విశాఖ సదస్సులో 31 ఎంఓయూలు
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:25 AM
రాష్ట్రానికి పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. విశాఖపట్నంలో బుధవారం నిర్వహించిన సీఐఐ ప్రాంతీయ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడి సమక్షంలో 31 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వాటి ద్వారా రూ.21,498 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
రూ.21,498 కోట్ల పెట్టుబడులు, 56,945 ఉద్యోగాలు
మరో 33 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
విశాఖపట్నం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. విశాఖపట్నంలో బుధవారం నిర్వహించిన సీఐఐ ప్రాంతీయ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడి సమక్షంలో 31 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వాటి ద్వారా రూ.21,498 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 56,945 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గతంలో చేసుకున్న ఒప్పం దాల్లో రూ.3,518.73 కోట్లతో చేపట్టే 33 ప్రాజెక్టులకు ఇదే ప్రాంగణంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటి ద్వారా 9,449 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించినవి 8, పర్యాటకం 3, ఎంఎ్‌సఎంఈ యూనిట్లు 22 ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్ నుంచి చేసుకున్న ఎంఓయూలను గ్రౌండింగ్ దశకు తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.
ఇప్పటివరకూ రూ.22.6 లక్షల కోట్ల పెట్ట్టుబడులతో 714 ప్రాజెక్టుల ఏర్పాటుకు, వాటి ద్వారా 19.3 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు జరిగాయన్నారు. వాటిలో 473 ప్రాజెక్టుల ద్వారా రూ.16.6 లక్షల కోట్ల పెట్టుబడులు, 12.3 లక్షల ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఇవికాకుండా 247 ప్రాజెక్టులు రూ.4.7 లక్షల కోట్లతో గ్రౌండింగ్ కాగా వాటి ద్వారా 7.1 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయన్నారు. ఈ నెలాఖరుకి గ్రౌండింగ్ ప్రాజెక్టుల సంఖ్య 310కి, పెట్టుబడులు రూ.7 లక్షల కోట్లకు, ఉద్యోగ అవకాశాలు 7.9 లక్షలకు చేరనున్నాయని వెల్లడించారు. ఇక 2024 జూన్ నుంచి ఇప్పటివరకూ విశాఖపట్నం రీజియన్‌లో 196 ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయని తెలిపారు. రూ.7.9 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే ఈ కంపెనీలతో 5.37 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పా రు. వీటిలో 114 ప్రాజెక్టులకు రూ.6.12 లక్షల కోట్ల పెట్టుబడులు, 3.87 ఉద్యోగాల కోసం ప్రభుత్వ అనుమతులు ఇచ్చిందన్నారు. ఇవికాకుండా రూ. 2.19 లక్షల కోట్లతో చేపట్టే 61 ప్రాజెక్టులు గ్రౌండింగ్ కాగా వాటి ద్వారా 2.42 లక్షల మందికి ఉపాధి లభించనుందన్నారు.
ఈ వార్తలనూ చదవండి..