‘నగ’మోము చిన్నబోయే!
ABN , Publish Date - May 12 , 2026 | 03:18 AM
విదేశీ మారక నిల్వలను ఆదా చేసేందుకు ఏడాది పాటు పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ ప్రజలను కోరడంపై దేశీయ ఆభరణాల పరిశ్రమ ఆందోళన చెందుతోంది....
ప్రధాని మోదీ వ్యాఖ్యలతో జువెలరీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం
జీజేసీ చైర్మన్ రాజేశ్ రోక్డే
ముంబై: విదేశీ మారక నిల్వలను ఆదా చేసేందుకు ఏడాది పాటు పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ ప్రజలను కోరడంపై దేశీయ ఆభరణాల పరిశ్రమ ఆందోళన చెందుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కోటి మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న జువెలరీ పరిశ్రమపై ఇది తీవ్ర ప్రభావం చూపనుందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మన్ రాజేశ్ రోక్డే అన్నారు. పసిడి వినియోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న ప్రధాని ఉద్దేశాన్ని తాము అర్ధం చేసుకోగలమన్నారు. అయితే, దేశీయ కుటుంబాల వద్ద వేలాది టన్నుల బంగారం నిరుపయోగంగా పడి ఉందని, గిరాకీని తగ్గించే బదులు గోల్డ్ మానిటైజేషన్ పథకం పునరుద్ధరణ ద్వారా నిరుపయోగ బంగారాన్ని పునర్వినియోగంలోకి తేవాలన్నారు. తద్వారా పసిడి దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకోగలమన్నారు.
నియంత్రిత సమయాల్లో ప్రజలు మరింత బంగారం కొనుగోలు చేసిన సందర్భాలను గతంలో చూశామన్నారు. పసిడి కొనుగోళ్లు నిలిచిపోతే ఆభరణాల పరిశ్రమతోపాటు బీఎఫ్‌ఎ్‌సఐ, రిటైల్, ఈ-కామర్స్, జువెలరీ డిజైనింగ్, లాజిస్టిక్స్ తదితర రంగాలపైనా ప్రభావం పడుతుందన్నారు. కాబట్టి, ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచన చేయాలని ఆయన కోరారు.
బులియన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలి..
పసిడి కొనుగోళ్ల వాయిదాకు బదులు దేశీయంగా నిరుపయోగంగా ఉన్న బంగారం పునర్వినియోగం, రీసైక్లింగ్ ఉత్తమ పరిష్కారాలని ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (ఏఐజేజీఎ్‌ఫ) అంటోంది. పసిడి గిరాకీ పూర్తిగా మందగిస్తే ఈ రంగంపై ఆధారపడి ఉన్న 3.5 కోట్ల మంది జీవితాలు రోడ్డునపడే ముప్పు ఉందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశీయంగా బంగారం సమీకరణ, ప్రామాణీకరణతోపాటు బంగారం రుణాలు, సెటిల్‌మెంట్స్ కోసం బులియన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ఏఐజేజీఎఫ్ ప్రతిపాదించింది. అంతేకాదు, ఈ బులియన్ బ్యాంక్ ద్వారా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్) తమ వద్దనున్న బంగారు లోహంలో 20-30 వరకు అప్పుగా ఇచ్చేందుకు అనుమతించాలని అసోసియేషన్ సూచించింది. మెరుగైన నియమావళితో కూడిన బులియన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయగలిగితే వార్షిక పసిడి దిగుమతులు 200-300 టన్నుల వరకు తగ్గవచ్చని ఏఐజేజీఎఫ్ అంటోంది.
ఆభరణాల షేర్లు విల విల
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు పసిడి దిగుమతులను తగ్గించుకోవాలని, ఏడాది కాలం బంగారం కొనుగోలు చేయవద్దని హైదరాబాద్ లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రజలను కోరారు. దాంతో సోమవారం స్టాక్‌మార్కెట్లో ఆభరణాల తయారీ, విక్రయ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. బీఎ్‌సఈలో కల్యాణ్ జువెలర్స్ షేరు 9.23శాతం క్షీణించింది. సెన్కో గోల్డ్ 8.61 శాతం, త్రిభువన్‌దా్‌స భీమ్‌జీ జవేరీ 7.52 శాతం, టైటాన్ 6.83 శాతం, స్కైగోల్డ్ అండ్ డైమండ్స్ 6.63 శాతం, తంగమాయిల్ జువెలరీ 5.69 శాతం, పీసీ జువెలర్స్ 4.94 శాతం నష్టపోయాయి.
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత