Share News

వడ్డీ రేట్లు యథాతథం

ABN , Publish Date - Jun 06 , 2026 | 03:24 AM

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక వడ్డీ (రెపో) రేటును యథాతథంగా కొనసాగించింది. ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా...

వడ్డీ రేట్లు యథాతథం

  • ద్రవ్యోల్బణం అంచనా పెంపు జూవృద్ధి అంచనాల్లో కోత

  • ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన ఆర్‌బీఐ

ముంబై: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక వడ్డీ (రెపో) రేటును యథాతథంగా కొనసాగించింది. ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజులు సమావేశమైంది. 5.25 శాతంగా ఉన్న రెపో రేటును, వడ్డీ రేట్లపై తటస్థ వైఖరిని అలాగే కొనసాగించాలని ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో రెపో ప్రామాణిక రుణాలపై వడ్డీ రేట్లు, ఇప్పటికే తీసుకున్న రుణాలపై ఈఎంఐ చెల్లింపులు కూడా యథాతథంగా కొనసాగనున్నాయి. గత సంక్షోభాలతో పోలిస్తే, పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన సమయంలో మన ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని గవర్నర్‌ అన్నారు. కానీ, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కమోడిటీల ధరలు, సరఫరా అవాంతరాలు భవిష్యత్‌ వృద్ధి అవకాశాలపై మబ్బు కమ్మేశాయన్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగినప్పటికీ, వడ్డీ రేట్ల విషయం లో మరింత స్పష్టత వచ్చే వరకు ఆగాలని కమిటీ భావించిందన్నారు.

ద్రవ్యోల్బణం 5.1 శాతానికి

ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.1 శాతానికి పెరగవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. గత అంచనా 4.6 శాతంతో పోలిస్తే 0.5 శాతం అధికమిది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు, సహజ వాయువు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ రేట్లూ గణనీయంగా పెరిగాయి. ఇది రవాణా, ఉత్పత్తి వ్యయాలపై ప్రభావం చూపుతున్నదని ఆర్‌బీఐ పేర్కొంది. అంతేకాదు, ఎల్‌ నినో ప్రభావంతో ఈసారి వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా నమోదు కావచ్చన్న అంచనాల నేపథ్యంలో మున్ముందు నెలల్లో ఆహార ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయని ఆర్‌బీఐ హెచ్చరించింది.

12 ‘వడ్డీ’ఉండొచ్చు

ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని విరమించుకోలేదని ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా అన్నారు. ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం కట్టడికి బదులు వృద్ధికి ప్రాధాన్యమిస్తున్నదన్న అభిప్రాయాలను ఆయన తోసిపుచ్చారు. ధరల పెరుగుదల విస్తృతంగా, నిలకడగా కొనసాగుతుందా అనే దానిపైనే భవిష్యత్‌ ద్రవ్య పరపతి సమీక్ష చర్యలు ఆధారపడి ఉంటాయని ఆయన సంకేతాలిచ్చారు. ద్రవ్యోల్బణ అంచనాల పెంపుతో పాటు గవర్నర్‌ వ్యాఖ్యలను బట్టి చూస్తే, మున్ముందు నెలల్లో రెపో రేటును ఒకటి లేదా రెండు సార్లు పెంచే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఈసారి వృద్ధి 6.6 శాతమే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2026-27)కి జీడీపీ వృద్ధి అంచనాను ఏప్రిల్‌ లో ప్రకటించిన 6.9ు నుంచి 6.6 శాతానికి తగ్గించింది ఆర్‌బీఐ. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా పెరిగిన ఇంధన, కమోడిటీ ధరలు, సరఫరా అవాంతరాలు దేశీయ ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపవచ్చని ఆర్‌బీఐ హెచ్చరించింది. అంతర్జాతీయంగా దీర్ఘకాలిక సరఫరా అవాంతరాలు, ఆర్థిక సేవల మార్కెట్లో తీవ్ర ఒడుదుడుకులు, ఎల్‌నినో వంటి వాతావరణ సంబంధిత షాక్‌లు కూడా వృద్ధికి గండి కొట్టవచ్చని అంటోంది.


ఆర్‌బీఐ గవర్నర్‌ ఏమన్నారంటే..

11 నెలలకు సరిపడా ఫారెక్స్‌ నిల్వలు: ప్రస్తుతం మన వద్ద 68,230 కోట్ల డాలర్ల విలువైన విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలున్నాయి. ఇవి 11 నెలల దిగుమతి అవసరాలకు సరిపోతాయి. విదేశీ మారక నిల్వలను మరింత పెంచుకునేందుకు ఈ సమీక్షలో పలు చర్యలు చేపట్టడం జరిగింది.

భారత ఆర్థిక పరిస్థితి పటిష్ఠం: మొత్తం గా చూస్తే, భారత ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. ప్రస్తుత ప్రతికూలతలను అవకాశాలుగా మల్చుకుని భవిష్యత్‌లో మరింత బలపడతామన్న నమ్మకం ఉంది.

వర్షపాత లోటుతో గ్రామీణ గిరాకీపై ప్రభావం: ఈసారి వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా నమోదైతే గ్రామీణ మార్కెట్‌ గిరాకీతో పాటు ప్రైవేట్‌ రంగ వినియోగంపై ప్రభావం చూపవ చ్చు. ప్రభుత్వం ఏమైనా ఉపశమన చర్యలు చేపడితే ఈ ప్రభావం కాస్త తగ్గే అవకాశం ఉంటుంది.

ప్లాస్టిక్‌ నోట్లను ప్రవేశపెట్టే ఆలోచన ఉంది: ప్రస్తుత కాగితం కరెన్సీ నోట్ల స్థానంలో పాలిమర్‌ (ప్లాస్టిక్‌) నోట్లను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదన మా పరిగణనలో ఉంది. ఈ ఆలోచన ప్రాథమిక దశలోనే ఉంది. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. ఇంకా తుది నిర్ణయానికి రావాల్సి ఉంది.

అధిక వడ్డీ చెల్లింపు ఆమోదయోగ్యం కాదు: డిపాజిట్లను ఆకర్షించేందుకు ప్రకటించిన దానికంటే అధిక వడ్డీ రేటు చెల్లించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. డిపాజిట్ల కోసం బ్యాంకుల మధ్య పోటీ మంచిదే. కానీ, ఈ విషయంలో బ్యాంకులు పారదర్శకంగా ఉండాలి.

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్

Updated Date - Jun 06 , 2026 | 03:24 AM