అమరావతి భేష్
ABN , Publish Date - Sep 19 , 2026 | 04:06 AM
రాజధాని అమరావతి పనులపై ప్రపంచ బ్యాంకు సంతృప్తి వ్యక్తం చేసింది. పనుల పురోగతిపై ప్రశంసలు కురిపించింది. ఆగస్టు 18న జారీచేసిన తాజా అమలు స్థితి నివేదికలో అమరావతి పనులు తిరిగి పట్టాలెక్కాయంటూ పేర్కొంది. తాము విడుదల చేసిన నిధులు సద్వినియోగం అవుతున్నాయని తెలిపింది.
అమరావతి భేష్
పనుల్లో పురోగతి.. నిధులు సద్వినియోగం
నివేదికలో ప్రపంచ బ్యాంకు సంతృప్తి
ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణలో జోరు
తొలి ఏడాది లక్ష్యాల్లో గడువులోపే పనులు పూర్తి
అందుబాటులో ఇళ్లకోసం సీఆర్‌డీఏ ప్రణాళిక
వరల్డ్ బ్యాంక్ నివేదికలో వెల్లడి
అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి పనులపై ప్రపంచ బ్యాంకు సంతృప్తి వ్యక్తం చేసింది. పనుల పురోగతిపై ప్రశంసలు కురిపించింది. ఆగస్టు 18న జారీచేసిన తాజా అమలు స్థితి నివేదికలో అమరావతి పనులు తిరిగి పట్టాలెక్కాయంటూ పేర్కొంది. తాము విడుదల చేసిన నిధులు సద్వినియోగం అవుతున్నాయని తెలిపింది. రాజధాని అమరావతి సమగ్ర పట్టణాభివృద్ధి కార్యక్రమానికి వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సహకారం కొనసాగుతోంది. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవల్‌పమెంట్ ప్రోగ్రాం కింద సుమారు రూ.7,680.98 కోట్లు (800 మిలియన్ డాలర్లు) అసలు రుణానికి గాను సవరించిన మొత్తం సుమారు రూ.7,356.20 కోట్లు (766.20 మిలియన్ డాలర్లు)గా ఉంది. ఇందులో ఇప్పటి వరకు సుమారు రూ. 3,628 కోట్లు (377.87 మిలియన్ డాలర్లు) విడుదలయ్యాయి. అంటే దాదాపు 49.32 శాతం నిధులు ఇచ్చింది. ఆ అర్బన్ డెవల్‌పమెంట్ ప్రోగ్రాం ముగింపు తేదీని 2029 డిసెంబరు 31గా నిర్ణయించారు. ప్రపంచబ్యాంక్ ప్రకారం మూడు ప్రధాన విభాగాల కింద సాధించిన పురోగతికి అనుగుణంగా ఇప్పటి వరకు నిధులు ఇచ్చింది. ఈ కార్యక్రమ నిర్వహణ, ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ, స్థానికులకు ఉద్యోగాలు-నైపుణ్య శిక్షణ, వరదలను తట్టుకునే మౌలిక వసతుల పనుల విషయంలో తొలి ఏడాది నిర్దేశించిన లక్ష్యాల్లో ఎక్కువ భాగం నిర్దేశిత సమయానికి సాధించినట్లు నివేదిక పేర్కొంది.
ఇక అమరావతిలో కనీసం రూ. 47 కోట్లు (5 మిలియన్ డాలర్లు) చొప్పున పెట్టుబడి పెట్టే ఏడుగురు యాంకర్ ఇన్వెస్టర్లను ఆకర్షించినట్లు నివేదిక వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకు సుమారు రూ.1408 కోట్లు ప్రైవేట్ మూలధనం సమీకరించినట్లు పేర్కొంది. 2029 నాటికి ప్రైవేట్ మూలధనాన్ని సుమారు రూ. 8,636 కోట్లకు పెంచే లక్ష్యాన్ని కార్యక్రమం నిర్దేశించింది. పెట్టుబడుల సమీకరణలో భూముల మానిటైజేషన్ ప్రధాన మార్గంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అమరావతిలో ప్రాధాన్య ఆర్థిక రంగాలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు ఇప్పటివరకు 9,254 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. ఇందులో 5,058 మంది మహిళలున్నారు. అలాగే 15-24 ఏళ్ల వయసు యువత 7,602 మందికి శిక్షణ అందించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. 2029 నాటికి మొత్తం 17 వేల మందికి నైపుణ్య శిక్షణ అందించాలనే లక్షాన్ని నిర్దేశించారు.
వరద రక్షణ పనులకు వేగం...
అమరావతిలో వాతావరణ మార్పులు, వరదల ప్రభావాన్ని తగ్గించే మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తాజా నివేదిక ప్రకారం 15.41 కి.మీ వరద నివారణ పనులు పూర్తయ్యాయి. ఈ పురోగతిని స్వతంత్ర ధ్రువీకరణ సంస్థ నివేదికలు నిర్ధారించినట్లు వరల్డ్‌బ్యాంక్ తెలిపింది. ఇంక ట్రంక్, వరద రక్షణ మౌలిక వసతులకు సంబంధించి 85 పనులు ప్రారంభ దశలో ఉండగా, 14 పనులు ప్రారంభమైనట్లు నివేదిక పేర్కొంది. ఈ పనుల మొత్తం విలువ సుమారు 650 మిలియన్ డాలర్లుగా నమోదైంది.
గృహాలకు ప్రత్యేక ప్రణాళిక
అమరావతిలో అందుబాటు ఇళ్ల కోసం ప్రత్యేక విధానాల రూపకల్పన పనులు కొనసాగుతున్నాయి. డ్రాఫ్ట్ హౌసింగ్ ప్లాన్‌ను ఏపీసీఆర్‌డీఏ అంతర్గతంగా ఆమోదించినప్పటికీ, తుది ఆమోదానికి రాష్ట్ర గృహ నిర్మాణశాఖ, ప్రజల అభిప్రాయాల ప్రక్రియ మిగిలి ఉందని నివేదిక పేర్కొంది. ప్రైవేటు అభివృద్ధిలో ఇళ్ల నిర్మాణాలకు తప్పనిసరి కేటాయింపులు, అమరావతి అఫర్డబుల్ హౌసింగ్ షెల్టర్ ఫండ్ ఏర్పాటు వంటి అంశాలు చర్చలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. అమరావతి పట్టణ పాలన, నీరు, మురుగునీరు, డ్రైనేజీ, వర్షపునీటి నిర్వహణకు సంబంధించి కొత్త సంస్థాగత వ్యవస్థపై ఏపీసీఆర్‌డీఏ కసరత్తు చేస్తోంది. సమగ్ర విపత్తు ప్రమాద నిర్వహణకు సంబంధించి ముందస్తు హెచ్చరిక వ్యవస్థ మార్గదర్శకాలను రూపొందించే గడువును 2026 డిసెంబరు 31వరకు పొడిగించారు.
ఉద్యోగాలు, జాబ్‌మేళాలకు ప్రాధాన్యం
స్థానికులకు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు నెలవారీ జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నట్లు నివేదిక తెలిపింది. 2025 జూన్ 30 నాటికి 374 మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా, వారిలో 122 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొంది. శిక్షణ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
390 కి.మీ రహదారులు, 50 కి.మీ బస్‌లేన్లు
అమరావతిలో ప్రధాన మౌలిక వసతుల కింద 390 కి.మీ రహదారుల పనులు, మోటారు రహిత రవాణ మౌలిక వసతుల కింద మరో 390 కి.మీ, ప్రత్యేక బస్సు లేన్లు/బీఆర్‌టీ కింద 50 కి.మీ అభివృద్ధి చేయాలనే లక్ష్యాలను నివేదికలో పేర్కొన్నారు. అలాగే వరద ముప్పును తగ్గించేందుకు 3315 హెక్టార్ల ప్రాంతంలో కొత్తగా లేదా మెరుగుపరిచిన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాలపై ప్రస్తుతం పనులు పూర్తయ్యే కొద్దీ గణాంకాలను ఆధునీకరిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇక తాగునీరు, పారిశుధ్య సూచికల్లో ప్రస్తుత లబ్ధిదారుల సంఖ్యను మౌలిక వసతుల నిర్మాణం పూర్తయిన తర్వాతనే అప్‌డేట్ చేస్తామని వరల్డ్‌బ్యాంక్ నివేదిక పేర్కొంది.
అభివృద్ధిలో స్థానికుల భాగస్వామ్యం
అమరావతి అభివృద్ధిలో స్థానిక ప్రజల భాగస్వామ్యానికి కూడా ప్రపంచ బ్యాంకు కార్యక్రమం ప్రాధన్యమిచ్చింది. నివేదిక ప్రకారం 70 గ్రామ సమాఖ్యలు, 2450 స్వయం సహాయక సంఘాలు ఏర్పాటై పనిచేస్తున్నాయి. గ్రామ సమాఖ్యల సాధారణ సమావేశాలు ప్రతి మూడు నెలలకు నిర్వహించి పనుల పురోగతి, నైపుణ్య అవసరాలు, ఉద్యోగ మేళాలు, వ్యాపారాభివృద్ధి శిక్షణలు, ప్రజల ఫిర్యాదులపై చర్చిస్తున్నట్లు నివేదిక తెలిపింది. అమరావతిలో ఎనిమిది ప్రాంతాల్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోషియేషన్లు ఏర్పాటుచేసినట్లు నివేదిక పేర్కొంది. అనంతవరం, మందడం, ఐనవోలు, దొండపాడు, తుళ్లూరు, నిడమర్రు, నవులూరు, పెనుమాక ప్రాంతాల్లో ఇవి ఏర్పాటయ్యాయి. మొత్తం 157 బ్లాకులను ఇవి కవర్ చేస్తున్నాయి. వీటిలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం ఉందని నివేదిక వెల్లడించింది.
ఈ వార్తలనూ చదవండి...