Share News

కొత్త గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌!

ABN , Publish Date - Jul 04 , 2026 | 04:55 AM

పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం.. గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకాన్ని (జీఎంఎస్‌) మరింత ఆకర్షణీయంగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత పథకానికి....

కొత్త గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌!

  • ప్రస్తుత పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం

  • పసిడి దిగుమతుల భారం తగ్గించుకునేందుకే..

న్యూఢిల్లీ: పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం.. గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకాన్ని (జీఎంఎస్‌) మరింత ఆకర్షణీయంగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత పథకానికి కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఈ ఆగస్టులో సరికొత్త అవతారంలో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. కొత్త పథకంలో ఆభరణ విక్రేతలు సైతం పాలుపంచుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి గడిచిన రెండు వారాల్లో ఇద్దరు సీనియర్‌ మంత్రులు, ఆర్‌బీఐ అధికారులు, బ్యాంకులు, పసిడి పరిశ్రమకు చెందిన ప్రతినిధులు పలుమార్లు సమావేశమైనట్లు ఓ ఆంగ్ల మీడియా కథనం పేర్కొంది. ఈ సమావేశంలో బులియన్‌ ఇండస్ట్రీ ప్రతినిధులు ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.

ఏంటీ జీఎంఎస్‌..?

ఈ పథకం ద్వారా కస్టమర్లు తమ బంగారాన్ని (నాణేలు, కడ్డీలు, రాళ్లు లేదా ఇతరాలు లేని ఆభరణాలు) బ్యాంక్‌ల వద్ద డిపాజిట్‌ చేయవచ్చు. కనీసం 10 గ్రాములు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠ పరిమితి లేదు. డిపాజిట్‌ చేసిన బంగారాన్ని కరిగించి 99.5 శాతం స్వచ్ఛతతో కూడిన గోల్డ్‌ బిస్కెట్ల రూపంలోకి మారుస్తారు. ఈ స్కీమ్‌లో తొలుత మూడు కాలపరిమితుల (స్వల్ప, మఽధ్య, దీర్ఘకాలిక)తో కూడిన డిపాజిట్లను ప్రవేశపెట్టారు. మధ్యకాలిక (5-7 ఏళ్లు) డిపాజిట్‌పై 2.25ు, దీర్ఘకాలిక (12-15 ఏళ్లు) డిపాజిట్‌పై 2.5ు వార్షిక వడ్డీ ప్రకటించారు. స్వల్పకాలిక (1-3 ఏళ్ల) డిపాజిట్‌పై వడ్డీని నిర్ణయించేందుకు సంబంధిత బ్యాంకుకే అధికారం కల్పించారు. కాలపరిమితి తీరాక కస్టమరు డిపాజిట్‌ చేసిన బంగారాన్ని లేదా దాని మార్కెట్‌ రేటుకు సమానమైన సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే, 2025 మార్చిలో ప్రభుత్వం మధ్య, దీర్ఘకాలిక డిపాజిట్‌ ఆప్షన్లను ఉపసంహరించుకుంది. కాగా, విధానపరమైన సమస్యలతో పాటు నమ్మకం లోపించిన కారణంగా కస్టమర్ల నుంచి ఈ పథకానికి ఆశించినంతగా స్పందన రాలేదు. గడిచిన 11 ఏళ్లలో ఈ స్కీమ్‌ కేవలం 39 టన్నుల బంగారాన్ని మాత్రమే సమీకరించగలిగింది.


దేశీయ కుటుంబాల వద్ద 25,000-50,000 టన్నుల బంగారం

దేశీయ కుటుంబాలు, ఆయా దేవాలయాల వద్ద మొత్తం 25,000 టన్నుల నుంచి 50,000 టన్నుల వర కు బంగారం నిరుపయోగంగా పడి ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ)తో పాటు పలు ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి. ఈ నిరుపయోగ బంగారం విలువ 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.475 లక్షల కోట్లు) స్థాయిలో ఉంటుందని, ఇది మన దేశ జీడీపీ కంటే 25 శాతం అధికమని కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ ఇటీవల విడుదల చేసిన నివేదికలో అంచనా వేసింది. పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు కుటుంబాలు, ఆలయ ట్రస్టుల వద్దనున్న నిరుపయోగ బంగారాన్ని తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లోనే గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.

మళ్లీ రూ.లక్షన్నరకు బంగారం

మరో రూ.3,300 పెరిగిన ధర

దేశీయంగా విలువైన లోహాల ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములకు రూ.3,300 పెరుగుదలతో రూ.1,50,800కు చేరుకుంది. కిలో వెండి రేటు మరో రూ.5,000 ఎగబాకి రూ.2.45 లక్షలకు పెరిగింది. అమెరికాలో తాజా ఉద్యోగ గణాంకాలు నిరాశాజనకంగా ఉండటంతో ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లను పెంచే విషయంలో మరికొంత కాలం వేచిచూడవచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో బులియన్‌కు మళ్లీ డిమాండ్‌ పెరిగింది. ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేటు ఒక దశలో 1.4ుపెరిగి 4,181 డాలర్లకు, వెండి 2.44ు వృద్ధితో 62.45 డాలర్లకు ఎగబాకాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

జోరుగా పెట్టుబడుల ఉపసంహరణ

సింగపూర్‌-మచిలీపట్నం మధ్య సబ్‌మెరైన్‌ కేబుల్‌

For More Business News And Telugu News

Updated Date - Jul 04 , 2026 | 04:55 AM