వ్యూహాత్మక ఖనిజంగా పసిడి
ABN , Publish Date - Aug 05 , 2026 | 05:21 AM
పసిడిని వ్యూహాత్మక ఖనిజంగా గుర్తించాలనే డిమాండ్ పెరుగుతోంది. దిగుమతులకు చెక్ పెట్టి.. దేశీయ ఉత్పత్తి పెంచుకోవాలంటే ఈ లోహాన్ని ‘వ్యూహాత్మక’ ఖనిజంగా వర్గీకరించడమే మేలని...
అప్పుడే దిగుమతులకు చెక్
ప్రభుత్వానికి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వినతి
ముంబై: పసిడిని వ్యూహాత్మక ఖనిజంగా గుర్తించాలనే డిమాండ్ పెరుగుతోంది. దిగుమతులకు చెక్ పెట్టి.. దేశీయ ఉత్పత్తి పెంచుకోవాలంటే ఈ లోహాన్ని ‘వ్యూహాత్మక’ ఖనిజంగా వర్గీకరించడమే మేలని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ సంస్థ భారత విభాగం సీఈఓ సచిన్ జైన్ ఈ విషయం వెల్లడించారు. ఇలా గుర్తించడం వల్ల మైనింగ్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వం నుంచి పొందే ఒకే లైసెన్సుతో దేశంలో ఎక్కడైనా పసిడి నిక్షేపాల అన్వేషణ, ఉత్పత్తి చేపట్టేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో ఏదైనా కంపెనీ పసిడి నిక్షేపాల కోసం అన్వేషణ, ఉత్పత్తి చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక అనుమతుల కోసం కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందన్నారు. పసిడి దిగుమతుల భారం తగ్గించుకోవాలంటే 2047 నాటికి దేశీయ డిమాండ్‌లో కనీసం 10 నుంచి 15 శాతమైనా దేశీయ ఉత్పత్తి ద్వారా భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) పెద్ద గుదిబండగా మారే ప్రమాదం ఉందని జైన్ హెచ్చరించారు. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకీ ఈ విషయం తెలిపినట్టు చెప్పారు.
దేశంలో 31,000 టన్నుల పసిడి
దేశంలో ప్రజల వద్ద దాదాపు రూ.314.9 లక్షల కోట్ల విలువ చేసే 31,000 టన్నుల పసిడి ఉందని జైన్ వెల్లడించారు. ఇందులో 20,000 టన్నులు నగల రూపంలో ఉంటే మిగతా మొత్తం నాణేలు, కడ్డీల రూపంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఏటా కనీసం ఒక శాతం పసిడిని నగదీకరించినా రూ.3.1 లక్షల కోట్ల పసిడి దిగుమతులకు చెక్ పెట్టవచ్చని జైన్ తెలిపారు. బంగారు నాణేలు, కడ్డీల డిజిటైజేషన్ ఇందుకు చక్కటి మార్గమన్నారు. తద్వారా సమకూరే నిధులను ఉత్పాదక కార్యకలాపాలకు మళ్లిస్తే ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుందన్నారు.
Also Read:
మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంతాల ఆదర్శంగా పని చేద్దాం: వెంకయ్య నాయుడు
శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు