Share News

ఒక చిన్నాన్న హత్య.. ఇంకో చిన్నాన్నకు ఉచ్చు!

ABN , Publish Date - Sep 26 , 2026 | 04:36 AM

జగన్‌ సొంత చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో చిన్నాన్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డి వైపు ఈడీ దృష్టి సారించనున్నట్లు తెలిసింది. కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి ఈయన తండ్రి. ఈ హత్య కేసులో రూ.40 కోట్ల డీల్‌పై లోతుగా కూపీ లాగిన ఈడీ అధికారులు ఏ-2 సునీల్‌ యాదవ్‌ నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం.

ఒక చిన్నాన్న హత్య.. ఇంకో చిన్నాన్నకు ఉచ్చు!

  • ఈడీ చూపు.. జగన్‌ బాబాయి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి వైపు!

  • రూ.40 కోట్లు పెట్టే శక్తి ఉన్నది భాస్కర్‌రెడ్డికే!

  • వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న ఏ-2 సునీల్‌

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): జగన్‌ సొంత చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో చిన్నాన్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డి వైపు ఈడీ దృష్టి సారించనున్నట్లు తెలిసింది. కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి ఈయన తండ్రి. ఈ హత్య కేసులో రూ.40 కోట్ల డీల్‌పై లోతుగా కూపీ లాగిన ఈడీ అధికారులు ఏ-2 సునీల్‌ యాదవ్‌ నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. ‘అంత సొమ్ము ఇచ్చే శక్తి ఏ-1 ఎర్ర గంగిరెడ్డికి గానీ, వివేకా పీఏ కృష్ణారెడ్డికి గానీ, ఏ-3 ఉమాశంకర్‌రెడ్డికి గానీ లేవు.. అన్ని కోట్లు ఎవరు ఖర్చు చేయగలరనేది పులివెందులలో ఎవరిని అడిగినా చెబుతారు. వైసీపీ నేతల నుంచి నా ప్రా ణాలకు ముప్పుంది.. ఇంతకంటే చెప్పలేను’ అని అతడు భాస్కర్‌రెడ్డి శక్తిసామర్థ్యాలను చెప్పకనే చెప్పినట్లు సమాచారం. 2019 ఎన్నికల ముందు పులివెందులలో హత్యకు గురైన వివేకా కేసును దర్యాప్తు చేసిన సీబీఐ.. 2023 జూలైలో వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసింది.


ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన ఏ-4 దస్తగిరి.. తనకు రూ.కోటి ఇస్తామని చెప్పి రూ.75 లక్షలు మాత్రమే సునీల్‌ యాదవ్‌ ఇచ్చాడని చెప్పాడు. ఆ సొమ్ములో రూ.40 లక్షలు దస్తగిరి స్నేహితుడు మున్నా పేరుతో ఉన్న బ్యాంకు లాకర్‌ నుంచి సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు ఏ బ్యాంకు నుంచి విత్‌డ్రా చేశారు.. ఎవరి నుంచి తీసుకొచ్చి ఇచ్చారనే కోణంలో మనీ రూటింగ్‌ను సీబీఐ దాదాపు ఛేదించింది. రూ.40 కోట్ల డీల్‌లో సునీల్‌ యాదవ్‌ తీసుకున్నట్లు ఆరోపణలున్న ఐదు కోట్ల రూపాయల సంగతేంటని అతడిని ఈడీ అధికారులు అడిగారు. దస్తగిరికి ఇచ్చిన రూ.కోటి అందులోనివేనా.. ఆ డబ్బు ఎవరి నుంచి తీసుకున్నావని గురు, శుక్రవారాల్లో హైదరాబాద్‌లో సుదీర్ఘంగా జరిపిన విచారణలో ప్రశ్నించారు. డబ్బు ఎవరి నుంచి అందింది.. బ్యాంకు లావాదేవీలు, సునీల్‌తో పాటు అతడి కుటుంబ సభ్యుల బ్యాంకు స్టేట్‌మెంట్లను ముందుంచి ఈడీ అధికారులు ప్రశ్నించారు. అలాగే హత్యకు ముందు, తర్వాత మాట్లాడిన ఫోన్లు, గూగుల్‌ టేకౌట్ల ఆధారంగానూ ప్రశ్నలు సంధించి సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ఈ వివరాలతో బేరీజు వేసుకున్న ఈడీ అధికారులు.. భాస్కర్‌రెడ్డికి నోటీసులివ్వనున్నట్లు సమాచారం.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 04:38 AM