Share News

వైసీపీలో జగన్ ఒక్కరే నేత.. మేమంతా కార్యకర్తలం: సజ్జల రామకృష్ణారెడ్డి

ABN , Publish Date - Aug 30 , 2026 | 02:01 PM

వైసీపీలో అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా కౌంటర్ ఇస్తూ.. వైసీపీకి జగన్ ఒక్కరే నేత అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు..

వైసీపీలో జగన్ ఒక్కరే నేత.. మేమంతా కార్యకర్తలం: సజ్జల రామకృష్ణారెడ్డి
Sajjala Ramakrishna Reddy

అమరావతి, ఆగస్టు 30: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. విజయసాయి సొంత కారణాలతోనే వైసీపీని వీడారని, ఆయన పార్టీని ఎందుకు విడిచిపెట్టారో ఎవరికీ తెలియదని అన్నారు. తాను వ్యక్తిగత కారణాలతో పార్టీ నుంచి బయటకు వెళ్తున్నట్లు విజయసాయే చెప్పారని గుర్తుచేశారు. పార్టీని వీడిన వారి గురించి వైఎస్ జగన్ ఎప్పుడూ నెగిటివ్‌గా మాట్లాడలేదని స్పష్టం చేశారు. జగన్‌పై, వైసీపీపై విమర్శలు చేయడానికి ప్రస్తుతం పాత్రలు మాత్రమే మారుతున్నాయని.. జగన్ నాయకత్వాన్ని టార్గెట్‌ చేసి దాడి చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. 40 ఏళ్లుగా జగన్ వెంట ఉన్న వ్యక్తిగా విజయసాయి ఆరోపణలు చేయడం సరికాదన్నారు.


వైసీపీ అంటే ఒక కోటరీ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని సజ్జల అన్నారు. విజయసాయి ఆరోపణల వల్ల పార్టీలో అపోహలు ఏర్పడే అవకాశం ఉన్నందున వాటిని తొలగించేందుకే ఈ వివరణ ఇస్తున్నట్లు తెలిపారు. విజయసాయికి జగన్ పార్టీలో నంబర్‌-2 స్థానం కల్పించారని, వైసీపీలో ఆయనకు వచ్చినన్ని పదవులు మరెవరికీ రాలేదని పేర్కొన్నారు. జగన్ నంబర్‌-2, సజ్జల నంబర్‌-1 అని విజయసాయి చెప్పడం సరికాదన్నారు. వైసీపీకి కర్త, కర్మ, క్రియ వైఎస్ జగనేనని.. పార్టీలో జగన్ ఒక్కరే నేత, మిగతా వారంతా కార్యకర్తలేనని స్పష్టం చేశారు. తనపై వచ్చే ఆరోపణలను తాను ఎప్పుడూ పట్టించుకోలేదని, పదవులు కాదని, జగన్‌తో ఉన్న అనుబంధమే తన అదృష్టమని సజ్జల పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ వైసీపీ వేగంగా పుంజుకుంటోందని ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

టీమిండియా మ్యాచ్‌లకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు.. కారణం ఇదేనా!

51 ఏళ్ల వయసులో ‘ఫైఫర్’.. 94 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మహిళా క్రికెటర్!

Updated Date - Aug 30 , 2026 | 02:10 PM