ఎగుమతులు 49 నెలల గరిష్ఠం
ABN , Publish Date - May 16 , 2026 | 03:29 AM
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలోనూ ఎగుమతులు భారీగా పుంజుకున్నాయి. ఏప్రిల్ నెలలో భారత వస్తు ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 13.78 శాతం వృద్ధి చెంది 4,356 కోట్ల డాలర్లకు (రూ.4.18 లక్షల కోట్లు) చేరాయి. ...
ఏప్రిల్‌లో రూ.4.18 లక్షల కోట్లకు చేరిక
13.78 శాతానికి ఎగుమతుల వృద్ధి రేటు
పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పుంజుకోవడమే కారణం
6 నెలల గరిష్ఠ స్థాయికి దిగుమతులు.. రూ.6.90 లక్షల కోట్లుగా నమోదు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలోనూ ఎగుమతులు భారీగా పుంజుకున్నాయి. ఏప్రిల్ నెలలో భారత వస్తు ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 13.78 శాతం వృద్ధి చెంది 4,356 కోట్ల డాలర్లకు (రూ.4.18 లక్షల కోట్లు) చేరాయి. ఎగుమతుల విలువకు ఇది 49 నెలల గరిష్ఠం కాగా.. ఎగుమతుల వృద్ధికి 5 నెలల గరిష్ఠ స్థాయి. క్రూడాయిల్ రేట్లు వేగంగా ఎగబాకిన తరుణంలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి విలువ సైతం భారీగా పెరగడం ఇందుకు కారణమైంది. గత నెలలో భారత్‌లోకి వస్తు దిగుమతులు కూడా వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెరిగి 6 నెలల గరిష్ఠ స్థాయి 7,194 కోట్ల డాలర్లకు (రూ.6.90 లక్షల కోట్లు) చేరుకున్నాయి. దాంతో వాణిజ్య లోటు సైతం 3 నెలల గరిష్ఠ స్థాయి 2,838 కోట్ల డాలర్లకు (రూ.272 లక్షల కోట్లు) పెరిగింది. ఎగుమతుల ఆదాయం, దిగుమతుల వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని వాణిజ్య లోటు అంటారు. 2025 ఏప్రిల్‌లో లోటు 2,710 కోట్ల డాలర్లుగా నమోదు కాగా.. ఈ మార్చిలో 2,067 కోట్ల డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలోనూ దేశ ఎగుమతులు మెరుగైన వృద్ధిని నమోదు చేశాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ అన్నారు.
గత నెలలో పెట్రోలియం ఉత్పత్తులు 960 కోట్ల డాలర్లకు (సుమారు రూ.92,160 కోట్లు), ఎలకా్ట్రనిక్ ఎగుమతులు 517 కోట్ల డాలర్లకు (రూ.49,632 కోట్లు) పెరిగాయి. మరిన్ని కొత్త మార్కెట్లకు వస్తువులను ఎగుమతి చేయడం కూడా అధిక వృద్ధికి దోహదపడింది. సింగపూర్, టాంజానియా, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్, మలేషియా, ఆస్ట్రేలియా, వియత్నాం మార్కెట్లకు ఎగుమతుల్లో మంచి వృద్ధి నమోదైంది.
బంగారం దిగుమతులు 82% జంప్
ఈ ఏప్రిల్‌లో భారత్‌లోకి బంగారం దిగుమతులు వార్షిక ప్రాతిపదికన 81.69 శాతం పెరిగి 562 కోట్ల డాలర్లకు (రూ.53,952 కోట్లు) చేరాయి. వెండి దిగుమతులు ఏకంగా 157.16 శాతం వృద్ధితో 41.1 కోట్ల డాలర్లకు (రూ.3,946 కోట్లు) ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు గణనీయంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణమైంది. కేంద్ర ప్రభుత్వం బుధవారం పసిడి, వెండిపై దిగుమతి సుంకాన్ని ఏకంగా రెండున్నర రెట్ల స్థాయికి (6 శాతం నుంచి 15 శాతానికి) పెంచింది. అలాగే, పసిడి దిగుమతులపైనా పరిమితులు విధించింది. కాగా వెండిని పారిశ్రామిక అవసరాలకూ ఉపయోగిస్తుండటంతో సుంకం పెంపు వీటి దిగుమతులపై అంతగా ప్రభావం చూపకపోవచ్చని విశ్లేషకులు అన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో బంగారం దిగుమతుల విలువ 24 శాతం ఎగబాకి ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి 7,198 కోట్ల డాలర్లకు చేరుకుంది. దిగుమతుల పరిమాణం మాత్రం 4.76 శాతం తగ్గి 721.03 టన్నులుగా నమోదైంది.
సేవల ఎగుమతులు రూ.3.58 లక్షల కోట్లు
గత నెలలో భారత సేవల ఎగుమతులు 3,724 కోట్ల డాలర్లకు (రూ.3.58 లక్షల కోట్లు) చేరి ఉండవచ్చని అంచనా. 2025 ఏప్రిల్‌లో సేవల ఎగుమతులు 3,285 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. కాగా, గత నెల సేవల దిగుమతులు 1,666 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.1.60 లక్షల కోట్లు) తగ్గాయి. గత ఏడాది ఏప్రిల్‌లో 1,691 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. రూపాయి క్షీణత ప్రభావంపై వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ స్పందిస్తూ, ఎగుమతులకు ఇది సానుకూల పరిణామమే అని అన్నారు.
పశ్చిమాసియాకు
ఎగుమతుల్లో 28% క్షీణత
ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంతో పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారింది. దాంతో వరుసగా రెండో నెలా ఈ ప్రాంతానికి భారత ఎగుమతులు తగ్గాయి. ఏప్రిల్ నెలలో 28 శాతం క్షీణించి 416 కోట్ల డాలర్లకు (రూ.39,936 కోట్లు) పడిపోయాయి. 2025 ఏప్రిల్‌లో ఈ విలువ 578 కోట్ల డాలర్లుగా నమోదైంది. గత నెలలో పశ్చిమాసియా నుంచి దిగుమతులు సైతం 31.64 శాతం తగ్గి 1,047 కోట్ల డాలర్లకు (రూ.1,00,512 కోట్లు) పరిమితమయ్యాయి. క్రితం సంవత్సరంలో ఇదే కాలానికి దిగుమతులు 1,532 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. ఈ మార్చిలోనైతే పశ్చిమాసియాకు ఎగుమతు లు, దిగుమతులు 50 శాతానికి పైగా క్షీణించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా, ఒమన్, ఇరాన్, బహ్రెయిన్ సహా పలు దేశాలు పశ్చిమాసియా ప్రాంతం పరిధిలోకి వస్తాయి.
గత నెలలో యూఏఈకి ఎగుమతులు 36.39 శాతం తగ్గి 218 కోట్ల డాలర్లకు పడిపోగా.. దిగుమతులు కూడా 34.63 శాతం తగ్గి 407 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. సౌదీ అరేబియా కు ఎగుమతులు 2.89 శాతం క్షీణించి 85.2 కోట్ల డాలర్లకు జారుకున్నాయి. సౌదీ నుంచి దిగుమతులు మాత్రం 30.29 శాతం పెరుగుదలతో 384 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. ఒమన్ నుంచి దిగుమతులు 246.42 శాతం పెరిగి 148 కోట్ల డాలర్లకు చేరాయి.
లక్ష కోట్ల డాలర్ల
ఎగుమతుల లక్ష్యం
ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో వస్తు, సేవల ఎగుమతులను లక్ష కోట్ల డాలర్ల (రూ.96 లక్షల కోట్లు) స్థాయికి పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేయనుంది. రూ.25,060 కోట్ల ఎగుమతుల ప్రోత్సాహక పథకం, పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఇందుకు తోడ్పడనున్నాయి.
రాజేశ్ అగర్వాల్,
వాణిజ్య కార్యదర్శి
ఈ వార్తలనూ చదవండి:
కేంద్రం కీలక నిర్ణయం.. పసిడి దిగుమతిపై పరిమితి
42 నెలల గరిష్ఠానికి టోకు ధరల ద్రవ్యోల్బణం