జగనన్నా.. ఇళ్లన్నీ నీవేనా?
ABN , Publish Date - Oct 27 , 2026 | 03:43 AM
తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇద్దరు పిల్లల్నీ రెండు కళ్లుగా భావించి, ప్రతి చోటా రెండు భవనాలు కట్టించారని షర్మిల.. బంధువులు, సన్నిహితుల వద్ద అంటున్నారు. బెంగళూరు యలహంకలో రెండు భవనాలున్న ఆస్తి మొత్తం తన అన్న జగన్‌దే అయితే, వైఎస్ ప్రతిచోటా తమ ఇద్దరికీ పక్కపక్కనే కట్టించినవన్నీ ఆయనవేనా అని ఆవేదన చెందుతున్నారు.
వైఎస్‌కు ఇద్దరు పిల్లలూ రెండు కళ్లు
అందుకే ప్రతిచోటా రెండు భవనాలు కట్టించారు
యలహంక ఆస్తి మొత్తం జగన్‌దే అయితే
ఇడుపులపాయలోని భవంతీ ఆయనదేనా?
నాన్న చనిపోయాక ఆస్తి కాజేసేందుకు కుట్రలు
బంధువులు, సన్నిహితుల వద్ద షర్మిల ఆవేదన
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇద్దరు పిల్లల్నీ రెండు కళ్లుగా భావించి, ప్రతి చోటా రెండు భవనాలు కట్టించారని షర్మిల.. బంధువులు, సన్నిహితుల వద్ద అంటున్నారు. బెంగళూరు యలహంకలో రెండు భవనాలున్న ఆస్తి మొత్తం తన అన్న జగన్‌దే అయితే, వైఎస్ ప్రతిచోటా తమ ఇద్దరికీ పక్కపక్కనే కట్టించినవన్నీ ఆయనవేనా అని ఆవేదన చెందుతున్నారు. యలహంకలోని షర్మిల ఇంట్లో ఆమె కుమార్తె అంజలిరెడ్డి వివాహ వేడుకకు జగన్ అడ్డుపుల్లలు వేయడం, ఆ ఇల్లు ఇవ్వనని అభ్యంతరం చెప్పడం, ఆ ఇంటితో పాటు మొత్తం ఆస్తిని ఆయన ‘నా నివాసం’గా పేర్కొనడంపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వరుస కథనాలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
సామాన్యులు, రాజకీయ వర్గాలు, షర్మిల బంధువులు, సన్నిహితులలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. తల్లి విజయలక్ష్మి, షర్మిలతో బంధువులు ఇటీవల ఈ అంశంపై మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా షర్మిల తన మనసులోని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ బతికుండగా ప్రతిచోటా రెండు భవనాలను ఎందుకు కట్టించారని, ఇద్దరు పిల్లలకు చెందాలనే కదా అని వాపోతున్నారు. యలహంకలో రెండు భవనాలు జగన్‌వే అయితే, ఇడుపులపాయ ఎస్టేట్‌లో కట్టించిన రెండు భవనాల హక్కుదారు జగనేనా అని నిలదీస్తున్నారు. వైఎస్ బతికున్నప్పుడు వచ్చినప్పుడు ప్రతి చోటా జగన్ ఇంట్లో గాక, తన ఇంట్లోనే ఉండేవారని అంటున్నారు.
ఈ ఏడాది మార్చి 26వ తేదీన తన తల్లి విడుదల చేసిన అఫిడవిట్‌లో యలహంకలోని ఒక భవనం షర్మిలది అని ఇవ్వలేదా అని ప్రశ్నిస్తున్నారు. తన తండ్రి వైఎస్ హఠాన్మరణం అనంతరం చెల్లెలికి న్యాయపరంగా చెందాల్సిన అస్తులపై కన్నేసి తన పేరు మీద లేవంటూ జగన్ కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేనకోడలు, మేనల్లుడికి చెందాల్సిన ఆస్తులను కాజేయాలని చూసే జగన్ కంస మామ కాకపోతే మరేమిటని వాపోతున్నారు. జగన్‌కు దమ్ముంటే వైఎస్ ప్రతి చోటా రెండు భవనాలు ఎందుకు కట్టించారో సమాధానం చెప్పాలంటూ బంధువుల వద్ద షర్మిల సవాల్ విసురుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్