Share News

కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్ భేటీ.. రాష్ట్ర సమస్యలపై చర్చలు

ABN , Publish Date - Jan 28 , 2026 | 08:46 PM

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వంతో కీలక చర్చలు జరిపారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, అలాగే ఉప్పాడ సముద్ర రక్షణ గోడ వంటి అంశాలపై కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు.

కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్ భేటీ.. రాష్ట్ర సమస్యలపై చర్చలు
Pawan Kalyan

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించినట్లు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (X) వేదికగా కీలక వివరాలను వెల్లడించారు. కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌ను కలిసినట్లు పేర్కొంటూ, రాష్ట్రంలోని పలు ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు.


ఈ సమావేశంలో ముఖ్యంగా పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, అలాగే రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణం అంశాలపై చర్చ జరిగినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా భక్తులు సందర్శించే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పిఠాపురాన్ని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఒక ఆదర్శ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని తాను అభ్యర్థించినట్లు తెలిపారు. అలాగే రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పీఎం గతి శక్తి కార్యక్రమం కింద చేపట్టాలని కోరినట్లు పేర్కొన్నారు.

ఈ చర్చలు సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో జరిగాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని, వాటిని తగిన విధంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారతీయ రైల్వేలు బలమైన అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కాకినాడ జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా రైల్వే అభివృద్ధికి అందిస్తున్న మద్దతుకు అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


మరో కీలక సమావేశం గురించి కూడా పవన్ కళ్యాణ్ ఎక్స్‌లో వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో సమావేశం జరిగిందని తెలిపారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న సమస్యలు, ప్రజలకు పరిపాలనకు సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై సమగ్రంగా చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.

ముఖ్యంగా ఉప్పాడ సముద్ర రక్షణ గోడకు సంబంధించిన ప్రతిపాదనను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) సాంకేతిక సలహా కమిటీ ముందు సమర్పించేందుకు కాకినాడ జిల్లా పరిపాలనకు అవకాశం కల్పించినందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Jan 28 , 2026 | 09:20 PM