‘ఆధార్’లో అసలేం జరిగింది?
ABN , Publish Date - Aug 04 , 2026 | 07:49 AM
ప్రతిదానికీ ప్రామాణికమైన ఆధార్‌నే గోల్‌మాల్ చేసి, ఆస్తులు కొట్టేస్తున్న వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆధార్ కార్డులో పేర్లను మార్చి పెద్దఎత్తున భూ అక్రమాలకు పాల్పడుతున్న నయా మోసగాళ్లపై దృష్టి సారించింది. ‘ఆధార్‌తో...అధికారికంగా... ఆస్తులు హాంఫట్!’ పేరుతో ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం సంచికలో ప్రచురితమైన కథనం అధికార యంత్రాంగంలో పెను సంచలనం సృష్టించింది.
‘ఆధార్’లో అసలేం జరిగింది?
మోసాలకు మూలాలు ఎక్కడ?..
నిగ్గు తేల్చేందుకు సిద్ధమైన ఏపీ సర్కారు
సాంకేతిక కోణంలో పోలీసుల దర్యాప్తు
తిరుపతి ఆధార్ కేంద్రంలో తనిఖీలు
త్వరలో హైదరాబాద్ యూఐడీఏఐ కేంద్రానికీ పోలీసు బృందాలు
సంచలనం సృష్టించిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం
తిరుపతి (ఆంధ్రజ్యోతి) : ప్రతిదానికీ ప్రామాణికమైన ఆధార్‌నే గోల్‌మాల్ చేసి, ఆస్తులు కొట్టేస్తున్న వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆధార్ కార్డులో పేర్లను మార్చి పెద్దఎత్తున భూ అక్రమాలకు పాల్పడుతున్న నయా మోసగాళ్లపై దృష్టి సారించింది. ‘ఆధార్‌తో...అధికారికంగా... ఆస్తులు హాంఫట్!’ పేరుతో ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం సంచికలో ప్రచురితమైన కథనం అధికార యంత్రాంగంలో పెను సంచలనం సృష్టించింది. మోసగాడు తన ఽఆధార్ కార్డులో ఇంటి పేరు, పేరు తదితర వివరాలన్నీ ఆస్తి యజమానివి, నంబరు మాత్రమే తనది ఉండేలా పక్కాగా మార్పులు చేస్తున్నాడు.
బయోమెట్రిక్స్ సరిపోలడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తి బదలాయింపు ఏ అనుమానం లేకుండా జరిగిపోతోంది. తర్వాత ఎప్పుడో ఆ ఆస్తిని గురించి ఆరాతీసిన యజమాని అప్పటికే అది చేతులు మారిన విషయం తెలుసుకుని తెల్లబోతున్నారు. తిరుపతి సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ తరహా మోసాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి కథనంలో ప్రస్తావించిన అంశాలపై సమగ్ర నివేదికను పంపాలంటూ తిరుపతి కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌ను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదేశించారు.
అక్రమార్కులు ఆధార్ గుర్తింపు కార్డులోని వివరాలు ఏ విధంగా మార్పు చేస్తున్నారనే విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతిలోని హెడ్ పోస్టాఫీసులోని ప్రధాన ఆధార్ నమోదు కేంద్రంలో వివరాలు ఇప్పటికే పరిశీలించారు. త్వరలోనే హైదరాబాద్‌లోని ప్రాంతీయ యూఐడీఏఐ కేంద్రానికి వెళ్లి దర్యాప్తు చేయనున్నారు. మరోవైపు రెండు, మూడు రోజుల్లో సీఎ్‌సకు కలెక్టర్ నివేదిక సమర్పించనున్నారు. కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు సోమవారం ఉదయం జిల్లా రిజిస్ర్టార్ శ్రీరాంకుమార్‌తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధార్ గుర్తింపు కార్డును అక్రమంగా ఉపయోగించి ఏ విధంగా రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అక్రమాలు జరిగిన తీరును జిల్లా రిజిస్ర్టార్ వివరించాక పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో ఇటీవలే కేసు నమోదు కావడంతో అధికారులు దాని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం తిరుపతిలోని హెడ్ పోస్టాఫీసులో ఉన్న ఆధార్ నమోదు కేంద్రాన్ని తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్ తనిఖీ చేశారు. అక్కడ ఆధార్‌లో వివరాల మార్పుకు సంబంధించి అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. కేవలం హెడ్ పోస్టాఫీసులోనే కాకుండా బ్యాంకులు, ఆధార్ నమోదు కేంద్రాలు, ఆన్‌లైన్... ఇలా వివిధ మార్గాల ద్వారా ఆధార్ గుర్తింపు కార్డులో వివరాలు మార్చుకునే అంశాలను తెలుసుకున్నారు. అయితే ఇక్కడ పూర్తి వివరాలు తెలిసే ఆస్కారం లేదని అధికారులు గుర్తించారు.
కస్టడీలోకి తీసుకుని..
తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశారు. వీరికి న్యాయమూర్తి రిమాండ్ ఇచ్చే సమయంలోనే నిందితులను కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఏ ఆధార్ నమోదు కేంద్రం ద్వారా అక్రమాలకు తెర లేపారు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, దీనికి ప్రధాన కారకులు ఎవరనే వివరాలను నిందితుల నుంచి సేకరించనున్నారు.
ప్రాంతీయ కార్యాలయానికి..
సాంకేతికపరంగా ముందుకు వెళ్తేనే దర్యాప్తు సాధ్యమవుతుందని పోలీసులు గుర్తించారు. ఆధార్ గుర్తింపు కార్డులో వివరాలు మార్చుకునేందుకు సమర్పించే వివరాలు, ధ్రువీకరణ పత్రాలు అన్నీ సాఫ్ట్‌వేర్‌లోకి ఎక్కించిన తర్వాత కోడింగ్‌లోకి మారుతుందని దర్యాప్తు సమయంలో గుర్తించారు. ఆ వివరాలు అన్నీ సాధారణ నమోదు కేంద్రాల్లో చూసే వీలుండదని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు.
అక్కడ ఆధార్ గుర్తింపు కార్డుల్లో పేర్లు ఎలా నమోదు చేశారనే వివరాలు సేకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అసలు అక్రమార్కులు ఆధార్ గుర్తింపు కార్డులో ఇంటి పేరు, పేరు, తండ్రి పేరు, చిరునామా మార్చేందుకు ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. అవి అసలువా, నకిలీవా అనే సమాచారాన్ని సేకరించనున్నారు. మొత్తంగా రెండు రోజుల్లో కలెక్టర్, ఎస్పీలకు ప్రాథమిక నివేదికను అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత దర్యాప్తు పురోగతి ఆధారంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది.
ఇవి కూడా చదవండి
ఫ్యూచర్‌సిటీకి ఉద్ధండాపూర్ నీళ్లు!
కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..