Bear Effect on Demat Accounts: డీమ్యాట్‌పై ‘బేర్’ ఎఫెక్ట్
ABN , Publish Date - Jan 12 , 2026 | 05:28 AM
స్టాక్ మార్కెట్లో ప్రతికూలతలు కొత్త డీమ్యాట్ ఖాతాల వృద్ధిపైనా ప్రభావం చూపాయి. 2024లో కొత్త డీమ్యాట్ అకౌంట్లు 33 శాతం పెరగగా..
సగానికి తగ్గిన కొత్త ఖాతాల వృద్ధి
గత ఏడాదిలో 17 శాతానికి పరిమితం
6 సంవత్సరాల కనిష్ఠ స్థాయి ఇది..
ముంబై: స్టాక్ మార్కెట్లో ప్రతికూలతలు కొత్త డీమ్యాట్ ఖాతాల వృద్ధిపైనా ప్రభావం చూపాయి. 2024లో కొత్త డీమ్యాట్ అకౌంట్లు 33 శాతం పెరగగా.. 2025లో ఈ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 17 శాతానికి పడిపోయింది. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎ్‌సఎల్), నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎ్‌సడీఎల్) వద్దనున్న డేటా ప్రకారం.. గత ఏడాదిలో కొత్త డీమ్యాట్ అకౌంట్లు 3.06 కోట్ల (16.5 శాతం) మేర పెరిగి మొత్తం 21.6 కోట్లకు చేరాయి. ఇది సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయే అయినప్పటికీ, 2024లో నమోదైన 4..60 కోట్ల కొత్త ఖాతాల (33% వృద్ధి)తో పోలిస్తే చాలా తక్కువ.
మార్కెట్‌కు సుంకాల పోటు
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ట్రంప్ సుంకాలు, వాణిజ్య అనిశ్చితుల, కార్పొరేట్ కంపెనీల ఆదాయ వృద్ధి మందగించడం కారణంగా గత ఏడాది మార్కెట్ సూచీలు అంతగా రాణించలేదు. 2025లో సెన్సెక్స్ 9.06 శాతం, నిఫ్టీ 10.5 రిటర్నులను మాత్రమే పంచగలిగాయి.
నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 కేవలం 5.7 శాతం వృద్ధి చెందగా.. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 5.62 శాతం క్షీణించింది. స్టాక్ మార్కెట్ నమోదిత టాప్- 1000 కంపెనీల్లో 60 శాతం గతేడాది తిరోగమనబాటలో పయనించాయి. ఈ నేపథ్యంలో కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించే వారి సంఖ్య కూడా తగ్గిందని బ్రోకరేజీ కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు.
ఐదేళ్లలో నాలుగింతలు
గడిచిన ఐదేళ్లలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య నాలుగింతలైంది. 2020లో 5 కోట్ల స్థాయిలో ఉన్న అకౌంట్లు 2025 చివరినాటికి 21 కోట్లు మించిపోయాయి. ప్రధానంగా కొవిడ్ సంక్షోభ సమయంలో భారీ సంఖ్యలో చిన్న మదుపరులు స్టాక్ మార్కె ట్లో పెట్టుబడులను ప్రారంభించడం ఇందుకు దోహదపడింది. సులభంగా ఆన్‌లైన్‌లోనే డీమ్యాట్ ఖాతా తెరిచే సౌలభ్యం, స్మార్ట్‌ఫోన్ వినియోగం అనూహ్యంగా పెరగడం కూడా ఇందుకు తోడ్పడ్డాయి. 2019లో 3.94 కోట్ల ఖాతాలు తెరవగా.. 2020లో ఇది 4.98 కోట్లుగా నమోదైంది. 2021 లోనైతే కొత్తగా తెరిచిన ఖాతాలు ఏకంగా 61.7 శాతం వృద్ధితో 8.06 కోట్లుగా నమోదయ్యాయి. 2022లో మళ్లీ ఈ వృద్ధి 34.3 శాతానికి తగ్గగా.. 2023లో 28.7 శాతానికి పరిమితమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయం: మంత్రి భరత్
విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్
For More AP News And Telugu News