Share News

సుపారీ సొమ్ము 40 కోట్లు ఎవరిచ్చారు?

ABN , Publish Date - Sep 29 , 2026 | 04:14 AM

వివేకానందరెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. వివేకా హత్య కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సోమవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

సుపారీ సొమ్ము 40 కోట్లు ఎవరిచ్చారు?

  • రూ.40 కోట్లు ఎవరిచ్చారు?

  • వివేకా హత్య కేసులో గంగిరెడ్డిని విచారించిన ఈడీ అధికారులు

  • 7 గంటలపాటు సాగిన విచారణ

  • నేడు కూడా రావాలని ఆదేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): వివేకానందరెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. వివేకా హత్య కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సోమవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్‌పై అధికారులు గంగిరెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. వివేకా హత్య కేసులో ఇప్పటికే అప్రూవర్‌ మారిన దస్తగిరి, సునీల్‌ యాదవ్‌ను ప్రశ్నించిన ఈడీ.. వారిచ్చిన సమాచారం, దర్యాప్తులో లభించిన మరిన్ని ఆధారాల మేరకు తాజాగా ఎర్ర గంగిరెడ్డిని విచారించింది. వివేకా హత్యకు రూ.40 కోట్ల ఒప్పందంతోపాటు నగదు బదిలీపై ప్రధానంగా ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. సుమారు 7 గంటలపాటు సాగిన విచారణలో గంగిరెడ్డి నుంచి కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం. గంగిరెడ్డి విచారణలో ప్రధానంగా 2019 నుంచి ఇప్పటివరకు అతనికి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీలను ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. బ్యాంకు ఖాతాల వివరాలను గంగిరెడ్డి అధికారులకు అందించనట్లు సమాచారం. విచారణలో భాగంగా నగదు బదిలీ, సుపారీ సొమ్ము మూలాలు, ఇతర నిందితులతో ఉన్న ఆర్థిక సంబంధాలు వంటి అంశాలపై ఈడీ అధికారులు గంగిరెడ్డిని ప్రశ్నించారు.


మూలాలపైనే గురి

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ ఒప్పందం జరిగినట్లు సీబీఐ పేర్కొంది. దీంతో ఆ అంశంపైనే ఈడీ దృష్టి పెట్టింది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలం ప్రకారం.. తనకు రూ.5 కోట్లు ఇస్తామని చెప్పారని, అందులో రూ.కోటి అడ్వాన్స్‌గా అందిందని సీబీఐ పేర్కొంది. దీంతో ఈ అంశాలపై కూడా ఈడీ గంగిరెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇప్పటికే దస్తగిరికి ఇచ్చిన రూ.కోటితోపాటు మొత్తం రూ.4 కోట్లు చేతులు మారినట్టు సీబీఐ పేర్కొంది. ఆ డబ్బుకు మూలం ఏంటి?. ఎవరి దగ్గర నుంచి వచ్చింది?. ఎవరి ద్వారా దస్తగిరికి చేరింది?. సుపారీ సొమ్ములో ఇతర లావాదేవీలు ఎలా జరిగాయి?. అని గంగిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికే ఈ కేసులో సునీల్‌ యాదవ్‌ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. హత్యకు ముందు, తర్వాత సునీల్‌ బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీల వివరాలు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను ఈడీ అధికారులు పరిశీలించారు. సుపారీ ఒప్పందం, నిధుల సరఫరా వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు పూర్తిగా ఎర్ర గంగిరెడ్డికి తెలుసని సునీల్‌ యాదవ్‌ అధికారుల ముందు వెల్లడించినట్లు సమాచారం. సునీల్‌ వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు ఎర్ర గంగిరెడ్డిని వివారించారు. అనంతరం, మంగళవారం మరోసారి తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా గంగిరెడ్డిని ఈడీ అధికారులు ఆదేశించారు.

నాకు సంబంధం లేదు: గంగిరెడ్డి

ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరై తిరిగి వెళ్లే సమయంలో మీడియాతో మాట్లాడేందుకు గంగిరెడ్డి నిరాకరించారు. అయితే, ఈ కేసుతో తనకు సంబంధం లేదని, ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని వెల్లడించారు. వివేకా హత్యకు సంబంధించి లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతాలతో కూడా తనకు సంబంధం లేదని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 04:18 AM