Rayalaseema Lift Irrigation: ‘ద్రోహి’ ఎవరు..?
ABN , Publish Date - Jan 09 , 2026 | 03:28 AM
నేను ముక్కలుగా నరికి... కూకటి వేళ్లతో సహా పెకలించిన చెట్టును నువ్వెందుకు మళ్లీ బతికించలేదు? నువ్వు ద్రోహివి! రాయలసీమ ఎత్తిపోతల పథకం పై వైసీపీ అధ్యక్షుడు జగన్ వైఖరి అచ్చం ఇలాగే ఉంది.
రాయలసీమ ఎత్తిపోతలపై వైసీపీ రచ్చ
నిజాలు వదిలి నిస్సిగ్గుగా అబద్ధాలు
ఆది, అంతం జగన్ హయాంలోనే
2020లో మొదలు.. 2021 జూలై 7న ఎన్జీటీ స్టే
ఆపై మూడేళ్లు అధికారంలో ఉన్నా మొద్దునిద్రే
స్టే వెకేట్ చేయించడంలో జగన్ విఫలం
ముందే ‘ముచ్చుమర్రి’కి చంద్రబాబు శ్రీకారం
అక్కడి నుంచి వరదజలాలు ఎత్తిపోసేలా పథకం
అది కొనసాగిస్తే క్రెడిట్ దక్కదన్న జగన్ దుగ్ద
ప్రాజెక్టు పేరు, డిజైన్, హెడ్‌వర్క్ పాయింట్ మార్పు
తెలంగాణ ఫిర్యాదుతో అసలుకే మోసం
అదే జరిగి ఉంటే...
కృష్ణా వరద జలాలను రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోసి రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో చంద్రబాబు 2018లో ముచ్చుమర్రి-బనకచర్ల లిఫ్ట్‌కు డిజైన్ చేశారు. 2019లో ప్రభుత్వం మారింది. ‘ముచ్చుమర్రి’ని యథావిధిగా చేపడితే చంద్రబాబుకు మంచిపేరు వస్తుందనే దుగ్దతో... దానిపేరు, తీరూ మార్చేశారు. హెడ్ వర్క్‌ను ముచ్చుమర్రి నుంచి సంగమేశ్వరానికి మార్చారు. అలాకాకుండా... ‘ముచ్చుమర్రి’నే కొనసాగించి ఉంటే ఎలాంటి సమస్యలూ వచ్చేవి కావు. ఎందుకంటే... అది ‘ఆన్‌గోయింగ్’ ప్రాజెక్టు. తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీని ఆశ్రయించినా ‘స్టే’ వచ్చేది కాదు. ఇప్పుడు చెప్పండి.. ‘సీమ’ ద్రోహి ఎవరు?
ఇదేమి నైజం..
జగన్ మాటల్లో మర్మమేమిటి! విషయం ఏదైనా విషం చిమ్మడమే ఆయన నైజమా? 2019 ఎన్నికల ముందు ‘అమరావతి’కి జై కొట్టి, అధికారంలోకి రాగానే మూడు ముక్కలాట మొదలుపెట్టి, 2024లో ఓడిపోగానే అమరావతి అనుకూల వాదనలు చేసి, తాజాగా ‘అది రివర్ బేసిన్. అక్కడ రాజధాని కట్టకూడదు’ అనే ఆయన అవగాహనను ఏమంటారు? ‘ఎర్రబస్సు రాని చోటికి ఎయిర్ బస్సు ఎందుకు?’ అని భోగాపురం విమానాశ్రయాన్ని గేలి చేసి... అక్కడ తొలివిమానం దిగగానే ఆ ఎయిర్‌పోర్టు తన ఘనతే అని ప్రకటించుకునే తీరును ఎలా అర్థం చేసుకోవాలి? రాయలసీమకు నిజంగా మేలు చేసే ‘ముచ్చుమర్రి-బనకచర్ల’ లిఫ్టును మూలకు నెట్టి, రాజకీయ కారణాలతో ‘సీమ లిఫ్టు’ను మొదలుపెట్టి, అది తన హయాంలోనే అటకెక్కినప్పటికీ... ‘చంద్రబాబు సీమ ద్రోహి’ అంటున్న జగన్ తెగింపును ఏమనాలి? ఆయన రాజకీయాలకు ఏ పేరు పెట్టాలి?
ఎప్పుడేం జరిగింది?
2020 మే 5: నాటి జగన్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్‌కు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ‘ఇది కొత్త ప్రాజెక్టు. నేనే మొదలుపెట్టా’ అంటూ ఆర్భాటం చేశారు. పర్యావరణ అనుమతులూ రాలేదు.
2021 ఫిబ్రవరి 27: రాయలసీమ లిఫ్టు పనులు ప్రారంభించారు. 24 శాతం పనులు చేసి దాదాపు రూ.923 కోట్లు ఖర్చు చేశారు. ఇవన్నీ... దాదాపుగా మట్టి పనులే. అంటే, కాంట్రాక్టరుకు సులువుగా డబ్బులు తెచ్చిపెట్టే పనులు. అంతేతప్ప కాంక్రీటు పనులు సాగలేదు. లిఫ్టుకు మోటార్లు పెట్టలేదు.
2021 జూలై 7: రాయలసీమ లిఫ్ట్‌పై తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి వేసిన పిటిషన్‌పై స్పందించిన ఎన్జీటీ... ఈ పనులు ఆపి వేస్తూ ‘స్టే’ ఇచ్చింది.
2021 ఆగస్టు 7: సీమ ఎత్తిపోతలపై అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ స్పందించింది. ప్రాజెక్టు పనులు పూర్తిగా ఆపేయాలని జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2024 మార్చి 22: పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.2.65 కోట్లు అపరాధ రుసుం చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది.
వెరసి... రాయలసీమ ఎత్తిపోతల పథకం తెరమరుగైంది జగన్ హయాంలోనే! ఎన్జీటీ స్టే తర్వాతా మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ దీనిపై మిన్నకుండిపోయారు.
(కర్నూలు - ఆంధ్రజ్యోతి): ‘నేను ముక్కలుగా నరికి... కూకటి వేళ్లతో సహా పెకలించిన చెట్టును నువ్వెందుకు మళ్లీ బతికించలేదు? నువ్వు ద్రోహివి!’ ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’పై వైసీపీ అధ్యక్షుడు జగన్ వైఖరి అచ్చం ఇలాగే ఉంది. ఆ పథకానికి ఆది, అంతం జగన్ హయాంలోనే జరిగిపోయాయి. అయినా సరే... చంద్రబాబుపై నెపం వేయడం వైసీపీకే చెల్లింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన కోణంలో చేసిన వ్యూహాత్మక ప్రకటన ఆధారంగా జగన్ రోత మీడియా రచ్చ చేస్తోంది. కాస్త వెనక్కి వెళ్లి వాస్తవాలను పరిశీలిస్తే.. ‘సీమ’కు అసలు ద్రోహం చేసింది జగనే అని స్పష్టమవుతుంది. ఎలాగంటే... రాయలసీమ జీవనాడి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం.
జలాశయం ఎగువన 790-800 అడుగుల్లో కృష్ణా జలాలు ఎత్తిపోసి సాగు, తాగునీరు అందించాలనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు. రాష్ట్ర విభజన తరువాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ముచ్చుమర్రి పూర్తి చేశారు. 2017 ఆగస్టు 8న జాతికి అంకితం చేశారు. ఇక్కడి నుంచి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు-నగరి కాలువకు కృష్ణా వరద జలాలు ఎత్తిపోసేలా ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయాలని ఆనాటి ఇంజనీర్లను ఆదేశించారు. అప్పటి కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ నారాయణరెడ్డి (జగన్ ప్రభుత్వంలో ఈఎన్‌సీగా పని చేసి రిటైర్డ్ అయ్యారు) సూచనలతో సాగునీటి అధికారులు ఏడాదికిపైగా క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేసి.. వరద సమయంలో రోజుకు మూడు టీఎంసీలు చొప్పున ఎత్తిపోసి బనకచర్ల ఎగువన ఎస్‌ఆర్‌ఎంసీలో పోసి, అక్కడి నుంచి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కాలువలతో పాటు కుందూ నదిలో మళ్లించేలా ముచ్చుమర్రి-బనకచర్ల లిఫ్ట్‌కు డిజైన్ చేశారు. దాదాపు రూ.3,600 కోట్లు అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను 2018 ఆఖరులో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అదే సమయంలో సాధారణ ఎన్నికలు రావడంతో ఈ ప్రాజెక్టుకు కదలిక రాలేదు.
జగన్ వచ్చాక జాదూ...: అప్పటికే ముచ్చుమర్రి లిఫ్ట్ పథకాన్ని జాతికి అంకితం చేయడంతో... అక్కడి నుంచే మరో లిఫ్ట్ చేపడితే న్యాయ చిక్కులు, పర్యావరణ అనుమతుల వంటి సమస్యలు తలెత్తేవి కావు. దాదాపు 13-14 కిలోమీటర్లు లింక్ చానల్ కెనాల్ తవ్వకానికి భూ సేకరణ మాత్రం చేయాల్సి వచ్చేది. కానీ... జగన్ హయాంలో అంతా తలకిందులైంది. వైసీపీ ప్రభుత్వంలో ఈఎన్‌సీగా కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ నారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టారు. టీడీపీ ప్రభుత్వంలో, తన ఆధ్వర్యంలోనే రూపొందించిన ముచ్చుమర్రి -బనకచర్ల లిఫ్ట్ ప్రతిపాదనను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టును యథావిధిగా చేపడితే చంద్రబాబుకు మంచి పేరు వస్తుందనే కుట్రతో నాటి జగన్ ప్రభుత్వం ముచ్చుమర్రి దిగువన సంగమేశ్వరానికి హెడ్ వర్క్ పాయింట్‌ను మార్చేసి ‘రాయలసీమ లిఫ్ట్’గా మార్చేసింది. సంగమేశ్వరం నుంచి రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ఎస్‌ఆర్‌ఎంసీలో పోసేలా డిజైన్ మార్పు చేశారు. ఇది తామే చేపడుతున్న కొత్త ప్రాజెక్టుగా, తమ ఘనతగా ప్రచారం చేసుకున్నారు. అయితే... ఈ ప్రాజెక్టును ఆపాలంటూ తెలంగాణకు చెందిన శ్రీనివాస్ ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేసింది. దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం రూ.3,825 కోట్ల అంచనాతో 2020 మే 5న నాటి జగన్ ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. దీనికి పర్యావరణ అనుమతులు లేవు. అదే ఏడాది ఆగస్టు 15న టెండర్లు పిలిచింది. ఎస్‌పీఎన్‌ఎల్-ఎన్‌సీసీ-ఎంఈఐఎల్ (మేఘా) జాయింట్ వెంచర్ (జేవీ)గా ఈ పనులు దక్కించుకుని 2021 ఫిబ్రవరి 27న పనులు ప్రారంభించారు. 24 శాతం పనులు చేసి దాదాపు రూ.923 కోట్లు ఖర్చు చేశారు. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టిందని అప్పటి తెలంగాణ ప్రభుత్వం ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్లింది. డీపీఆర్ తయారీ ముసుగులో క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు కూడా కొనసాగించవద్దని 2021 ఆగస్టు 7న ఎన్జీటీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆ రోజు నుంచి పనులు ఆపేశారని ఇంజనీర్లే చెబుతున్నారు. అయితే, తాగునీటి అవసరాల కోసమంటూ మళ్లీ పనులు మొదలు పెట్టగా.. తెలంగాణ ఎన్జీటీలో కంటెంప్ట్ వేయడంతో అదే ఏడాది పూర్తిగా పనులు ఆపేశామని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ముందస్తు అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టి పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడంతో సీపీసీబీ/ఏపీపీసీబీకి రూ.2.65 కోట్లు అపరాధ రుసుం చెల్లించాలని 2024 మార్చి 22న ఎన్జీటీ ఆదేశించింది. ఇవన్నీ జగన్ హయాంలోనే జరిగాయి. అంటే... ‘ముచ్చుమర్రి-బనకచర్ల’ వల్ల జరగాల్సిన మేలును చెడగొట్టింది జగన్! ‘రాయలసీమ లిఫ్టు’ ఆగిపోయిందీ ఆయన హయాంలోనే! మరి... సీమ ద్రోహి ఎవరు?
ఎవరు చెప్పింది నిజం...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యూహాత్మక ప్రకటనతో వైసీపీ రచ్చ చేయడం మొదలుపెట్టింది. చంద్రబాబుపై తానే ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్టు ఆపివేయించానన్న రేవంత్ మాట ల్లో నిజం లేదన్నది నిజం! బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు ప్రకటనతో ఇది స్పష్టమైంది. ‘ఎన్జీటీని ఆశ్రయించి మా హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతలను ఆపివేయించాం’ అని చెప్పారు. అంటే... జగన్ హయాంలోనే అది ఆగిపోయిందని తేల్చేశారు. ఇక.. సీమ లిఫ్టును ఆపింది ఎన్జీటీయే అని జలశక్తిశాఖ మాజీ సలహాదారు శ్రీరామ్ కూడా స్పష్టం చేశారు.
Also Read:
రూ.1.24 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం
ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10న కృష్ణా జలాలు బంద్
ఆ తప్పిదమే మా ఓటమికి కారణమైంది: బెన్ స్టోక్స్