Share News

10 లక్షల చదరపు అడుగులు.. రూ.1,500 కోట్ల అద్దె

ABN , Publish Date - Nov 20 , 2026 | 06:05 AM

హైదరాబాద్‌ ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ జోరు మీద ఉంది. తాజాగా ఈ విభాగంలో మరో భారీ డీల్‌ నమోదైంది. మాదాపూర్‌లోని...

10 లక్షల చదరపు అడుగులు.. రూ.1,500 కోట్ల అద్దె

హైదరాబాద్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా జీసీసీ.. మైండ్‌స్పేస్‌ సైబరాబాద్‌ టవర్స్‌లో ఏర్పాటు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ జోరు మీద ఉంది. తాజాగా ఈ విభాగంలో మరో భారీ డీల్‌ నమోదైంది. మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్‌ సైబరాబాద్‌ టవర్స్‌లో అమెరికా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (బీఓఏ) 10,10,467 చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) కార్యాలయ స్థలాన్ని 12 సంవత్సరాల కాలానికి లీజుకు తీసుకుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే తన గ్లోబల్‌ కేపబిలిటీ కేంద్రం (జీసీసీ) కోసం బీఓఏ క్యాప్టివ్‌ సర్వీసెస్‌ విభాగం బీఏ కంటిన్యుయెమ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ ఆఫీస్‌ స్పేస్‌ను లీజుకు తీసుకుంది. ఇందుకోసం ఈ టవర్స్‌ యాజమాన్య సంస్థ కే రహేజా ఐటీ పార్కుతో ఒప్పందం కుదుర్చుకుంది.

12 ఏళ్లలో రూ.1,500 కోట్లు

ప్రతి చదరపు అడుగుకి నెలకు రూ.82 చొప్పున ఈ డీల్‌ జరిగినట్టు సమాచారం. ప్రతి మూడేళ్లకు 15 శాతం చొప్పున అద్దె పెంచే షరతుపై ఈ భవన సముదాయంలోని 12 ఫ్లోర్లను బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా లీజుకు తీసుకుంది. ఇందుకోసం ఇప్పటికే రూ.49.72 కోట్లను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించింది. ప్రతి నెలా రూ.8.28 కోట్ల రెంట్‌ తో మొత్తం 12 సంవత్సరాల్లో దాదాపు రూ.1,500 కోట్ల మొత్తాన్ని అద్దె రూపంలో చెల్లించనుంది.


ఈ ఏడాది ఇదే భారీ డీల్‌..

ఈ సంవత్సరం ఇప్పటి వరకు భారత ప్రధాన నగరాల్లో నమోదైన అతిపెద్ద ఆఫీస్‌ స్పేస్‌ లీజు ఒప్పందం ఇదేనని భావిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 7న ఈ లీజు ఒప్పందం కుదిరింది. లీజు చెల్లింపులు మాత్రం 2027 జనవరి నుంచి ప్రారంభమవుతాయి. కాగా హైదరాబాద్‌ కార్యాలయ స్థలాల లీజింగ్‌లో ఇది రెండో అతిపెద్ద ఒప్పందం. ఇంతకు ముందు ఐటీ సంస్థ యాక్సెంచర్‌ కూడా హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ ప్రాంతంలో జీసీసీ కోసం 10.17 లక్షల ఎస్‌ఎఫ్‌టీల ఆఫీస్‌ స్పేస్‌ను లీజుకు తీసుకుంది. మరోవైపు హెచ్ఎస్‌బీసీ.. బెంగళూరులో 12 లక్షల ఎస్‌ఎఫ్‌టీ కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ డీల్స్‌ తర్వాత తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా తన జీసీసీ కోసం తీసుకున్న ఆఫీస్‌ స్పేస్‌ లీజు ఒప్పందమే పెద్దది. దీంతో మరిన్ని బహుళ జాతి దిగ్గజ సంస్థలు తమ జీసీసీల కోసం హైదరాబాద్‌ బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి ప్రాంతంలో కార్యాలయ స్థలాల లీజులు ఇప్పటికే చుక్కలంటుతున్నాయి. దీంతో కొన్ని సంస్థలు ప్యూచర్‌ సిటీ వైపూ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకోసం ప్రత్యేక రాయితీలు కల్పించే యోచనలో ఉన్నట్టు సమాచారం.

ఈ వార్తలు కూడా చదవండి

సర్కారు బ్యాంకులకు లాభాల పంట

వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు ఢమాల్..

Updated Date - Nov 20 , 2026 | 06:06 AM