విద్యార్థిని శివానీ ఆత్మహత్య.. ఫోరెన్సిక్‌కు సూసైడ్ నోట్
ABN , Publish Date - Jul 27 , 2026 | 08:13 PM
పోలవరం జిల్లాలో పదో తరగతి విద్యార్థిని ముర్రం శివానీ ఆత్మహత్య కేసుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న ఏపీఎఫ్‌ఎస్‌ఎల్, క్లూస్ టీమ్‌లు కీలక ఆధారాలను సేకరించాయి.
పోలవరం జిల్లా: ఇర్లపల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముర్రం శివానీ ఆత్మహత్య ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఏబీఎన్‌తో సీఐ నరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఘటనాస్థలికి ఏపీఎఫ్‌ఎస్‌ఎల్ (APFSL), క్లూస్ టీమ్‌లు చేరుకుని ఆధారాలను సేకరించాయన్నారు. దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారని, ఆ సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు సీఐ వెల్లడించారు. నివేదిక వచ్చిన తర్వాత కేసులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
కాగా, కాగా, విద్యార్థిని శివాని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మూడు రోజుల క్రితం సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్న ‘తల్లికి వందనం’ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న శివాని, చదువులో టాపర్‌గా గుర్తింపు పొందింది. షైనింగ్ స్టార్ అవార్డును సీఎం చేతుల మీదుగా అందుకుంటానని చెప్పిన శివాని ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, గ్రామస్థులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.