Share News

రిటర్నింగ్‌ ఆఫీసర్లే చంద్రబాబుకు ఏజెంట్లు

ABN , Publish Date - Oct 30 , 2026 | 01:30 AM

రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిటర్నింగ్‌ ఆఫీసర్లే సీఎం చంద్రబాబుకు ఏజెంట్లుగా పనిచేశారని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను చించేశారని అన్నారు.

రిటర్నింగ్‌ ఆఫీసర్లే చంద్రబాబుకు ఏజెంట్లు

  • వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు వారే చించేశారు

  • కూటమి నేతల బియ్యం అక్రమ వ్యాపారం

  • ఇప్పుడు సీజూ లేదు, షిప్పూ లేదు

  • పార్టీ నేతలతో సమావేశంలో జగన్‌

అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిటర్నింగ్‌ ఆఫీసర్లే సీఎం చంద్రబాబుకు ఏజెంట్లుగా పనిచేశారని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను చించేశారని అన్నారు. గురువారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలతో సమావేశమయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా ఉండగా స్థానిక ఎన్నికలు సజావుగా సాగవని రుజువైందని అన్నారు. స్వయంగా రిటర్నింగ్‌ అధికారులే ప్రత్యర్థి పార్టీల నామినేషన్లను చించేయడం తొలిసారిగా చూస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేంత వరకూ కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలపై వీడియోలు, ఫొటోలను తీస్తూ ఆధారాలు సేకరించాలని పార్టీ నేతలను ఆదేశించారు. భవిష్యత్తులో కూటమి నేతలపైనా, ఎన్నికల యంత్రాంగంపైనా దర్యాప్తు చేపట్టి, శిక్షలు వేసేందుకు ఈ ఆధారాలు సాక్ష్యాలుగా నిలుస్తాయన్నారు.


తుఫాన్‌ బాధితులను ఆదుకోండి

రాష్ట్రంలో ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా వంటి కార్యక్రమాలు నిర్వీర్యమై పోయాయని అన్నారు. ఎల్‌నినోతో పంటలు పండే పరిస్థితి లేని సమయంలో కూటమి నేతలు బియ్యం అక్రమ వ్యాపారానికి తెరతీశారని ఆరోపించారు. తుఫాన్‌ బాధితులను వైసీపీ నేతలు ఆదుకోవాలని సూచించారు.

గతంలో వైసీపీ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని ఆరోపిస్తూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కాకినాడ పోర్టులో ‘సీజ్‌ ద షిప్‌’ అని అన్నారని, ఇప్పుడు సీజూ లేదు, షిప్పూలేదని జగన్‌ వ్యాఖ్యానించారు. సీసీ కెమెరాలతోనే పంట నష్టాన్ని అంచనా వేశానని చంద్రబాబు గొప్పగా చెబుతున్నారని, పంట నష్టాన్ని అస్తవ్యస్తంగా చేస్తున్నారని ఆరోపించారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 01:30 AM