Share News

చొక్కా మడతపెట్టా...ఎవరొస్తారో రండి

ABN , Publish Date - Oct 28 , 2026 | 04:50 AM

‘చొక్కా మడతపెట్టాను. ఎవరొస్తారో రండి... చూద్దాం’ అంటూ మాజీ ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తిరగబడండి.. మీ వెంట నేనుంటానంటూ వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రాబోయేది 2.0 జగన్‌ సర్కారేనంటూ ప్రగల్భాలు పలికారు.

చొక్కా మడతపెట్టా...ఎవరొస్తారో రండి

పులివెందుల కార్యకర్తల భేటీలో వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలు

భారతాన్ని తలపిస్తున్న స్థానికం

చంద్రబాబుది శకుని క్యారెక్టర్‌

మాయాపాచికలతో ఎన్నికలు

మా వాళ్లపై వేటుపడితే నా మీద

పడ్డట్టే.. వచ్చేది 2.0 జగన్‌ సర్కారు

ఏ అధికారినీ వదిలిపెట్టను..

రిటైరైనా పట్టుకొస్తానని హెచ్చరిక

తిరగబడాలని శ్రేణులకు పిలుపు

పులివెందుల, కడప, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ‘చొక్కా మడతపెట్టాను. ఎవరొస్తారో రండి... చూద్దాం’ అంటూ మాజీ ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తిరగబడండి.. మీ వెంట నేనుంటానంటూ వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రాబోయేది 2.0 జగన్‌ సర్కారేనంటూ ప్రగల్భాలు పలికారు. పులివెందులలోని బాకరాపురంలోని వైఎస్‌ ఆడిటోరియంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలు భారతాన్ని తలపిస్తున్నాయని, ఇందులో చంద్రబాబుది శకుని క్యారెక్టర్‌ అంటూ జగన్‌ నోరు పారేసుకున్నారు. మాయాపాచికలతో ఎన్నికలు జరిపిస్తున్నారని, ఇదంతా చూస్తుంటే తనకు కౌరవుల కుతంత్రాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. ‘‘40 వార్డులు ఉన్న పులివెందులలో 20 వార్డుల్లో నామినేషన్లు వేయించలేదు. కడప జిల్లాలో 39 జడ్పీటీసీలకు గాను 17 జడ్పీటీసీలకు పోటీలేకుండా చేశారు.’’ అని తెలిపారు.


కడప మేయర్‌ అభ్యర్థి బండి దీప్తి గెలుపు లక్ష్యంగా తెగించి పోరాడాలన్నారు. ఒకవేళ పోలీసులు కేసులు పెడితే వైసీపీ తిరిగి అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని జగన్‌ అన్నారు. పోలింగ్‌కు ఒకరోజు ముందు నుంచే తాను పులివెందులలో ఉంటానని చెప్పారు. పులివెందులలో కొడితే సౌండ్‌ రాష్ట్రమంతా వినిపించాలంటూ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓటింగ్‌ ముందు రోజు రాత్రి ఇక్కడకే వస్తా, బూత్‌లోకి వెళ్లి ఓటు వేస్తా. అన్యాయం చేయడానికి ముందుకొచ్చే వాళ్లు రావాలి. షర్ట్‌ హ్యాండ్స్‌ ఎలాగో మడిచాం. ఎంతమంది వస్తారో రావాలి.’’ అని ప్రగల్బాలు పలికారు. ‘‘మూడేళ్లు అయిపోయాయి. వచ్చే ఏడాది సెప్టెంబరులో పాదయాత్ర మొదలవుతుంది. వచ్చేది 2.0 జగన్‌ సర్కారే.

నేను 1 అయితే, కార్యకర్తలు 2.. మా వాళ్ల మీద వేటు పడితే, అది నామీద పడినట్టేనని పులివెందుల పోలీసులకు చెబుతున్నా. ఏ అధికారినీ వదిలిపెట్టం. రిటైర్‌ అయినా కూడా తీసుకొస్తాం.’’ అని హెచ్చరించారు. విపక్షంలో ఉన్నప్పుడు అరెస్టులు జరుగుతాయి, కేసులు పెడతారు, ఇబ్బందులపాలు చేస్తారన్నారు. పోలీసులను అడ్డుపెట్టి నామినేషన్లు కూడా వేయనివ్వకుండా ఇష్టమొచ్చినట్లు టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి విమర్శించారు. పులివెందులలో నామినేషన్‌ వేసేందుకు యుద్ధం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 04:50 AM