ఆ ఇల్లు షర్మిలదే!
ABN , Publish Date - Oct 29 , 2026 | 04:42 AM
బెంగళూరు యలహంకలోని ఆస్తి విషయంలో జగన్, షర్మిల మధ్య వివాదంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది! జగన్ తనదేనని వాదిస్తున్న షర్మిల ఇల్లు ఆమెదేనని చెప్పడానికి...
కుమార్తె అంజలిరెడ్డి ఏడో పుట్టినరోజున గృహప్రవేశం
2009 జనవరి 16న తండ్రి వైఎస్ ఆధ్వర్యంలో యలహంకలో శుభకార్యం
వైఎస్ కుటుంబ సభ్యులందరూ హాజరు.. నాడు ప్రముఖ ఆంగ్లపత్రికలో కథనం
ఆ ఇల్లు షర్మిలదేనని చెప్పడానికి ఇదే రుజువని అంటున్న బంధువులు
జగన్ తనదేనని పేచీ పెట్టడంపై ఆవేదన
(అమరావతి-ఆంధ్రజ్యోతి): బెంగళూరు యలహంకలోని ఆస్తి విషయంలో జగన్, షర్మిల మధ్య వివాదంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది! జగన్ తనదేనని వాదిస్తున్న షర్మిల ఇల్లు ఆమెదేనని చెప్పడానికి రుజువులు ఉన్నాయని బంధువులు స్పష్టం చేస్తున్నారు. నాడు షర్మిల గృహప్రవేశ కార్యక్రమానికి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారని స్పష్టం చేశారు. కానీ తల్లి వాదనలతో కుమారుడు జగన్ ఏకీభవించడం లేదు. ఆ ఇల్లు తన కష్టార్జితమని వాదిస్తున్నారు. అయితే జగన్ తనదని వాదిస్తున్న యలహంకలోని షర్మిల ఇల్లు ఆమెదేనని చెప్పడానికి రుజువులు ఉన్నాయని బంధువులు స్పష్టం చేస్తున్నారు.
నాడు ప్రముఖ ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఉటంకిస్తున్నారు. 2009 జనవరి 16వ తేదీన వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ రోజు ఆమెకు బేగంపేట విమానాశ్రయంలో వైఎస్ వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన నేరుగా బెంగళూరులోని యలహంకకు వెళ్లారు. మనుమరాలు అంజలిరెడ్డి ఏడో పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ కుమార్తె షర్మిల గృహప్రవేశ కార్యక్రమంలో వైఎస్ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. వ్యక్తిగత కార్యక్రమం అయినందున షర్మిల గృహ ప్రవేశానికి సంబంధించిన సమాచారం అప్పట్లో తెలుగు పత్రికల్లో ప్రచురితం కాలేదు.
కానీ ఒక ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రిక షర్మిల గృహప్రవేశం వైఎస్ ఆధ్వర్యంలో జరిగిందంటూ ప్రచురించింది. కుటుంబ సభ్యులు పాల్గొన్న విషయాన్ని కూడా రాసింది. యలహంకలోని ఆ ఇంటిని షర్మిలకు రాజశేఖరరెడ్డి నిర్మించారని, ఈ ఇల్లు షర్మిలదేనని చెప్పడానికి ఆయనే దగ్గరుండి గృహప్రవేశ శుభకార్యక్రమాన్ని చేయించడమే ఇందుకు రుజువని బంధువులు చెబుతున్నారు. నాడు ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తున్నారు. మనవరాలు అంజలిరెడ్డిపై వైఎస్‌కు ఉన్న ప్రేమతో 2009 జనవరి 16న యలహంకలోని షర్మిల ఇంట్లో జరిగిన గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరు కావడమే ఉదాహరణ అని చెబుతున్నారు. దీన్నిబట్టి ఆ ఇల్లు షర్మిలదేనని స్పష్టమవుతోందని అంటున్నారు. ఇందుకు కుటుంబ సభ్యులు కూడా సాక్షులని చెబుతున్నారు. తండ్రి వైఎస్ మరణించడంతో షర్మిల ఇల్లు కూడా తనదేనని జగన్ వాదిస్తుండటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యలహంకలోని ఇంట్లో షర్మిల తన కుమార్తె అంజలిరెడ్డి వివాహం చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఆహ్వాన పత్రికలు కూడా పంచారు. అప్పటి నుంచి వివాదం మొదలైంది. షర్మిల ఇంట్లో మేనకోడలి పెళ్లి చేయడానికి వీల్లేదని జగన్ అడ్డుపుల్ల వేశారు. పెళ్లి వేడుకకు ఆ భవనం ఇచ్చేందుకు అభ్యంతరం చెబుతూ ఇందుకు భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని సాకులు చెప్పారు. ఇదే విషయాన్ని షర్మిలకు లేఖ ద్వారా తెలియజేశారు. షర్మిల ఇంటిని కూడా ‘నా నివాసం’ అని లేఖలో పేర్కొన్నారు. దీంతో వైఎస్ పిల్లల ఆస్తి వివాదం మరోసారి రచ్చకెక్కింది.
ఆడబిడ్డ పుట్టింటి నుంచి మెట్టినింటికి గౌరవంగా వెళ్లాల్సిన సమయంలో జగన్ పెళ్లికి అడ్డుపుల్లలు వేయడం, తన ఇంటిపై వివాదం చేయడం ఏంటని షర్మిల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షర్మిల బంధువులు కూడా జగన్ వైఖరిని తప్పు పడుతున్నారు. ఆ ఇల్లు ముమ్మాటికీ షర్మిలదేనని చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట