‘నగ’కు నై.. పెట్టుబడికి సై!
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:51 AM
ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) భారత్‌లో పసిడి గిరాకీ వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెరిగి 151 టన్నులకు చేరుకుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ)...
జువెలరీ కొనుగోళ్లను మించిన గోల్డ్ ఇన్వె్‌స్టమెంట్స్
క్యూ1లో 54 శాతం పెరుగుదలతో 82 టన్నులకు పసిడి పెట్టుబడులు
19 శాతం తగ్గి 66 టన్నులకు పడిపోయిన స్వర్ణాభరణాల గిరాకీ
మొత్తం గోల్డ్ డిమాండ్ 151 టన్నులు
డబ్ల్యూజీసీ నివేదిక వెల్లడి
ముంబై: ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) భారత్‌లో పసిడి గిరాకీ వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెరిగి 151 టన్నులకు చేరుకుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. బంగారం ధరలు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో ఈ విలువైన లోహంలో పెట్టుబడులకు డిమాండ్ ఊపందుకోవడం ఇందుకు దోహదపడిందని బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2025లో తొలి త్రైమాసికానికి బంగారం గిరాకీ 137 టన్నులుగా నమోదైంది.
ట్రెండ్ మారింది గురూ..
ఈసారి పసిడి గిరాకీలో స్పష్టమైన మార్పు కన్పించిందని, తొలిసారిగా బంగారంలో పెట్టుబడులు ఆభరణాల కొనుగోళ్లను మించిపోయాయని డబ్ల్యూజీసీ రిపోర్టు వెల్లడించింది. క్యూ1లో బంగారు నాణేలు, కడ్డీలు, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎ్‌ఫ)లో పెట్టుబడులు 54 శాతం పెరిగి 82 టన్నులకు చేరుకోగా.. ఆభరణాల గిరాకీ మాత్రం 19 శాతం తగ్గి 66 టన్నులకు పరిమితమైంది. ధర క్రమంగా పెరగడం పెట్టుబడికి అవకాశంగా మారగా... ఆభరణం కొనుగోలుకు మాత్రం ప్రతిబంధకంగా మారింది.
నాణేలు, కడ్డీల వాటా 41 శాతానికి..
ఈ క్యూ1 పసిడి గిరాకీలో నాణేలు, కడ్డీల వాటా 41 శాతానికి పెరిగింది. 2000 సంవత్సరం తర్వాత ఈ విభాగానికిదే గరిష్ఠ స్థాయి. గత ఏడాది క్యూ1లో వీటి డిమాండ్ వాటా 34 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నాణేలు, కడ్డీల గిరాకీలో భారత్ వాటా 13 శాతానికి పెరిగింది.
గిరాకీ విలువ రెట్టింపు
విలువపరంగా, క్యూ1లో గోల్డ్ గిరాకీ దాదాపు రెట్టింపైంది. వార్షిక ప్రాతిపదికన 99 శాతం వృద్ధితో రూ.2,27,500 కోట్లకు (2,500 కోట్ల డాలర్లు) చేరుకుంది. 2025లో జనవరి-మార్చి కాలానికి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం సగటు ధర రూ.83,375గా నమోదు కాగా.. ఈ సంవత్సరంలో అదే కాలానికి రేటు 81 శాతం వృద్ధితో రూ.1,51,108కి పెరిగింది. క్యూ1లో ఆభరణాల కొనుగోళ్ల పరిమాణం 19 శాతం తగ్గినప్పటికీ, విలువ మాత్రం 47 శాతం పెరుగుదలతో రూ.99,900 కోట్లుగా నమోదైంది. ధరల్లో భారీగా పెరుగుదల ఇందుకు కారణం. కాగా, బంగారు నాణేలు, కడ్డీల్లో పెట్టుబడులు 34 శాతం పెరిగి 62 టన్నులుగా నమోదుకాగా.. విలువపరంగా 142 శాతం వృద్ధితో రూ.94,100 కోట్లకు చేరింది. గోల్డ్ ఈటీఎ్‌ఫల్లో పెట్టుబడులు వార్షిక ప్రాతిపదికన 197 శాతం వృద్ధితో 20 టన్నులకు చేరుకోగా.. పెట్టుబడుల విలువ ఏకంగా 437 శాతం వృద్ధితో రూ.30,000 కోట్లకు ఎగబాకింది.
31.2 టన్నుల గోల్డ్ రీసైక్లింగ్
ఈ మార్చితో ముగిసిన మూడు నెలల్లో భారత్‌లో మొత్తం 31.2 టన్నుల బంగారం రీసైక్లింగ్ జరిగిందని, 2025లో ఇదే కాలానికి జరిగిన 26 టన్నుల రీసైక్లింగ్‌తో పోలిస్తే 20 శాతం అధికమని డబ్ల్యూజీసీ తెలిపింది.
దిగుమతులు 186 టన్నులు
ఈ మార్చి క్వార్టర్‌లో భారత్‌లోకి మొత్తం 186 టన్నుల బంగారం దిగుమతైంది. 2025లో ఇదే కాలానికి నమోదైన 141.2 టన్నుల దిగుమతులతో పోలిస్తే 39 శాతం పెరిగాయి.
వార్షిక గిరాకీ అంచనా 650-750 టన్నులు గత ఏడాదిలో పసిడి గిరాకీ 712 టన్నులుగా నమోదు కాగా.. 2026లో 650-750 టన్నుల స్థాయిలో ఉండవచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది.
ప్రపంచవ్యాప్త డిమాండ్ 1,231 టన్నులు
ఈ జనవరి-మార్చి కాలానికి ప్రపంచవ్యాప్త బంగారం గిరాకీ వార్షిక ప్రాతిపదికన 2 శాతం పెరిగి 1,231 టన్నులకు చేరుకుంది. నాణేలు, కడ్డీలకు డిమాండ్ ఏకంగా 42 శాతం పెరిగి 474 టన్నులకు ఎగబాకడం ఇందుకు కారణమైందని డబ్ల్యూజీసీ వెల్లడించింది. ఈ క్యూ1లో వరల్డ్ గోల్డ్ డిమాండ్ విలువ 74 శాతం వృద్ధితో 19,300 కోట్ల డాలర్లకు చేరింది. సమీక్షా కాలానికి ఔన్స్ బంగారం సగటు ధర 81 శాతం పెరిగి 4,873 డాలర్లకు చేరుకుంది. 2025లో ఇదే కాలానికి గోల్డ్ రేటు 2,860 డాలర్ల స్థాయిలో నమోదైంది.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 8 మంది మృతి..