రోడ్లపై లారీలు నిలపకుండా పటిష్ఠ చర్యలు
ABN , Publish Date - Nov 29 , 2026 | 04:29 AM
జాతీయ రహదారులపై ఆగి ఉన్న లారీలు ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రమాదాల నివారణకు విజయనగరం కలెక్టర్, ఎస్పీ జాతీయ రహదారి పరిశీలన
డ్రైవర్ల విశ్రాంతి కేంద్రం, బ్లాక్‌స్పాట్ సూచికలు తక్షణం ఏర్పాటు చేయాలని సూచన
విజయనగరం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారులపై ఆగి ఉన్న లారీలు ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రామసుందరరెడ్డి, ఎస్పీ దామోదర్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జాతీయ రహదారి-16పై ఆర్టీఏ, హైవే ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రమాదాలకు కారణాలను పరిశీలించి, నివారణ చర్యలపై పలు సూచనలు చేశారు. కాగా, ఇటీవల భోగాపురం మండలం సుంకరిపేట వద్ద రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని వాహనం ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. జిల్లాలో గడిచిన నాలుగేళ్లలో రోడ్డు ప్రమాదాల్లో 744 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు.
నిలిపి ఉంచిన లారీలను ఇతర వాహనాలు ఢీకొంటున్న ఘటనలు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదాలపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ‘రోడ్డు ఇడియట్స్’.. విజయనగరం జిల్లా పేజీలో ‘ప్రమాదాల హైవే’ అన్న శీర్షికలతో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీ స్పందించారు. విజయనగరం జిల్లా నారుపేట వద్ద డ్రైవర్ల విశ్రాంతి కేంద్రం (బే)ను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. డ్రైవర్ల విశ్రాంతికి మౌలిక సదుపాయాల ఏర్పాటుతోపాటు మరుగుదొడ్లు నిర్మించాలని సూచించారు.
మొదవలస జంక్షన్‌ను అభివృద్ధి చేసి, రహదారిపైకి నీరు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. అక్కడ రహదారిని వెడల్పు చేయడంతోపాటు ట్రాఫిక్ ఐలాండ్ నిర్మించాలన్నారు. ఎన్‌హెచ్-16 నుంచి సర్వీసు రోడ్డు మీదుగా విజయనగరం రహదారికి వాహనాలు సులభంగా చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. డివైడర్లను సవరించి, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా అవసరమైన చోట కొంతమేర తొలగించాలని ఆదేశించారు. బ్లాక్స్పాట్లను గుర్తించి హెచ్చరిక, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. భోగాపురం విమానాశ్రయం నుంచి విశాఖ వైపు వెళ్లే రహదారి, జాతీయ రహదారి కలిసే చోట సర్వీసు రోడ్డును అనుసంధానం చేయాలని సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..