సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో కేంద్రమంత్రి, ఏపీ బీజేపీ చీఫ్ ముఖాముఖి
ABN , Publish Date - Feb 07 , 2026 | 05:34 PM
అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ టెక్నాలజీస్ హబ్ ప్రారంభించడం మనందరికీ గర్వకారణమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఇవాళ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో జరిగిన చర్చా కార్యక్రమంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విజయవాడ, ఫిబ్రవరి 7: భారతదేశాన్ని 2047 నాటికి 'అభివృద్ధి చెందిన దేశం'గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ 2026 రూపొందించబడిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇవాళ (శనివారం) ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో జరిగిన 'వికసిత్ భారత్ బడ్జెట్ 2026' ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో బడ్జెట్ విశేషాలను, ఏపీ అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా కేంద్రమంత్రి వివరించారు.
అమరావతికి దక్కిన అరుదైన గౌరవం
ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, దేశంలోనే మొట్టమొదటి 'క్వాంటమ్ టెక్నాలజీస్ హబ్' అమరావతిలో ఏర్పాటు కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర సాంకేతిక ముఖచిత్రాన్ని మార్చివేయడమే కాకుండా, భవిష్యత్ పరిశోధనలకు వేదికగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
బడ్జెట్ 2026లో మూడు ప్రధాన స్తంభాలు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్‌లో మూడు కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర మంత్రి వివరించారు.. వీటిలో:
1. దేశీయ ఉత్పత్తి : అన్ని రంగాలలో స్వయం సమృద్ధి సాధించడం కోసం దేశీయంగా వస్తువుల తయారీని ప్రోత్సహించడం.
2. ఆర్థిక స్థిరత్వం: గ్లోబల్ మార్కెట్‌లో ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా తట్టుకునేలా భారత ఆర్థిక వ్యవస్థను శక్తివంతంగా తీర్చిదిద్దడం.
3. అందరి అభివృద్ధి: 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' నినాదంతో సమాజంలోని ప్రతి వ్యక్తిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం.
సెమీకండక్టర్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్
భారతదేశాన్ని గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే క్రమంలో కేంద్రం భారీ అడుగులు వేస్తోందని ఇరువురు నేతలు తెలిపారు. దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ హబ్‌ల నిర్మాణం కోసం రూ.40,000 కోట్లను కేటాయించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో సౌత్ కొరియన్ కంపెనీలు ఇప్పటికే రూ.749 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం శుభపరిణామమని కేంద్రమంత్రి అన్నారు. 'వికసిత భారత్' కల సాకారం కావాలంటే 'వికసిత ఆంధ్రప్రదేశ్' నిర్మాణం కూడా అంతే ముఖ్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాత్ర
ప్రభుత్వ పథకాలు, బడ్జెట్ ప్రయోజనాలను ప్రజలకు నేరుగా చేరవేయడంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మీడియా కంటే వేగంగా సమాచారాన్ని సామాన్యుడికి చేరవేసే శక్తి వారికి ఉందని, అందుకే ఇలాంటి 'అవుట్ రీచ్' ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని మాధవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సోషల్ మీడియా ప్రముఖులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి, ఏపీ బీజేపీ చీఫ్ సమాధానాలు ఇచ్చారు.
ఈ వార్తలూ చదవండి:
బీఎంసీ మేయర్ ఎన్నిక.. బీజేపీ అభ్యర్థిగా రితూ తావ్డే
ఓటుకు రూ.2వేలు పంచేందుకు సిద్ధమైన డీఎంకే.. బీజేజీ ఆరోపణ