సర్కారీ కాలేజీలకు ప్రవేశాల కళ.. ఇంటర్ మొదటి ఏడాదిలో 85 వేల అడ్మిషన్లు
ABN , Publish Date - Aug 04 , 2026 | 07:51 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా సర్కారీ కాలేజీల్లో ప్రవేశాలు పెరిగాయి. 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్‌లో 85,453 మంది విద్యార్థులు చేరారు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా సర్కారీ కాలేజీల్లో ప్రవేశాలు పెరిగాయి. 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్‌లో 85,453 మంది విద్యార్థులు చేరారు. గత విద్యా సంవత్సరంలో 75 వేల మందే సర్కారీ కాలేజీల్లో చేరారు. ఈ ఏడాది ప్రవేశాలు దాదాపు 14 శాతం పెరిగాయి. ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 1,64,730 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలు, ఆధునిక బోధనా విధానాలు, పరిశ్రమలతో అనుసంధానం వంటి చర్యల కారణంగా వీటిపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో నమ్మకం పెరుగుతోందని ఇంటర్ విద్య కార్యదర్శి అభిలాష తెలిపారు. సమగ్ర శిక్ష నిధులను సమర్థంగా వినియోగించడంపై సోమవారం బోర్డు కార్యాలయంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిలాష పాల్గొని మాట్లాడారు.
ఇంటర్ అర్హతతోనే ఉద్యోగాలు..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులను విద్యకే పరిమితం చేయకుండా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టిందని అభిలాష తెలిపారు. ఇందులో భాగంగా ఐబీఎం, హెటిరో ఫార్మాస్యూటికల్స్ తదితర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. ఐబీఎం వంటి సంస్థల సహకారంతో డిజిటల్ నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ, సర్టిఫికేషన్లు అందించే కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. హెటిరోతో కుదిరిన ఒప్పందం ద్వారా లైఫ్ సైన్సెస్, వొకేషనల్ విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు, స్కిల్ డెవల్‌పమెంట్, ఇంటర్న్‌షిప్‌లు, ల్యాబ్ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఇంటర్ అర్హతతోనే 300మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు హెటిరో ముందుకొచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు 2వేల మందికిపైగా విద్యార్థులకు ఉద్యోగాలు, అప్రెంటిస్‌షిప్‌లు లభించాయన్నారు.
ఇవి కూడా చదవండి
‘ఆధార్’లో అసలేం జరిగింది? మోసాలకు మూలాలు ఎక్కడ?..