Share News

ఆ 4 పట్టణాల్లో వైసీపీ నామినేషన్లు

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:08 AM

మున్సిపల్‌ ఎన్నికల్లో కడప, తిరుపతి కార్పొరేషన్లు, రాజంపేట మున్సిపాలిటీలోని కొన్ని వార్డులకు, మైదుకూరు మున్సిపాలిటీలోని మొత్తం 32 వార్డులకు శుక్రవారం వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

ఆ 4 పట్టణాల్లో వైసీపీ నామినేషన్లు

  • పోలీసు బందోబస్తుతో వచ్చి దాఖలు చేసిన అభ్యర్థులు.. కడపలో 11 డివిజన్లకు ఆ పార్టీ తరఫున 15 నామినేషన్లు

  • రాజంపేటలో 11 వార్డులకు 12

  • మైదుకూరులో 32 వార్డులకు

  • 48 నామినేషన్లు వేసిన వైసీపీ

  • తిరుపతిలోని 18 డివిజన్లలో ఆ పార్టీ తరఫున 47 దాఖలు

  • నేడు కూడా నామినేషన్లు వేసుకునే అవకాశం

కడప/రాజంపేట/మైదుకూరు/తిరుపతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో కడప, తిరుపతి కార్పొరేషన్లు, రాజంపేట మున్సిపాలిటీలోని కొన్ని వార్డులకు, మైదుకూరు మున్సిపాలిటీలోని మొత్తం 32 వార్డులకు శుక్రవారం వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా చోట్ల పోలీసు భద్రతతో వచ్చిన వీరు.. ప్రశాంత వాతావరణంలో రిటర్నింగ్‌ అధికారులకు తమ పత్రాలను అందజేశారు. కడప కార్పొరేషన్‌లో 11 డివిజన్లకు, రాజంపేటలో 11 వార్డులకు, మైదుకూరులో మొత్తం 32 వార్డులకూ నామినేషన్లు శుక్ర, శనివారాల్లో స్వీకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కడప కలెక్టరేట్‌లో మూడు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కడప కార్పొరేషన్‌ పరిధిలోని 11 డివిజన్లకు నామినేషన్లు వేసే వైసీపీ అభ్యర్థులను పోలీసులు ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చారు.

నామినేషన్లు వేశాక తిరిగి వారిని వాహనంలో వైసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. 11 డివిజన్లకు గాను వైసీపీ నుంచి 15, బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్‌ల నుంచి ఒక్కొక్కటి, స్వతంత్రుల తరఫున మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. రాజంపేటలోని 11 వార్డుల్లో నామినేషన్లను దాఖలు చేసేందుకు పోలీసులు వైసీపీ కార్యాలయం నుంచి ఆ పార్టీ అభ్యర్థులను ఎస్కార్ట్‌ వాహనాలతో మున్సిపల్‌ కార్యాలయానికి తీసుకొచ్చి దగ్గరుండి వారిచేత నామినేషన్లు వేయించారు. 12 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మరొక అభ్యర్థి కడప కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్‌ వేశారు. శుక్రవారం మొత్తం 16 నామినేషన్లు రాగా.. టీడీపీ నుంచి ముగ్గురు రెబల్స్‌ బరిలోకి దిగారు.


మైదుకూరులోని 32 వార్డులకూ వైసీపీ అభ్యర్థులు పోలీసు ఎస్కార్ట్‌తో వచ్చి నామినేషన్లు వేశారు. మొత్తం 53 నామినేషన్లు దాఖలు కాగా.. వీటిలో వైసీపీ 48, టీడీపీ 3, సీపీఐ, బీజేపీ నుంచి ఒక్కొక్కటి దాఖలయ్యాయి. తిరుపతి కార్పొరేషన్‌లోని 18 డివిజన్లలో శుక్రవారం 59 నామినేషన్లు రాగా.. వీటిలో వైసీపీ 47.. టీడీపీ 4.. జనసేన 1.. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 1.. స్వతంత్రులు ఆరుగురు దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థులంతా ఒకే బృందంగా తిరుపతి కలెక్టరేట్‌కు వచ్చి నామినేషన్లు వేశారు. శనివారం కూడా నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశముంది. వీటిని ఆదివారం ఉదయం పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3 గంటల్లోపు ఉపసంహరణకు అవకాశమిచ్చారు. ఆ తర్వాత వీటితో కలిపి మొత్తం 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఒకటో తేదీన పోలింగ్‌ జరుగుతుంది. ఎక్కడైనా అవసరమైతే రెండో తేదీన రీపోలింగ్‌ జరుపుతారు. మూడో తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 24 , 2026 | 06:09 AM