Share News

నౌకా నిర్మాణాలకు సహజ కేంద్రం విశాఖ

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:30 AM

నౌకల నిర్మాణానికి, మరమ్మతులకు, నిర్వహణకు, సముద్ర గర్భ సామర్థ్యాలకు విశాఖపట్నం సహజ కేంద్రం వంటిందని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌. బాలమురళీకృష్ణన్‌ అన్నారు.

నౌకా నిర్మాణాలకు సహజ కేంద్రం విశాఖ

  • రక్షణ రంగంలో విశ్వసనీయత, స్థిరత్వం చాలా ముఖ్యం

  • డీఆర్‌డీఓ డైరెక్టర్‌ జనరల్‌ బాలమురళీకృష్ణన్‌

  • విశాఖలో డెఫ్‌కోర్‌-2026 ఎక్స్‌పో ప్రారంభం

  • రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన

  • ఆకట్టుకున్న విశాఖ సంస్థ ఆవిష్కరణ ‘బ్రహ్మ కవచ్‌’

విశాఖపట్నం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): నౌకల నిర్మాణానికి, మరమ్మతులకు, నిర్వహణకు, సముద్ర గర్భ సామర్థ్యాలకు విశాఖపట్నం సహజ కేంద్రం వంటిందని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌. బాలమురళీకృష్ణన్‌ అన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో కలిసి సొసైట్‌ ఆఫ్‌ ఇండియన్‌ డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (ఎస్‌ఐడీఎం) విశాఖపట్నంలోని గాదిరాజు ప్యాలె్‌సలో ఏర్పాటు చేసిన రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన ‘డెఫ్‌కోర్‌-2026’ను హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ సీఎండీ చంద్రశేఖరన్‌ రఘురామ్‌తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు.

మూడు రోజులు నిర్వహించే ఈ ప్రదర్శనకు 50కి పైగా సంస్థలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా బాలమురళీకృష్ణన్‌ ప్రసంగిస్తూ.. డీఆర్‌డీఓ ప్రయోగాలు, ఎంఎస్ఎంఈలు, స్టార్ట్‌పలు, ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలన్నింటినీ ఈ ఎక్స్‌పో ద్వారా ఒక వేదికపైకి తీసుకురావడం హర్షణీయమన్నారు. స్వదేశీ ఉత్పత్తులతో సప్లయ్‌ చైన్‌ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రక్షణ రంగంలో విశ్వసనీయత, స్థిరత్వం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. షిప్‌యార్డ్‌ సీఎండీ చంద్రశేఖరన్‌ రఘురామ్‌ మాట్లాడుతూ.. తూర్పు నౌకాదళం, నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లేబొరేటరీ, బలమైన పారిశ్రామిక పునాదిని ఉపయోగించుకొని విశాఖను ఆసియాలో ప్రముఖ సముద్ర రక్షణ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.


నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఇతర నౌకా నిర్మాణ కేంద్రాలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐఐ ట్రేడ్‌ ఫెయిర్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, బ్లూస్టార్‌ ఎండీ త్యాగరాజన్‌, ఎస్‌ఐడీఎం చైర్మన్‌, జియో మెరైన్‌ డైనమిక్స్‌ సీఎండీ జె.శ్రీనివాసరాజు, సీఐఐ ఏపీ మాజీ చైర్మన్‌, ఫ్లూయింట్‌ గ్రిడ్‌ ఎండీ మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

శత్రు డ్రోన్ల నుంచి రక్షణకు బ్రహ్మకవచ్‌

విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే ఎంసీఐ గ్రూపు నేవీకి, కోస్ట్‌గార్డుకు, వ్యూహాత్మక ఆస్తుల రక్షణకు ఉపయోగపడే కొత్త టెక్నాలజీని రూపొందించింది. దానికి ‘బ్రహ్మ కవచ్‌’ అని నామకరణం చేసింది. ఇది ఆల్‌ డొమైన్‌ కౌంటర్‌ డ్రోన్‌. అంటే ఆకాశం, సముద్ర ఉపరితలం, నీటి లోపల నుంచి వచ్చే శత్రువుల డ్రోన్ల ముప్పును ముందే పసిగట్టి నిర్వీర్యం చేస్తుంది. ప్రపంచంలో ఇలా 360 డిగ్రీల కోణంలో పనిచేసే డ్రోన్‌ టెక్నాలజీ ఇదే కావడం విశేషం.

రాడార్లు, రేడియో ఫ్రీక్వెన్సీ, సోనార్లు, సెన్సార్ల ద్వారా ఇది మానవ రహిత విమానాలు, డ్రోన్లు, ఎఫ్‌పీవీ, స్వామ్‌, సీసర్ఫేస్‌ డ్రోన్లను గుర్తించి వాటిని నిర్వీర్యం చేస్తుంది. శత్రు డ్రోన్‌లను జామ్‌ చేయలేని పక్షంలో భౌతికంగా నాశనం చేయడానికి హార్డ్‌ కిల్లింగ్‌ విధానం అనుసరిస్తారు. బ్రహ్మ కవచ్‌ టెక్నాలజీ నేవీకి, కోస్టుగార్డుకు మాత్రమే కాకుండా పోర్టులు, హార్బర్లు, షిప్‌యార్డుల పరిరక్షణకూ ఉపయోగపడుతుంది. గత నెలలో కోస్టుగార్డు దీనిని పరీక్షించి సంతృప్తి వ్యక్తంచేసింది. త్వరలోనే ఈ టెక్నాలజీ భారత రక్షణ రంగం ఉపయోగించుకునే అవకాశం ఉంది.


భీమా రీఆర్మ్‌-డికి ఐడెక్స్‌ డిస్క్‌-14 అవార్డు

మా ఎంసీఐ గ్రూపు తయారుచేసిన భీమా రీఆర్మ్‌-డి అనే డ్రోన్‌ ఐడెక్స్‌ డిస్క్‌-14 అవార్డుకు ఎంపికైంది. సముద్రంలో ఒక నౌక నుంచి మరొక నౌకలోకి టన్ను బరువు వరకు గల వస్తువులను తీసుకువెళుతుంది. రక్షణ రంగంలో కొత్త ప్రయోగాలు చేసే స్టార్ట్‌పలకు ఇన్నోవేషన్స్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఎక్స్‌లెన్స్‌ (ఐడెక్స్‌) పోటీలు నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌ ఇచ్చి ఇంక్యుబేషన్‌ చేస్తే త్వరలోనే డ్రోన్‌ను తయారుచేస్తాం.

- డాక్టర్‌ హర్రాజ్‌ సింగ్‌ ఆనంద్‌,

డైరెక్టర్‌, ఎంసీఐ గ్రూపు

నేవల్‌ డిఫెన్స్‌ టెక్నాలజీతో బహుళ ప్రయోజనాలు

  • ‘ఆంధ్రజ్యోతి’తో ఎస్‌ఐడీఎం చైర్మన్‌ జె.శ్రీనివాసరాజు

నేవల్‌ డిఫెన్స్‌ టెక్నాలజీతో నౌకాదళానికి మాత్రమే కాకుండా అనేక రంగాలకు ఉపయోగాలు ఉన్నాయని ఎస్‌ఐడీఎం చైర్మన్‌ జె.శ్రీనివాసరాజు చెప్పారు. ఇది కూడా బ్లూ ఎకానమీలో భాగమేనన్నారు. ‘డెఫ్‌ కోర్‌-2026’ ప్రారంభం సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాలపై దృష్టిపెట్టి.. క్లస్టర్లను ఏర్పాటు చేసింది. భోగాపురంలో ఏర్పాటయ్యే ఏరోస్పేస్‌ సిటీ స్కిల్‌ సెంటర్‌లా పనిచేస్తుంది. అక్కడ శిక్షణ పొందినవారికి విదేశాల్లోను ఉపాధి అవకాశాలు వస్తాయి.

అక్కడ కూడా ప్లగ్‌ అండ్‌ ప్లేలా స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేసుకునే సౌకర్యాలు కల్పించాలని ఎస్‌ఐడీఎం తరఫున కోరాం. నౌకానిర్మాణం పెద్ద పెద్ద సంస్థలే చేపడతాయి. కానీ వాటికి అవసరమైన పైపులైన్లు, సెన్సార్లు, ఫ్యాబ్రికేషన్‌ వంటివి ఎంఎస్‌ఎంఈలే సరఫరా చేయాలి. ఈ రంగంలో ఐటీఐ, డిప్లొమా చదివిన వారి నుంచి ఇంజనీరింగ్‌, పీహెచ్‌డీ చేసిన వారివరకు అందరికీ అవకాశాలు ఉన్నాయి. సొంతంగా ఉత్పత్తులు తయారుచేసి, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునేవారికి ఈ ఎక్స్‌పో చక్కటి అవకాశం’’ అని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 04:40 AM