Share News

14 క్యారెట్ల పసిడి ఆభరణాలకే అనుమతి! భారత్‌లో ఈ రూల్ ఉండేదని తెలుసా?

ABN , Publish Date - May 15 , 2026 | 05:17 PM

విదేశీ కరెన్సీ కొరత నెలకొన్న సందర్భాల్లో భారత్ అనేక సార్లు బంగారం దిగుమతుల కట్టడికి ప్రయత్నించిందని నిపుణులు చెబుతున్నారు. 14 క్యారెట్లకు మించిన ఆభరణాల తయారీపై నిషేధం, గోల్డ్ బార్స్, కాయిన్స్ నిల్వలపై నిషేధం వంటి రూల్స్‌ను ప్రభుత్వం అమలు చేసింది.

14 క్యారెట్ల పసిడి ఆభరణాలకే అనుమతి! భారత్‌లో ఈ రూల్ ఉండేదని తెలుసా?
Gold Control Rules India

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా పడిపోతుండటంతో భారత్‌ అదనపు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలను కాపాడుకునేందుకు భారతీయులు బంగారం కొనుగోళ్లపై పరిమితులు పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అయితే, భారత్ గతంలో కూడా ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొందని పరిశీలకులు చెబుతున్నారు. ఒక దశలో దేశంలో 14 క్యారెట్ల బంగారు ఆభరణాల తయారీకే అనుమతి ఉండేదని చెబుతున్నారు.

చైనాతో యుద్ధం.. గోల్డ్ కంట్రోల్ రూల్స్

1962లో చైనాతో యుద్ధం సమయంలో భారత్‌లో ఫారెక్స్ నిల్వలు తగ్గి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీంతో, ఆర్థిక పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ప్రభుత్వం అప్పట్లో గోల్డ్ కంట్రోల్ రూల్స్‌ను అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం, నగల వ్యాపారులకు 14 క్యారెట్లకు మించిన బంగారు ఆభరణాల తయారీకి అనుమతి ఉండేది కాదు. ఫారిన్ ఎక్సేంజ్ నిల్వలు తరిగిపోకుండా ఉండేందుకు ఈ నిబంధన అవసరమంటూ అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు లేఖ రాశారు. 24 క్యారెట్ల బంగారం రూపంలోనే గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోందని అన్నారు. దేశ సంపదలో అధిక భాగం బంగారం రూపంలో ప్రజల వద్ద నిల్వ ఉండటంతో ఇతర ఆర్థిక కార్యకలాపాలకు నిధుల కొరత పెరిగిందని కూడా ప్రభుత్వం భావించింది.


అయితే, ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వం ఆ తరువాత ఈ నిబంధనను సడలించింది. అప్పటికీ ఆర్థిక ఇక్కట్లు కొనసాగుతుండటంతో ప్రభుత్వం 1968లో గోల్డ్ కంట్రోల్ యాక్ట్‌ను తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రైవేటు వ్యక్తులు తమ వద్ద మేలిమి గోల్డ్ బార్స్, నాణేలు నిల్వ ఉంచుకునేందుకు అనుమతి ఉండేది కాదు. దేశ ప్రజలు బంగారం కొనుగోళ్లు, నిల్వలను తగ్గిస్తే దిగుమతుల భారం తగ్గి విదేశీ కరెన్సీ నిల్వలను కాపాడుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

ఇక 1991లో ఆర్థిక సంక్షోభం సమయంలో భారత ప్రభుత్వం తన వద్ద ఉన్న బంగారం నిల్వలను విదేశాల్లో కుదువ పెట్టి రుణాన్ని సేకరించింది. ఆ తరువాత చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో కోలుకుంది. ఇక 2025-26 మధ్య కాలంలో భారత్ 72 బిలియన్ డాలర్ల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం, 2026 మార్చి నాటికి భారత్ వద్ద 880.5 టన్నుల బంగారం ఉంది. ఈ పసిడి విలువ 115 బిలియన్ డాలర్లు.


ఈ వార్తలనూ చదవండి:

కేంద్రం కీలక నిర్ణయం.. పసిడి దిగుమతిపై పరిమితి

42 నెలల గరిష్ఠానికి టోకు ధరల ద్రవ్యోల్బణం

Updated Date - May 15 , 2026 | 05:36 PM