Share News

ఏపీకి అరుదైన ఘనత.. దేశంలో తొలిసారి PM-SETU పథకం అమలు

ABN , Publish Date - May 30 , 2026 | 08:30 PM

దేశంలోనే తొలిసారిగా PM-SETU పథకం అమలు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది.

ఏపీకి అరుదైన ఘనత.. దేశంలో తొలిసారి PM-SETU పథకం అమలు
Andhra Pradesh PM SETU

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైన ఘనత లభించింది. దేశంలోనే తొలిసారిగా PM-SETU పథకం అమలు చేయనున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఈ మేరకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్టీరింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్‌కు సంబంధించిన 'స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌'కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో విశాఖ ఐటీఐల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ప్రముఖ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ భాగస్వామ్యంతో ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు.


జాతీయ స్థాయిలో రూ.60,000 కోట్ల బడ్జెట్‌తో చేపడుతున్న ఈ కార్యక్రమంలో మొదటి దశలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజ వేసింది. విశాఖ ఐటీఐల అభివృద్ధికి అకడమిక్ భాగస్వామిగా NAMTECH సంస్థ కూడా రంగంలోకి దిగింది. ఈ ప్రాజెక్టులో 'హబ్ అండ్ స్పోక్' మోడల్‌ను అమలు చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఐటీఐ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.


కోర్సు పూర్తి చేసిన వెంటనే విద్యార్థులకు నేరుగా పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే PM-SETU లక్ష్యంగా కేంద్రం పేర్కొంది. 'వికసిత్ భారత్ 2047' లక్ష్య సాధనలో భాగంగా ప్రభుత్వ ఐటీఐలను బలోపేతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ బాటలోనే నడవడానికి మరో 12 రాష్ట్రాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పరిశ్రమల భాగస్వామ్యానికి వేగంగా టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.

Updated Date - May 30 , 2026 | 08:31 PM