా.. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా నష్టపోయాయి.
బీఎ్‌సఈలో మొత్తం 4,528 కంపెనీల షేర్లు ట్రేడవగా.. 3,641 నష్టాలు చవిచూశాయి. అందులో 869 కంపెనీల షేర్లు సరికొత్త ఏడాది కనిష్ఠానికి జారుకున్నాయి. 8 లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. 754 సంస్థల స్టాక్స్ మాత్రం పెరగగా.. 133 యథాతథంగా ముగిశాయి.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) నికరంగా రూ.3,295.64 కోట్ల విక్రయాలకు పాల్పడగా.. ఎల్‌ఐసీ సహా ఇతర దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐ) రూ.8,593.87 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
ఇంధన షేర్లు విలవిల
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ ముడి చమురు పీపా ధర 10 శాతానికి పైగా పెరిగి ఒక దశలో 82 డాలర్లకు ఎగబాకింది. దాంతో బీఎ్‌సఈలో ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేరు 4.53 శాతం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ 3.36 శాతం, భారత్ పెట్రోలియం 2.81 శాతం నష్టపోయాయి. ప్రైవేట్ రంగ ఇంధన రిఫైనరీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 2.58 శాతం తగ్గింది. ఇంధనం ముడిసరుకుగా ఉపయోగించే పెయింట్ తయారీ కంపెనీల విషయానికొస్తే, కన్సాయ్ నెరొలాక్ 3.77 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.89 శాతం, షాలిమార్ పెయింట్స్ 2.55 శాతం, బెర్జర్ పెయింట్స్, ఇండిగో పెయింట్స్ 1 శాతానికి పైగా క్షీణించాయి.
విమాన, పర్యాటక రంగ షేర్లు డౌన్
గల్ఫ్ దేశాలకు భారీ సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేయాల్సి రావడంతో ఎయిర్‌లైన్స్, ట్రావె ల్ బుకింగ్ కంపెనీల షేర్లు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. ఇండిగో 6 శాతానికి పైగా క్షీణించగా.. స్పైస్‌జెట్ 5.72 శాతం తగ్గింది. యాత్ర ఆన్‌లైన్ 9.59 శాతం, ఈజీ ట్రిప్ ప్లానర్స్ 7.08 శాతం, టీబీఓ టెక్ 4.04 శాతం తగ్గాయి. ఫారెక్స్ సేవల కంపెనీ థామస్ కుక్ 3.57 శాతం, లీ ట్రావెన్యూస్ టెక్నాలజీ 2.08 శాతం నష్టపోయాయి.
డిఫెన్స్ స్టాక్స్ కళకళ
యుద్ధం నేపథ్యంలో మన రక్షణ రంగ షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఐడియాఫోర్జ్ టెక్నాలజీ 7.66 శాతం, పారస్ డిఫెన్స్ 5.95 శాతం, బీఈఎల్ 2.09 శాతం, ఆస్ట్రా మైక్రోవేవ్ 1.62 శాతం, తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ 1.34 శాతం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 0.96 శాతం, భారత్ డైనమిక్స్ 0.22 శాతం పెరిగాయి.
ఇవి కూడా చదవండి:
విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?
అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు