Share News

సీఎం చంద్రబాబు విజన్‌కు భోగాపురం ఎయిర్‌పోర్ట్ మరో సాక్ష్యం: ప్రధాని మోదీ..

ABN , Publish Date - Aug 01 , 2026 | 01:07 PM

ఈరోజు స్వర్ణాంధ్ర విజన్‌ సాకారానికి కీలకమైన రోజు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నేడు రూ.18 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు ఏపీని మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆయన చెప్పుకొచ్చారు.

సీఎం చంద్రబాబు విజన్‌కు భోగాపురం ఎయిర్‌పోర్ట్ మరో సాక్ష్యం: ప్రధాని మోదీ..
PM Narendra Modi

విజయనగరం: స్వర్ణాంధ్ర విజన్‌-2047 సాకారానికి నేడు కీలకమైన రోజు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రూ.18 వేల కోట్లతో ఇవాళ (శనివారం) పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు ఏపీని మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.


ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 'సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు. 13,500 మంది గిరిజన మహిళల నృత్యం అద్భుతంగా ఉంది. అభివృద్ధితోపాటు థింసా నృత్యంలోనూ నేడు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇది చంద్రబాబు విజన్‌కు మరో సాక్ష్యం. ఈరోజు రూ.18 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. ఈ ప్రాజెక్టులు ఏపీని మరింత ముందుకు తీసుకెళ్తాయి. కొత్త ప్రాజెక్టులు ఎయిర్‌, రోడ్‌ కనెక్టివిటీని పెంపొందిస్తాయి. చంద్రబాబు, పవన్‌ నేతృత్వంలో ఏపీలో డబుల్‌ అభివృద్ధి జరుగుతోంది. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో ఏపీ అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది.


దేశంలో 2014 కంటే ముందు 74 ఎయిర్‌పోర్ట్‌లు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య 166కి పెరిగింది. ఒకే కుటుంబానికి చెందిన పేర్లను విమానాశ్రయాలకు పెట్టలేదు. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు వాల్మీకి పేరు పెట్టాం. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరు పెట్టాం. చిన్న పట్టణాల నుంచి నగరాల వరకు ఎయిర్‌ సేవలు అందిస్తున్నాం. ఉడాన్‌ పథకం వల్ల ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య పెరగడమే కాదు.. విమాన ప్రయాణికుల సంఖ్యా పెరిగింది. పేదల కలలు సాకారం చేసేలా అభివృద్ధి చేస్తున్నాం. విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు పాత పోర్టుల అభివృద్ధి జరుగుతోంది. మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులను నిర్మిస్తున్నాం. ప్రధాన పారిశ్రామిక కారిడార్లనూ అనుసంధానం చేస్తున్నాం. పీఎం గతిశక్తితో రైల్‌, పోర్టు, ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధి జరుగుతోంది.


సాఫ్ట్‌వేర్‌, ఐటీ, టెక్‌ రంగాల్లో ఏపీ యువత దూసుకుపోతోంది. ప్రతిభ ఉన్న యువతకు అనేక అవకాశాలు కల్పిస్తున్నాం. విశాఖలో సెమీ కండక్టర్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేశాం. వికసిత్‌ భారత్‌కు గ్రోత్‌ ఇంజిన్‌గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. దేశంలో బ్లూ ఎకానమీ అభివృద్ధి చేస్తున్నాం. దేశానికి ఫార్మా హబ్‌గా ఏపీ మారబోతోంది. నక్కపల్లిలో మరో ఫార్మా కంపెనీ రాబోతోంది. విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ను ఆసియాలోనే గొప్ప పారిశ్రామిక కేంద్రంగా మారుస్తాం. రాయలసీమ ప్రాంతంలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం' అని మోదీ చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు: సీఎం చంద్రబాబు

రూ.17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

Updated Date - Aug 01 , 2026 | 01:54 PM