అరబిందో ఫార్మా లాభం రూ.921 కోట్లు
ABN , Publish Date - May 22 , 2026 | 05:49 AM
అరబిందో ఫార్మా.. గడిచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చి తో ముగిసిన త్రైమాసికానికి గాను రూ.921 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అరబిందో ఫార్మా.. గడిచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చి తో ముగిసిన త్రైమాసికానికి గాను రూ.921 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం స్వల్పంగా 2 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా 5.6 శాతం వృద్ధితో రూ.8,382 కోట్ల నుంచి రూ.8,853 కోట్లకు చేరుకుంది. మార్చి త్రైమాసికంలో అమెరికా ఆదాయం 13 శాతం క్షీణించి రూ.3,543 కోట్లుగా నమోదు కాగా యూరప్ మార్కెట్ల నుంచి ఆదాయం ఏకంగా 30.2 శాతం వృద్ధితో రూ.2,147 కోట్ల నుంచి రూ.2,795 కోట్లకు పెరిగిందని అరబిందో ఫార్మా వెల్లడించింది. ఇదే సమయంలో వర్ధమాన మార్కెట్ల ఆదాయం కూడా రూ.786 కోట్ల నుంచి రూ.980 కోట్లకు పెరిగిందని తెలిపింది. సమీక్షా త్రైమాసికంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కోసం రూ.400 కోట్లు వెచ్చించినట్లు కంపెనీ పేర్కొంది. అలాగే అమెరికా ఔషధ నియంత్రణ మండలి (యూఎస్ ఎఫ్‌డీఏ) నుంచి 9 అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్స్ (అండా)కు తుది ఆమోదం లభించిందని వెల్లడించింది. కాగా మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.33,653 కోట్ల ఆదాయంపై రూ.3,503 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
ఇవి కూడా చదవండి...
దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ
కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్ సభ్యులు.. ఏసీ ఆగ్రహం
Read Latest AP News And Telugu News