కుప్పంలో వైసీపీ బిల్డప్
ABN , Publish Date - Nov 28 , 2026 | 02:02 AM
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అసత్య ప్రచారానికి దిగింది. గెలిచింది అత్తెసరు పంచాయతీలే అయినా..
పంచాయతీ ఎన్నికలపై సోషల్ మీడియాలో ‘లెక్కకు’మించి హోరు
92 పంచాయతీల్లో తొలి విడత పోలింగ్
73 స్థానాలను సొంతం చేసుకున్న టీడీపీ
కేవలం 19 స్థానాలకే వైసీపీ పరిమితం
అయినా.. తమదే పైచేయంటూ ప్రచారం
తిరుపతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అసత్య ప్రచారానికి దిగింది. గెలిచింది అత్తెసరు పంచాయతీలే అయినా.. తమదే ఆధిపత్యం అన్నట్టు హడావుడి చేస్తోంది. గెలిచిన పంచాయతీల సంఖ్యను ఎక్కువ చేసి చూపిస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తోంది. కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి గమనిస్తే.. ప్రచారంలోని డొల్లతనం బయటపడుతుంది. కుప్పం నియోజకవర్గంలో మొత్తం పంచాయతీల సంఖ్య 93. వీటిలో కోర్టు కేసు కారణంగా ఒక దానికి ఎన్నికలు జరగలేదు. మిగతా 92 పంచాయతీలకు మొదటి విడత ఎన్నికల్లో టీడీపీ 73 పంచాయతీలను గెలుచుకుంది.
వైసీపీ కేవలం 19 పంచాయతీలకే పరిమితమైంది. కుప్పం మండలంలో టీడీపీ 25 పంచాయతీలు గెలిస్తే వైసీపీ 4 చోట్ల గెలిచింది. రామకుప్పం మండలంలో టీడీపీ 19 పంచాయతీలు సాధిస్తే వైసీపీకి దక్కింది 3. గుడుపల్లె మండలంలో టీడీపీ 14 చోట్ల నెగ్గితే వైసీపీ కేవలం 4 చోట్ల గెలిచింది. శాంతిపురం మండలంలో టీడీపీ 15 పంచాయతీలు సాధిస్తే వైసీపీ 8 పంచాయతీల్లో నెగ్గింది. మొత్తం పంచాయతీల్లో 80 శాతం టీడీపీ కైవసం చేసుకోగా వైసీపీ 20 శాతం వద్దే ఆగిపోయింది.
అయినా కూడా ఆ పార్టీ సోషల్ మీడియాలో తాము కుప్పం నియోజకవర్గంలో భారీ సంఖ్యలో పంచాయతీలు గెలిచినట్టు పోస్టులు పెడుతూ హడావుడి సృష్టిస్తోంది. రామకుప్పం మండలం కెంచనబల్ల పంచాయతీలో గ్రామపెద్ద ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. దాన్ని కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. నిజానికి టీడీపీలో నేతలు వర్గాలుగా విడిపోయి కుమ్ములాడుకోవడం వైసీపీకి కలిచి వచ్చింది. దీంతోనే ఈ పంచాయతీలైనా దక్కాయి. ఉదాహరణకు శాంతిపురం మండలం టీడీపీలో నాలుగు వర్గాలున్నాయి.
ఆ వర్గాల నడుమ పరస్పరం సమన్వయం, సహకారం లేకపోవడం వల్లే వైసీపీకి కలిసొచ్చిందని సమాచారం. ఎవరి పాటికి వారు అంటీముట్టనట్టు ఉండిపోవడంతో కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అధినేత పట్ల అభిమానం ఉన్నా స్థానికంగా నేతల తీరుతో వారు ఎన్నికల్లో చురుగ్గా వ్యవహరించలేదని సమాచారం. కేవలం ఆ కారణంతోనే వైసీపీ నియోజకవర్గం మొత్తం మీద 19 పంచాయతీలను గెలుచుకోగలిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా విస్మరించి నెగ్గిన పంచాయతీల కంటే ఎక్కువ పంచాయతీలు గెలిచినట్టు వైసీపీ ప్రచారం చేసుకోవడం గమనార్హం.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..