రూపాయి ఢమాల్!
ABN , Publish Date - May 01 , 2026 | 05:01 AM
ముడి చమురు భగ్గుమనడంతో భారత కరెన్సీ కంగారు పడింది. గురువారం నాడు ఫారెక్స్ మార్కెట్లో రూ.95.01 వద్ద ప్రారంభమైన డాలర్-రూపాయి మారకం విలువ....
సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి రూపీ
ఇంట్రాడేలో రూ.95.34 వద్దకు డాలర్‌తో మారకం విలువ
చివరికి 4 పైసల లాభంతో రూ.94.84 వద్ద ముగింపు
ముంబై: ముడి చమురు భగ్గుమనడంతో భారత కరెన్సీ కంగారు పడింది. గురువారం నాడు ఫారెక్స్ మార్కెట్లో రూ.95.01 వద్ద ప్రారంభమైన డాలర్-రూపాయి మారకం విలువ.. ఒక దశ లో 46 పైసలు క్షీణించి సరికొత్త ఆల్‌టైం రికార్డు కనిష్ఠ స్థాయి రూ.95.34 వద్దకు చేరుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ పీపా ధర ఒక దశలో 126 డాలర్లకు ఎగబాకడం, డాలర్ బలపడటం, యూఎస్ బాండ్ల రేట్ల పెరుగుదల, మన ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, నెలాఖరు కావడంతో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం ఇందుకు కారణమయ్యాయి. అయితే, ముడిచమురు మళ్లీ కాస్త దిగిరావడంతో మన కరెన్సీ కూడా కోలుకుంది. ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసేసరికి, డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసల లాభంతో రూ.94.84 వద్ద స్థిరపడింది. బుధవారం ట్రేడింగ్‌లో డాలర్-రూపీ ఎక్స్ఛేంజ్ రేటు 20 పైసల నష్టంతో రూ.94.88 వద్ద ముగిసింది.
రెండోసారి..: డాలర్-రూపీ మారకం విలువలో క్రితం ఆల్‌టైం రికార్డు కనిష్ఠం ఈ మార్చి 30న రూ.95.22 వద్ద నమోదైంది. ఆ తర్వాత ఎక్స్ఛేంజ్ రేటు రూ.95 స్థాయిని దాడటం మళ్లీ ఇదే మొదటిసారి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు పెరుగుతూ పోతుండటం, ఎఫ్‌ఐఐల నిరవధిక పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో రూపాయి మరింత ఒత్తిడికి లోను కానుందని ఫారెక్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటే రూపాయి పతనానికి కొంత మేర అడ్డుకట్ట పడవచ్చన్నారు. మున్ముందు సెషన్లలో డాలర్-రూపీ మారకం విలువ రూ.94.80 -95.60 శ్రేణిలో కదలాడవచ్చని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి అన్నారు.
ఇవి కూడా చదవండి
స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు రెగ్యులర్‌గా మార్పు
చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు