Share News

జనసేనలోకి వైసీపీ నేతల క్యూ..!

ABN , Publish Date - Sep 27 , 2026 | 04:46 AM

వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. గత రెండు, మూడు రోజుల్లోనే పలువురు జగన్‌ పార్టీ కీలక నేతలు జనసేనలో చేరిపోయారు. తుని నియోజకవర్గం నుంచి యనమల కృష్ణుడు, హిందూపురం నుంచి నవీన్‌ నిశ్చల్‌తో పాటు పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన వరుపుల సుబ్బారావు..

జనసేనలోకి వైసీపీ నేతల క్యూ..!

  • చేరికలకు పవన్‌ కల్యాణ్‌ గ్రీన్‌సిగ్నల్‌

  • నేతల చరిత్ర పరిశీలించాక అనుమతి

అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. గత రెండు, మూడు రోజుల్లోనే పలువురు జగన్‌ పార్టీ కీలక నేతలు జనసేనలో చేరిపోయారు. తుని నియోజకవర్గం నుంచి యనమల కృష్ణుడు, హిందూపురం నుంచి నవీన్‌ నిశ్చల్‌తో పాటు పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన వరుపుల సుబ్బారావు.. పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితోపాటు జిల్లా, మండల స్థాయి నేతలు కూడా జనసేన కండువా కప్పుకొన్నారు. వైసీపీ నుంచి జనసేనలోకి మరింతమంది నేతలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కూటమిలో కీలకంగా ఉన్న జనసేన ఇటీవల వరకు చేరికల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడటంతో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ బలం పెంచుకునే ఆలోచనలో అధినాయకత్వం ఉంది. ఈ నేపథ్యంలో చేరికలకు గేట్లు తెరిచింది. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చేవారికి తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ప్రజల్లో రోజురోజుకు వైసీపీ పట్ల వ్యతిరేకత పెరగడం, ఆ పార్టీలో పరిస్థితులు దిగజారిపోవడం, పార్టీ కేడర్‌ను అధినాయకత్వం పట్టించుకోకపోవడంతో చాలా మంది నేతలు పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు. ఈ అవకాశాన్ని జనసేన పార్టీ సద్వినియోగం చేసుకుంటోంది. అధినాయకత్వం చేరికలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో జనసేన కార్యాలయానికి భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న నాయకుల చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించి, వారితో మాట్లాడిన తర్వాతనే అధినేత పవన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నారు.


ఉత్తరాంధ్ర నుంచి భారీగా..

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వైసీపీ నాయకులు జనసేనలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నేతల కన్ను జనసేన వైపు ఉంది. వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన ఓ కీలక నేతతో పాటు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జనసేన నాయకులతో టచ్‌లోకి వెళ్లారని తెలిసింది. పవన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే ఈ వారంలోనే వారు జనసేనలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. వారితో పాటు స్థానిక నేతలు కూడా భారీగా పార్టీ మారతారని చెబుతున్నారు. మరోవైపు రాయలసీమలో బలమైన నాయకత్వం కోసం జనసేన చూస్తోంది. తిరుపతి మినహా మిగిలిన జిల్లాల్లో నాయకత్వ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని భర్తీ చేసేందుకు జనసేన పార్టీ చేరిక కమిటీ ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. రాయలసీమ నుంచి కొత్త వారిని.. అందులోనూ యువతను ప్రోత్సహించే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉంది. అధినేత ఆలోచన విధానానికి అనుగుణంగా చేరిక కమిటీ సభ్యులు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 04:46 AM