Share News

4 రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఫట్‌

ABN , Publish Date - May 13 , 2026 | 02:21 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో పయనించాయి. సెన్సెక్స్‌ 75,000, నిఫ్టీ 23,400 దిగువకు జారుకున్నాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య మళ్లీ...

4 రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఫట్‌

సెన్సెక్స్‌ 1,456 పాయింట్లు డౌన్‌ జూ 23,400 దిగువకు నిఫ్టీ

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు

చమురు ధరల పెరుగుదలే కారణం

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో పయనించాయి. సెన్సెక్స్‌ 75,000, నిఫ్టీ 23,400 దిగువకు జారుకున్నాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, దాంతో ముడి చమురు ధరలు మరింత ఎగబాకడం ఇందుకు కారణమయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ, రూపాయి సరికొత్త కనిష్ఠానికి పతనమవడం మార్కెట్‌ వర్గాల సెంటిమెంట్‌ను మరింత కుంగదీసింది. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒక దశలో 1,565.78 పాయింట్లు పతనమై 74,449.50 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 1,456.04 పాయింట్ల (1.92 శాతం) నష్టంతో 74,559.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 436.30 పాయింట్లు (1.83 శాతం) కోల్పోయి 23,379.55 వద్ద ముగిసింది. అమ్మకాల సునామీలో రూ.11.28 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద హరించుకుపోయింది. దాంతో బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.456.02 లక్షల కోట్లకు (4.77 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. గడిచిన నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 3,399.28 పాయింట్లు (4.36 శాతం), నిఫ్టీ 951.4 పాయింట్లు (3.91 శాతం) క్షీణించాయి. ఈ నాలుగు రోజుల్లో రూ.16.77 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద ఆవిరైంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) నికరంగా రూ.1,959.39 కోట్ల షేర్లను విక్రయించగా.. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు(డీఐఐ) రూ.7,990.32 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.

ఐటీకి మళ్లీ ఏఐ భయాలు...భారీగా నష్టపోయిన షేర్లు: కృత్రిమ మేధ (ఏఐ) విధ్వంసం భయాలతో దేశీయ ఐటీ రంగ షేర్లు మరోసారి భారీగా నష్టపోయాయి. ఐటీ కంపెనీల బిల్లింగ్‌పై ఏఐ ఆధారిత ఒత్తిడితో పాటు క్లయింట్లకు నేరుగా ఎంటర్‌ప్రైజ్‌ ఏఐ సేవలందించేందుకు ఏఐ డిప్లాయ్‌మెంట్‌ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్‌ఏఐ ప్రకటించడం ఇందుకు ప్రధాన కారణమైంది. ఈ డిప్లాయ్‌మెంట్‌ కంపెనీ దేశీయ సంప్రదాయ ఐటీ సేవల సంస్థలకు ప్రత్యామ్నాయంగా మారడంతో పాటు వాటి ఆదాయానికి భారీగా గండికొట్టే అవకాశాలున్నాయి. దాంతో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున అమ్మకాలకు పాల్పడ్డారు.


వెండి రూ.12,000 అప్‌

రూ.2.77 లక్షలకు కిలో ధర

దేశీయంగా విలువైన లోహాల ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ.12,000 పెరుగుదలతో రూ.2.77 లక్షలకు ఎగబాకింది. 10 గ్రాముల మేలిమి బంగారం రూ.1,500 పెరిగి రూ.1,56,800 ధర పలికింది. రూపాయి క్షీణతతో పాటు పశ్చిమాసియాలో ఉద్రికత్తల నేపథ్యంలో దేశీయంగా బులియన్‌కు డిమాండ్‌ కొనసాగడం ఇందుకు కారణమైందని ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ పేర్కొంది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో మాత్రం ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ఒక శాతం తగ్గి 4,692 డాలర్లు, సిల్వర్‌ 83.50 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.

రూపీః 95.68

కొత్త ఆల్‌టైం కనిష్ఠానికి రూపాయి

భారత కరెన్సీ వరుసగా రెండో రోజూ సరికొత్త జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 40 పైసలు క్షీణించి రూ.95.68 వద్ద ముగిసింది. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ముడి చమురు మరింత ఎగబాకడం, డాలర్‌ బలోపేతం ఇందుకు ప్రధాన కారణం. ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ కూడా రూపాయిపై ఒత్తిడి పెంచాయని ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ సూచీ 0.33 శాతం పెరిగి 98.23కు చేరుకుంది.

ఈ వార్తలనూ చదవండి:

ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం

అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత

Updated Date - May 13 , 2026 | 02:21 AM