‘బేర్’ పట్టులో బులియన్ మార్కెట్
ABN , Publish Date - Nov 16 , 2026 | 02:22 AM
బులియన్ మార్కెట్ ‘బేర్’మంటోంది. గత వారం బంగారం, వెండి లోహాల ధరలు స్పాట్ మార్కెట్, ఫ్యూచర్స్ మార్కెట్లో 4.5 నుంచి 5 శాతం వరకు...
ఈ వారం మరింత తగ్గే చాన్స్
ఔన్స్ ధర 3,750 డాలర్లకు దిగొచ్చే అవకాశం
ముంబై: బులియన్ మార్కెట్ ‘బేర్’మంటోంది. గత వారం బంగారం, వెండి లోహాల ధరలు స్పాట్ మార్కెట్, ఫ్యూచర్స్ మార్కెట్లో 4.5 నుంచి 5 శాతం వరకు పడిపోయాయి. ఈ పతనం ఈ వారం కూడా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. అమెరికాతో సహా ప్రధాన ప్రపంచ దేశాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం చుక్కలంటుతోంది. దీంతో ఈ ధరలను కట్టడి చేసేందుకు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్‌తో పాటు ప్రధాన కేంద్ర బ్యాంకులన్నీ కీలక వడ్డీ రేట్లు మరింత పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో బులియన్ మార్కెట్లో దిద్దుబాటు (కరెక్షన్) ఈ వారం కూడా కొనసాగుతుందని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. ‘బులియన్ మార్కెట్లో ఆటుపోట్లు ఈ వారమూ కొనసాగే అవకాశం ఉంది. అంతర్జాతీయ ధరలు, డాలర్‌తో రూపా యి మారకం రేటు.. ఈ వారం ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ లో పసిడి, వెండి ధరలను ప్రభావితం చేస్తాయి. దీంతో సమీప భవిష్యత్‌లో బంగారం, వెండి ధరలు బేరిష్‌గానే కనిపిస్తున్నాయి’ అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్, కరెన్సీ విభాగం సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది అంచనా. మరోవైపు బ్రోకరేజీ సంస్థ మిరే అసెట్ షేర్‌ఖాన్.. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 3,884 డాలర్ల వద్ద ట్రేడవుతున్న ఔన్స్ (31.10 గ్రాములు) పసిడి ధర ఈ వారం 3,750 డాలర్ల వరకు దిగొచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలాగే 48.8 డాలర్ల వద్ద ట్రేడవుతున్న ఔన్స్ వెండి ఽధర కూడా 44-45 డాలర్లకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
కాగా ఢిల్లీ స్పాట్ మార్కెట్లో గత శుక్రవారం 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.2,500 నష్టపోయి రూ.1,40,900 వద్ద, కిలో వెండి ధర రూ.3,500 నష్టంతో రూ.1.84 లక్షల వద్ద ముగిశాయి. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్‌లోనూ ఈ పతనం కొనసాగింది. డిసెంబరులో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి పసిడి ధర 4.61 శాతం నష్టంతో రూ.1,36,705 వద్ద, కిలో వెండి ధర దాదాపు 5 శాతం నష్టపోయి రూ.1,76,543 వద్ద ముగిశాయి.
అదే దారిలో చమురు ధర
ముడి చమురు ధర కూడా బులియన్ మార్కెట్ దారిలోనే ప్రయాణిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ రకం ముడి చమురు ధర 95-96 డాలర్ల మధ్య ట్రేడవుతోంది. సరఫరాలు, నిల్వలు భారీగా పెరగడం, అమెరికా-ఇరాన్ మధ్య తగ్గుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వారం బ్యారెల్ బ్రెరట్ రకం చమురు ధర 90-92 డాలర్లకు దిగి వచ్చే అవకాశం ఉందని రెలిగేర్ బ్రోకింగ్ సంస్థ రీసెర్చి విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
మియామి ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ.. ఇద్దరికి గాయాలు
చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..