Share News

అరెస్టు చేయకుండా ఆపలేం!

ABN , Publish Date - Oct 31 , 2026 | 03:06 AM

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారీ కాన్వాయ్‌, అనుచరులతో నామినేషన్‌ కేంద్రం వద్దకు వచ్చి అరాచకం సృష్టించిన ఘటనకు సంబంధించి నమోదైన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.

అరెస్టు చేయకుండా ఆపలేం!

  • మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

  • ‘పుంగనూరు’ కేసుల్లో అరెస్టు నుంచి

  • రక్షణ కల్పించేందుకు నిరాకరణ

  • క్వాష్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

  • ఎంపీపై హత్యాయత్నం కేసు ఉంది

  • అరెస్టు నుంచి రక్షణ కల్పించొద్దు: పీపీ

అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారీ కాన్వాయ్‌, అనుచరులతో నామినేషన్‌ కేంద్రం వద్దకు వచ్చి అరాచకం సృష్టించిన ఘటనకు సంబంధించి నమోదైన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కేసులను కొట్టివేయాలని కోరుతూ వేసిన క్వాష్‌ పిటిషన్లపై మాత్రం విచారణను డిసెంబరు 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై. లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడడం, ప్రైవేటు బౌన్సర్‌తో వాహనాన్ని టీడీపీ కార్యకర్తలపైకి నడపడం, తదితర ఘటనలకు సంబంధించి ఎంపీ మిథున్‌రెడ్డిపై ఈ నెల 16న పుంగనూరు అర్బన్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు.


మదనపల్లి డీఎస్పీతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తన పైనమోదు చేసిన నాలుగు కేసులను కొట్టివేయాలని కోరుతూ మిథున్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మిథున్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది ఓ. మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ఒకే ఘటనపై నాలుగు కేసులు నమోదు చేయడం చెల్లుబాటు కాదు. రాజకీయ దురుద్దేశంతో పిటిషనర్‌పై కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, తదితర సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్‌కు వర్తించవు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి.’’ అని కోరారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. ‘‘పుంగనూరు తన అడ్డా అన్నట్లు పిటిషనర్‌ వ్యవహరించారు. కర్రలు, రాడ్లతో దాడులకు పాల్పడ్డారు.

వేర్వేరు సమయాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో పలువురు వ్యక్తులు గాయపడ్డారు. ఘటనలకు సంబంధించి పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారు. నామినేషన్‌ కేంద్రం వద్ద గొడవలు సృష్టించాలనే దురుద్దేశంతోనే భారీ కాన్వాయ్‌, అనుచరులతో ఎంపీ పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. బౌన్సర్‌ను రెచ్చగొట్టి కారును అక్కడే ఉన్న మరో పార్టీ కార్యకర్తలపై నడిపించారు. ఆయా ఘటనల్లో 30మందికి పైగా గాయపడ్డారు. పిటిషనర్‌పై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. అరెస్టు నుంచి రక్షణ కావాలంటే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవాలి.


క్వాష్‌ పిటిషన్‌లో అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించడానికి వీల్లేదు.’’ అని వివరించారు. ఫిర్యాదుదారులు మధుసూదన్‌ రాయల్‌, జంపల మోహన్‌ నాయుడు తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు. నామినేషన్‌ కేంద్రం వద్దకు వెళ్లడం వెనుక ఎంపీకి దురుద్దేశం ఉందన్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లడానికి పిటిషనర్‌ అభ్యర్ధి కాదు లేదా అభ్యర్ధిని బలపరిచే వ్యక్తి కూడా కాదని తెలిపారు. పిటిషనర్‌పై హత్యాయత్నం, తదితర సెక్షన్ల కింద కేసు నమోదైందన్నారు. పిటిషనర్‌ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, క్వాష్‌ పిటిషన్‌లో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరడానికి వీల్లేదని కోర్టుకు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 03:13 AM