Share News

అవే అరాచకాలు.. అవే అబద్ధాలు

ABN , Publish Date - Aug 04 , 2026 | 08:01 AM

నాడు బాబాయిని గొడ్డలిపోటుతో చంపేస్తే ‘గుండెపోటు’ అన్నారు. నిందితులు సొంతవాళ్లే అయినా చంద్రబాబుపై నిందలు వేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి కథలే! రోడ్డుపై వెళ్తున్న గొర్రెల కాపరిని బైకుతో ఢీకొట్టి చంపేసి, సాక్ష్యాలు తారుమారు చేశారు.

అవే అరాచకాలు.. అవే అబద్ధాలు
Andhra Pradesh Politics

  • 2019లో గొడ్డలిపోటుకు వివేకా దారుణహత్య

  • ‘నారాసుర రక్తచర్రిత’ అంటూ చంద్రబాబుపై నెపం

  • 2024లో చిత్తుగా ఓడాక మళ్లీ కుట్రలు

  • వరుస వివాదాలు, కేసుల్లో వైసీపీ నేతలు

  • తప్పుచేసినా.. వారికే పార్టీ అధినేత వత్తాసు

  • అప్పలరాజు నుంచి విరూపాక్షి వరకు అదేకథ

  • పైగా కూటమి సర్కారుపై బురదజల్లుడు

  • ‘నారాసుర పాలనలో అరాచకం’ అని కథనాలు

  • నాడు, నేడు తీరు మార్చుకోని జగన్‌

నాడు బాబాయిని గొడ్డలిపోటుతో చంపేస్తే ‘గుండెపోటు’ అన్నారు. నిందితులు సొంతవాళ్లే అయినా చంద్రబాబుపై నిందలు వేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి కథలే! రోడ్డుపై వెళ్తున్న గొర్రెల కాపరిని బైకుతో ఢీకొట్టి చంపేసి, సాక్ష్యాలు తారుమారు చేశారు. విధుల్లో ఉన్న మహిళా ఎస్‌ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. టీడీపీ నాయకుల, కార్యకర్తల ఇళ్లపై దండయాత్ర చేసి దాడులు చేశారు. ఇంకా ఎన్నో దాడులు, దౌర్జన్యాలు. అయినా కేసులు మాత్రం పెట్టకూడదట. అరాచకాలు చేసేదీవాళ్లే. అడ్డగోలుగా అబద్ధాలు చెప్పేదీవాళ్లే. నిందితులకు జగన్‌, ఆయన రోతపత్రిక వత్తాసు. అన్నింటికీ చంద్రబాబుపైనే నిందలు. 2019 ఎన్నికలకు ముందూ, 2024లో ఓడిపోయాకా ఇదే వరస.


ఆంధ్రజ్యోతి న్కూస్‌నెట్‌వర్క్‌: అది 2019 ఎన్నికల సమయం.. జగన్‌ సొంత చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఇంట్లోనే దారుణహత్యకు గురయ్యారు. కళ్లెదుట రక్తంమడుగులో ఘోరం కనిపిస్తున్నా తొలుత గుండెపోటుగా కట్టుకథ అల్లారు. తర్వాత హత్యంటూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిందలు వేశారు. ఎన్నికల్లో లబ్ధిపొందాలని కుట్ర చేశారు. జగన్‌ రోత పత్రికలో ‘నారాసుర రక్తచర్రిత’ అంటూ అబద్ధాలు అచ్చేశారు.


2024లో ఓడాక.. ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ నేతలు అడ్డూ అదుపూ లేకుండా అరాచకాలకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలనే కాదు సామాన్యులను కూడా వదలడం లేదు. తప్పుచేసిన వారిని మందలించడం మాని జగన్‌, ఆయన పత్రిక వంత పాడుతున్నారు. ‘నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం!’ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలోనూ ఇదే కథ. ‘ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, వైసీపీ వెనక్కి తగ్గదు. అండగా నిలుస్తాం. అన్యాయాన్ని నిలదీస్తాం. అరాచక పాలనపై పోరాడుతాం’ అంటూ జగన్‌ ఎదురుదాడి చేస్తున్నారు. అధినేత ప్రోత్సాహంతో ఆ పార్టీ నేతలు మరింత రెచ్చిపోతున్నారు. జగన్‌ చేసిన ఆరోపణలు, అందులోని వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం.


జగన్‌ ఆరోపణ..

కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమకల్లులో వైసీపీ నాయకుడి ఇంటిపై టీడీపీవాళ్లు దాడిచేేస్త.. తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షికి కాల్‌ చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా? పరామర్శించేందుకు వెళ్లిన విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఈ ప్రభుత్వంలో దాడి చేసినవారికి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారు.


ఇదీ వాస్తవం..

ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం నేమకల్లు-సంగాలకు చెందిన వైసీపీ కార్యకర్త సంగాల గిరి ఇసుకను అక్రమంగా డంప్‌ చేశాడు. చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు ఆ ఇసుకను సీజ్‌ చేశారు. టీడీపీ వాళ్లే సీజ్‌ చేయించారని గిరి అనుమానించాడు. ఈ విషయంలో గిరికి, టీడీపీ నాయకుడు నక్కలదొడ్డి గురునాథ్‌, నక్కలదొడ్డి శేఖర్‌, దళిత సామాజికవర్గానికి చెందిన టీడీపీ నాయకులు నాగరాజు, శివలకు మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికులు సర్ధిచెప్పడంతో ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. అంతటితో వివాదం ముగిసింది. అయితే టీడీపీ శ్రేణులు తన ఇంటికిపైకి దాడికి వచ్చారని వైసీపీ కార్యకర్త గిరి ఎమ్మెల్యే బి.విరూపాక్షికి ఫోన్‌ చేసి చెప్పాడు.


ఎమ్మెల్యే పత్తికొండ డీఎస్పీకి ఫోన్‌ చేయగా, పోలీసులను పంపి విచారిస్తానని డీఎస్పీ హామీ ఇచ్చారు. అయినప్పటికీ వినకుండా ఎమ్మెల్యే విరూపాక్షి తన కుమారుడు చంద్రశేఖర్‌, సోదరుడు శ్రీరాములు, అనుచరులతో ఐదు వాహనాల్లో వెళ్లారు. సంగాల గ్రామంలోని వైసీపీ కార్యకర్త గిరి ఇంటికి వెళ్లి పరామర్శించి, అక్కడి నుంచి టీడీపీ నాయకుడు నక్కలదొడ్డి శేఖర్‌ ఇంటికి అనుచరులతో వెళ్లారు. ఆ సమయంలో శేఖర్‌ ఇంట్లో లేడు. జాగ్రత్త ఉండమని శేఖర్‌ భార్యను హెచ్చరించి వెళ్లారు. అక్కడి నుంచి నేమకల్లు గ్రామంలో టీడీపీ నాయకుడు నాగరాజు, శివ ఇళ్లకు వెళ్లగా, అక్కడే వారితో పాటు నక్కలదొడ్డి శేఖర్‌, గురునాథ్‌లు ఉన్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు రాగానే వెంటతెచ్చుకున్న కర్రలు, రాళ్లతో దాడులకు దిగారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.


అడ్డుకోబోయిన నాగరాజు భార్య సుచిత్రపై కూడా దాడికి పాల్పడి అనుచితంగా ప్రవరించారని అంటున్నారు. ఇంతలో ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి సిబ్బందితో వెళ్లి ఇరువర్గాలను అదుపు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన వర్గీయులు అదే సమయంలో అక్కడికి వచ్చిన టీడీపీ మండల కన్వీనర్‌ కొండా పురుషోత్తంపై కూడా కర్రలతో దాడులకు దిగి ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో టీడీపీ నాయకులు నక్కలదొడ్డి శేఖర్‌, శివలు తీవ్రంగా గాయపడ్డారు. శేఖర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో బళ్లారిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే ఘటనలో ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు బి.శ్రీరాములు చేతికి గాయమైంది.


జగన్‌ ఆరోపణ..

గుంటూరు ఈస్ట్‌ మాజీ ఎమ్మెల్యే షేక్‌ మొహ్మద్‌ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా ఇదే రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోంది. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించినప్పటికీ... తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్‌ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్‌ చేశారని కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? కేవలం వైసీపీ నాయకుడని కేసు పెడతారా?


ఇదీ వాస్తవం..

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామానికి చెందిన పొగాకు వ్యాపారి కడిమి సూర్యచంద్రం కుమారుడిని, అతడితో పాటు మరికొందరిని కిడ్నాప్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేయడమే గాక పొగాకు బేళ్లను స్వాధీనం చేసుకున్నందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కొడుకు బషీర్‌తో పాటు మరికొందరిపై నూజివీడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేయగా ముస్తఫా, ఆయన కొడుకు పరారీలో ఉన్నారు. కిడ్నాప్‌ ఘటనలో బషీర్‌ స్వయంగా పాల్గొన్నారు.


జగన్‌ ఆరోపణ..

రాష్ట్రంలోని జెన్‌ జెడ్‌ తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోంది. డీఎస్సీ-2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ఎందుకు రాజీనామా చేయడం లేదు?


ఇదీ వాస్తవం..

డీఎస్సీపై జగన్‌ పలుమార్లు చేసిన ఆరోపణలకు ప్రభుత్వం ప్రతిదానికీ సవివరంగా సమాధానం చెప్పింది. రిజర్వేషన్ల విధానం గురించి అధికారులు స్పష్టంగా వివరించారు. కొందరు అభ్యర్థులు వ్యక్తం చేసిన సందేహాలన్నింటినీ నివృత్తి చేశారు. ఎక్కడా అక్రమాలు జరగలేదని ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. డీఎస్సీలో అక్రమాలు జరిగినట్టుగా తప్పుడు ఆరోపణలు చేయడమే కానీ ఒక్కదానికీ జగన్‌ ఆధారాలు చూపించలేకపోయారు. అయినా విమర్శలు మానడం లేదు.


జగన్‌ ఆరోపణ..

శ్రీకాకుళం జిల్లాలోనూ ప్రభుత్వం అరాచకం చేస్తోంది. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్లినప్పుడు సంఘీభావంగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేకమంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక మీ పోలీసు రాజ్యమా?


ఇదీ వాస్తవం..

సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్‌ వర్మ బుల్లెట్‌పై వేగంగా వెళ్తూ గొర్రెల కాపరిని ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. వెంటనే రంగంలోకి దిగిన సీదిరి తన కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు పోలీసులను తప్పుదోవ పట్టించారు. మరో వ్యక్తి(సీదిరి అనుచరుడు) వాహనం నడుపుతున్నట్టుగా చిత్రీకరించి అతడు పోలీసుల ఎదుట లొంగిపోయేలా చేశారు. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు సీదిరి ప్రయత్నించారు. అసలు విషయం వెలుగు చూడటంతో సీదిరి, ఆయన కొడుకు, అనుచరుడిపై కేసు నమోదు చేశారు. అయినా అప్పలరాజును వెనకేసుకువస్తూ పరామర్శ పేరిట జగన్‌ శ్రీకాకుళంలో బలప్రదర్శన చేశారు. ఆ సమయంలో బందోబస్తు నిర్వహిస్తున్న మహిళా ఎస్‌ఐ ప్రవల్లికను ఆమదాలవలస వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌, అనుచరులు చుట్టుముట్టారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనలో చింతాడ రవికుమార్‌, ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదైంది.


ఇవి కూడా చదవండి

‘ఆధార్‌’లో అసలేం జరిగింది? మోసాలకు మూలాలు ఎక్కడ?..

సర్కారీ కాలేజీలకు ప్రవేశాల కళ.. ఇంటర్‌ మొదటి ఏడాదిలో 85 వేల అడ్మిషన్లు

Updated Date - Aug 04 , 2026 | 08:02 AM